close

ప్ర‌త్యేక క‌థ‌నం

కొత్త రైలు ఒక్కటీ లేదు

ఈనాడు - హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వ పూర్తిస్థాయి బడ్జెట్‌  రైల్వే పరంగా తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశ కలిగించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు చేసిన కేటాయింపులు, ఇచ్చిన ప్రాధాన్యం చూస్తే అటు నిపుణుల అంచనాలు, ఇటు ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఒక్కటంటే ఒక్క నూతన లైను ప్రకటించలేదు. కొత్త రైళ్ల ఊసేలేదు. ఉన్న ప్రాజెక్టులకు నిధులు పెంచలేదు. తాత్కాలిక బడ్జెట్‌లో ఇచ్చిన నిధులనే తిరిగి కేటాయించారు. ఒకే ఒక్క కొత్త సర్వే మంజూరైంది. కాపలా లేని గేట్ల తొలగింపు.. రోడ్‌ అండర్‌ బ్రిడ్జిలు (ఆర్యూబీ), రోడ్‌ ఓవర్‌బ్రిడ్జి (ఆర్వోబీ)ల పనులకు మాత్రం నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంలో దేశవ్యాప్తంగా రైల్వేశాఖకు మూలధన వ్యయం రూ.1.60 లక్షల కోట్లు ఉంటుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ సాయంగా రూ.65,387 కోట్లు ఇస్తామని ప్రకటించారు. జోన్ల వారీగా నిధుల కేటాయింపులు, కొత్త లైన్ల మంజూరు తదితర అంశాలకు సంబంధించిన ‘పింక్‌బుక్‌’ను బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ వివరాలను దక్షిణమధ్య రైల్వే సాయంత్రం ప్రకటించింది. ఫిబ్రవరి 1న ప్రకటించిన తాత్కాలిక బడ్జెట్‌తో పోలిస్తే పూర్తిస్థాయి బడ్జెట్‌లో ద.మ.రైల్వేకు అదనంగా దక్కింది విజయవాడ, గుంటూరు బైపాస్‌; బీదర్‌- నాందేడ్‌ మధ్య కొత్త లైను మాత్రమే.

విజయవాడ, గుంటూరుకు బైపాస్‌
విశాఖపట్నం-చెన్నై మార్గంలో విజయవాడ, గుంటూరు స్టేషన్లకు బైపాస్‌ మార్గాల కోసం ట్రాఫిక్‌ సర్వే మంజూరు. విజయవాడ-మోటమర్రి లైన్‌ను.. విజయవాడ-గూడూరు మార్గంతో కలిపేలా ఈ రెండు లైన్ల మధ్యలో కొత్త మార్గం (20 కిమీ) కోసం సర్వే చేస్తారు.

భద్రతకు ప్రాధాన్యం
ద.మ.రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్‌- ఈ మూడు డివిజన్లతో విశాఖపట్నం కేంద్రంగా తూర్పుకోస్తా జోన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాజీపేట, ఏపీలో తిరుమల బాలాజీ డివిజన్లను కొత్తగా ఏర్పాటుచేయాలనే డిమాండ్లు బలంగా ఉన్నాయి. రైల్వేశాఖ మాత్రం కొత్త డివిజన్ల జోలికి వెళ్లలేదు. నిర్మాణంలో ఉన్న మార్గాల్ని పూర్తిచేయడానికే ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త జోన్‌ తూర్పుకోస్తాకు నిధులు ఏమీ కేటాయించలేదు.

ఆనవాయితీని తప్పించిన రైల్వే
కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖకు కేటాయింపులపై ఏటా రైల్వేబోర్డు ఛైర్మన్‌ విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడించే ఆనవాయితీ ఉండేది. పేరుకు ఇది పూర్తిస్థాయి బడ్జెట్‌ అయినా కేటాయింపులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు పరంగా చెప్పుకోదగ్గ అంశాలేవీ లేకపోవడంతో రైల్వేశాఖ గతంలో మాదిరి కాకుండా ఈసారి కేవలం ఒక పత్రికా ప్రకటనతో సరిపెట్టింది. రైల్వే బడ్జెట్‌ ప్రత్యేకంగా ఉన్నప్పుడు పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజే సాయంత్రం కల్లా కొత్త రైళ్లు, కొత్త లైన్ల మంజూరుకు సంబంధించిన అన్ని వివరాలు తెలిసేవి. కేంద్ర బడ్జెట్‌లో కలిపేశాక మూడు, నాలుగు రోజుల తర్వాత గానీ ఆ వివరాలు వెల్లడించడం లేదు.


 

బీదర్‌- నాందేడ్‌ మధ్య కొత్త లైను

దూరం: 155 కిమీ
అంచనా వ్యయం: రూ.5,152 కోట్లు
.. కొత్తగా మంజూరు చేసిన ఈ మార్గం కర్ణాటక రాష్ట్రం పరిధిలోకి వస్తుంది.
తెలంగాణకు కొత్త ప్రాజెక్టు, కొత్త సర్వే ఏవీ మంజూరు కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి రైలు మార్గాన్ని అనుసంధానించే కొత్త ప్రాజెక్టు ప్రస్తావన కూడా లేదు.
* ముఖ్యమైన లైన్లకు 2019-20 తాత్కాలిక బడ్జెట్‌లో కేటాయింపులను పూర్తిస్థాయి బడ్జెట్‌ అంకెలతో పోల్చి చూసినప్పుడు అక్కనపేట-మాదన్నపేట, నడికుడి-శ్రీకాళహస్తికి తప్పిస్తే వేరేవాటికి సంబంధించిన కేటాయింపుల్లో మార్పుల్లేవు. నడికుడి లైన్‌కు కూడా కేటాయింపులు తగ్గాయి. గతంలో రూ.700 కోట్లు కేటాయిస్తే తాజాగా దానిని రూ.697 కోట్లు చేశారు. అక్కనపేట-మాదన్నపేట లైనుకు కేటాయింపులను మాత్రం రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచారు. కొత్త లైన్లు, డబ్లింగ్‌కు కూడా కేటాయింపుల్లో మార్పుల్లేవు.  ఇప్పటికే ఉన్న మార్గాల్లో రెండో లైను వేయడానికి రూ.1,905 కోట్ల నుంచి రూ.2,006 కోట్లకు పెంచారు. పట్టాల మార్పిడికి రూ.657 కోట్లను రూ.752 కోట్లు చేశారు.


 

కొత్తగా మంజూరైన పనుల్లో అధిక నిధులు కేటాయించినవి..

* రోడ్‌ అండర్‌ బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.1,091 కోట్లు
* రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.400 కోట్లు
* రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి, అండర్‌ బ్రిడ్జి (స్వర్ణ చతుర్భుజి మార్గాల్లో) నిర్మాణాలకు రూ.490 కోట్లు
* గూడ్సు లూప్‌లైన్లు, అదనపు ప్లాట్‌ఫారాలకు రూ.176.17 కోట్లు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.