close

ప్ర‌త్యేక క‌థ‌నం

ముంగిట్లో గరళం ముప్పు

మురుగు కాలువల్లోనే తాగునీటి పైపులు
లీకేజీలతో కలుషితమవుతున్న జలం
3 నగరాలు, 52 పట్టణాల్లో 30ఏళ్ల నాటి పైపులైన్లు
ఈనాడు - అమరావతి

గుంటూరు ఆనందపేటలో 2018 మార్చిలో నగరపాలక సంస్థ సరఫరా చేసిన నీటిని తాగి 20 మంది మృత్యువాతపడ్డారు. మురుగు కాలువల్లో నుంచి వెళుతున్న పైపులు లీకవడంతోనే తాగునీరు కలుషితమైనట్లు విచారణలో వెల్లడైంది. సంఘటన అనంతరం ఆనందపేటలో పైపులను మార్చి బాగు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ పైపులను మార్చడానికి హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత మిన్నకున్నారు. ఫలితంగా ఇప్పటికీ అనేక పట్టణాల్లో మురుగు కాలువల నుంచి వెళ్తున్న పైపులు తుప్పు పట్టి ఉన్నాయి. చాలాచోట్ల లీకవుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గుంటూరులోనే ఇప్పటికీ 6 చోట్ల తాగునీరు కలుషితమవుతున్నా సరిచేయకపోవడం గమనార్హం.

84 చోట్ల ప్రమాద ఘంటికలు
రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే... విశాఖపట్నంలోని 12 డివిజన్లు/వార్డుల్లో, విజయవాడ, తిరుపతిలోని 8చోట్ల చొప్పున, విజయనగరంలో 7చోట్ల, శ్రీకాకుళం, గుంటూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, ఒంగోలు, అనంతపురం, కడప పట్టణాల్లో ఆరేసి చోట్ల చొప్పున, ఏలూరు, చిత్తూరు, కర్నూలులో 5 చోట్ల చొప్పున, కాకినాడలో 4 చోట్ల తాగునీరు కలుషితమయ్యే అవకాశాలున్నట్లు అధికారిక దస్త్రాలే చెబుతుండటం గమనార్హం.

అడ్డంకిగా నిధుల కొరత
సమస్య తీవ్రంగా ఉన్న పట్టణాల్లో పాత పైపుల స్థానంలో రూ.250 కోట్లతో కొత్తవి ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర క్రితం ప్రతిపాదించారు. నిధుల కొరత కారణంగా ఆలోచన ముందుకు సాగలేదు. దాంతో కీలక రంగాల్లో మౌలిక సదుపాయాల(సీఐఐ) కార్యక్రమం పేరిట అప్పట్లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణ కొలిక్కి రాకపోవడంతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.

* రాష్ట్రంలోని 110 పురపాలక, నగర పాలక సంస్థల్లో 6,435 కి.మీ. పొడవునా తాగునీటి పైపులైన్లున్నాయి. వాటిలోని 3,624 కి.మీ. పైపులు 35 నుంచి 40ఏళ్ల క్రితం వేసినవే.
* ప్రతి పాతికేళ్లకోసారి పాత పైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు పూర్తిగా అమలుకు నోచడం లేదు.
*గత పదిహేనేళ్లలో 6 నగరపాలక సంస్థలు, 23 పురపాలక సంఘాల్లోనే 755 కి.మీ. పొడవైన పాత పైపుల స్థానంలో కొత్తవి వేశారు.
* 30 ఏళ్లుగా 3 నగరాలు, 52 పట్టణాల్లో పాత పైపులకే తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు.

వెంటనే సమీక్షిస్తాం..

పట్టణాల్లో తాగునీటి పైపుల లీకేజీలను నిరోధించేలా, మురుగు కాలువల మధ్యలో నుంచి వెళ్లే పైపులను దూరంగా పెట్టేలా పురపాలక సంఘాల, నగరపాలక సంస్థల కమిషనర్లతో వెంటనే సమీక్షిస్తాం. నిధుల కొరత వాస్తవమైనా... ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో చాలాచోట్ల ఇప్పటికే లీకేజీలను అరికడుతున్నారు. మిగతాచోట్లా ప్రారంభించి పూర్తి చేయిస్తాం. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
- విజయకుమార్‌, పురపాలకశాఖ కమిషనర్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.