Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆ రెండూ దక్కాల్సినవే!

చేవెళ్ల, జహీరాబాద్‌లపై కాంగ్రెస్‌ అంతర్మథనం
అందివచ్చిన అవకాశాన్ని ‘చే’జార్చుకున్నాం
పెద్దపల్లి, ఆదిలాబాద్‌లపై ఇంకా దృష్టిసారించాల్సింది
భాజపాతో అప్రమత్తంగా ఉండాలి..
ఈనాడు - హైదరాబాద్‌

లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లిఉంటే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యేవని కాంగ్రెస్‌లో అంతర్మథనం ప్రారంభమైంది. గెలవగలిగిన చేవెళ్ల, జహీరాబాద్‌లను కోల్పోయామని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. మూడు లోక్‌సభ స్థానాల్లో నెగ్గినా కీలక స్థానాల్లో పట్టుకోల్పోవడం తెరాస, భాజపాలు ఆధిక్యాన్ని సాధించడం వంటి పరిణామాలపై కలత చెందుతోంది. కొన్ని స్థానాల్లో ప్రత్యర్థులు సాధించిన ఓట్లకు, తమకు వచ్చిన వాటికి మధ్య తీవ్ర అంతరం ఉన్నా చాలా చోట్ల గట్టిగా ప్రయత్నించి ఉంటే మరో ఒకటి రెండు స్థానాలు నెగ్గే అవకాశం ఉండేదని నేతలు పేర్కొంటున్నారు.

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని 6,229 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ కోల్పోయింది. ‘అభ్యర్థి మదన్‌మోహన్‌రావు పార్టీ స్థానిక నేతలతో ముందుకు వెళ్లారు. పీసీసీ నుంచి కొంత తోడ్పాటు అందించి ఉంటే స్థానం మాకే దక్కేది’ అని పార్టీ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు. అలాగే చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 14,772 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ‘చేవెళ్ల విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం. తక్కువ తేడాతో ఓడిపోవడం అనూహ్య పరిణామం. తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన విశ్వేశ్వర్‌రెడ్డి పూర్తి స్థాయిలో లోక్‌సభలోని అన్ని సెగ్మెంట్లపై దృష్టిసారించినా చివర్లో రాజేంద్రనగర్‌, శేరిలింగపల్లి దెబ్బతీశాయి’ అని పార్టీ నేతలు విశ్లేషించారు.

పెద్దపల్లి, ఆదిలాబాద్‌లలో భారీగానే ఓట్లు
పెద్దపల్లి, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్‌ గణనీయంగా ఓట్లు సాధించింది. పెద్దపల్లిలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను అభ్యర్థిగా నిర్ణయించినపుడు స్థానిక నేతలు కొంత వ్యతిరేకించడంతో బాటు రాష్ట్ర నేతలు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 3.46 లక్షల ఓట్లు రాగా 95,180 ఓట్లతో తెరాస నెగ్గింది. ఆదిలాబాద్‌లో తెరాస, భాజపా, కాంగ్రెస్‌ మధ్య ముక్కోణపు పోటీ జరిగింది. ఇక్కడ 58,493 ఓట్ల తేడాతో భాజపా నెగ్గింది. ఈ స్థానంలో ద్వితీయ స్థానంలో నిలిచిన తెరాస, మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌ మధ్య ఓట్ల తేడా సుమారు 4,600. ఓడిన జహీరాబాద్‌, చేవెళ్ల, ఆదిలాబాద్‌, పెద్దపల్లిలలో ప్రత్యేక దృష్టి సారిస్తే పార్టీకి మరింత సానుకూలత ఉండేదని నేతలు విశ్లేషిస్తున్నారు.

4 నెలల్లో ఇంత మార్పా...!
‘శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. నాలుగు నెలల అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండింటిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో తెరాస అధిక్యాన్ని సాధించింది. ఎంత మార్పు! ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అంశం. ఓట్లను కూడగట్టడంలో పార్టీ విఫలమైనట్లు అంగీకరించకతప్పదు’ అని పార్టీ సీనియర్‌ నేత అన్నారు.

భాజపాను ఆషామాషీగా చూడకూడదు
భాజపా నాలుగు లోక్‌సభ స్థానాల్లో నెగ్గడం అప్రమత్తం కావాల్సిన అంశమని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు. సికింద్రాబాద్‌తో బాటు ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లలో భాజపా నెగ్గడం కాంగ్రెస్‌పై ప్రభావం చూపే అంశమని దీన్ని పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని పేర్కొంటున్నారు. భాజపా నెగ్గిన నాలుగు స్థానాల్లో ఆదిలాబాద్‌ మినహా మిగిలిన మూడూ కూడా 2009 వరకూ కాంగ్రెస్‌ నెగ్గిన స్థానాలని భాజపా కేంద్రంగా కొత్త రాజకీయ సమీకరణలపై కాంగ్రెస్‌ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని విశ్లేషిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.