Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

పేదల చదువుకు పీటముడులెన్నో

దుర్లభంగా ఉన్నత విద్య
విశ్లేషించిన సామాజిక అభివృద్ధి మండలి

ఈనాడు, హైదరాబాద్‌: ‘మన దేశంలో ఉన్నత విద్య ఖరీదైన అంశంగా మారింది. ప్రధానంగా పేదలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మరీ సమస్యగా పరిణమించింది. పెద్ద చదువులు పూర్తి చేయడం సవాల్‌గా తయారైంది’’ అని సామాజిక అభివృద్ధి మండలి(కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌) స్పష్టం చేసింది. ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్‌ జంధ్యాల బి.జి.తిలక్‌, జేఎన్‌యూ సహ అధ్యాపకుడు ప్రదీప్‌ కె.చౌదరి ‘భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించడంలో పేద, ధనిక తారతమ్యాలు’ అనే అంశంపై విశ్లేషించి దీనిని రూపొందించారు. జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్‌ఎస్‌ఎస్‌వో) నివేదికల ఆధారంగా విశ్లేషించారు. 2007-08, 2013-14 సర్వేలను ఆలంబనగా చేసుకున్నారు. 2015-16 వరకూ ఉన్న వివిధ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

* సమాజంలో అసమానతలను తగ్గించడంలో పెద్ద చదువులది కీలకపాత్ర. కానీ మనదేశంలో ఇక్కడే అసమానతల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎక్కువ ఆదాయ వర్గాల వారు ముందున్నారు. పురుషులు, మహిళల మధ్య అంతరం బాగా తగ్గినా ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి. అంతరం తగ్గడం మార్పునకు నాందిగా చెప్పవచ్చు. ప్రభుత్వం విద్యను అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన కారణం.

ఆర్థికంగా భారమే
కుటుంబాలు ఉన్నత విద్యపై చేయాల్సిన వ్యయం పెరిగింది. అధ్యయనం చేసిన కాలంలోనే వ్యయం రెట్టింపు దాటిపోయింది. 2007-08లో సగటున రూ.14,532 ఉండగా 2013-14లో ఇది రూ.30,887కు పెరిగింది.
* ధనికులు పేదలకంటే 4.3 రెట్లు ఎక్కువ వ్యయం చేస్తున్నారు.
* గ్రామీణ ప్రాంతాల్లో సగటు వ్యయం రూ.10,426 నుంచి రూ.21,728కి పెరగ్గా పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.18,071 నుంచి రూ.41,979కి పెరిగింది.
* 2013-14లో ప్రభుత్వ సంస్థల్లో చదివేవారు రూ.15,000 వ్యయం చేయగా అదే కాలంలో ప్రైవేటు విద్యపై వ్యయం రూ.52,245కు పెరిగింది.

పల్లె ప్రాంతాల్లో
* 2013-14లో ఉన్నత విద్య గ్రామీణంలో 11 శాతం, పట్టణ ప్రాంతాల్లో 14.7 శాతంగా ఉంది.
* గ్రామీణ ప్రాంతాల్లో తరగతులకు హాజరు శాతం మహిళల కంటే పురుషులదే ఎక్కువ.
* పేదల హాజరు 7.9 ఉండగా ఎక్కువ ఆదాయ వర్గాల హాజరు 10.1గా ఉంది.
* ఉన్నత విద్య అభ్యసించే వయసులోని వారిలో కళాశాలల్లో ప్రవేశాలు పొందుతున్నవారి సంఖ్య గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణాల్లో ఎక్కువ. 2007-08, 2013-14 మధ్య గ్రామీణ ప్రాంతాల్లో నమోదు 8.2 శాతం నుంచి 19 శాతానికి పెరగ్గా పట్టణ ప్రాంతాల్లో 23 శాతం నుంచి 35కు పెరిగింది.

అగ్ర పథంలో తమిళనాడు
* 2015-16లో జాతీయ సగటు: 24.5 శాతం
* తమిళనాడులో 44.3 శాతం
* తెలంగాణ, చండీగఢ్‌, దిల్లీ, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా జాతీయ సగటు కంటే ఎక్కువే.
* బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశాలలో తక్కువ.
* రాష్ట్ర స్థూల ఉత్పత్తి జాతీయ సగటుకంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఉన్నత విద్య కూడా జాతీయ సగటుకంటే ఎక్కువగా ఉంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.