close

ప్ర‌త్యేక క‌థ‌నం

బస్తీ మే సవాల్‌! 

రాజధాని శివార్ల కబుర్లు 
ఈనాడు - హైదరాబాద్‌ 
బస్తీ మే సవాల్‌! 

ఒకవైపు ఆకాశ హర్మ్యాలతో గేటెడ్‌ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాలు.. మరోవైపు ఒక మనిషి వెళితే మరో మనిషి బయటికి రాలేనంత ఇరుకైన వీధులతో కూడిన మురికివాడలు..ఒకచోట సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న నైపుణ్యవంతులతో నడిచే సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు..ఇంకో చోట శ్రమజీవులు పనిచేసే కార్ఖానాలు. ఇవన్నీ రాష్ట్ర రాజధాని నగర శివారుల్లోని నియోజకవర్గాలను మినీ భారత్‌లా మార్చేశాయి. ఏపీ, దిల్లీ, కర్ణాటక, ఒడిశా, బిహార్‌, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వలస జీవులు భారీగా స్థిరపడిన  ఒక్కో నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. ఇంత మందిని కలిసి..వీరందరి ఆశీస్సులు పొంది ఎన్నికల్లో గెలవడం అంత సులభం కాదు.

 


మొత్తం ఓటర్లు 
శేరిలింగంపల్లి 
5,49,773 
ఎల్‌బీ నగర్‌ 
4,74,599 
మేడ్చల్‌ 
4,85,202 
ఉప్పల్‌ 
4,27,141 
రాజేంద్రనగర్‌ 
4,21,345 
మహేశ్వరం 
4,12,460 
కుత్బుల్లాపూర్‌ 
4,68,344



శేరిలింగంపల్లి.. సాఫ్ట్‌వేర్‌ కేంద్రం

సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమకు ఈ నియోజకవర్గమే కేంద్ర బిందువు. హైటెక్‌ సిటీని ఆనుకొని ఉండే ఈ ప్రాంతం అందుకే అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ఈ నియోజకవర్గంలో గేటెడ్‌ కమ్యూనిటీలు 40 వరకు ఉంటాయి. ఒక్కో గేటెడ్‌ కమ్యూనిటీలో 1000 నుంచి 2000 ఓటర్లు ఉంటారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు..ఉత్తర భారతంలోని రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇక్కడ ప్రచారం అంటేనే అభ్యర్థులు వణికిపోతారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాల్లో ప్రచారానికి ఎప్పుడు పడితే అప్పుడు అనుమతించరు. ఇక మురికి వాడలు..బస్తీల్లో ఏ ప్రాంతాల వారు ఉంటున్నారు? ఎక్కణ్నుంచి ఎవరు ఎప్పుడు వచ్చారో? కూడా గుర్తించడం దుర్లభమే. ఈ కారణాలతో ఈ నియోజకవర్గ అభ్యర్థులు ప్రచారం చేయడంలో అష్టకష్టాలు పడుతారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాల అసోసియేషన్ల అధ్యక్షులు..ఇతర ప్రతినిధుల ద్వారా ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. బస్తీలు..మురికివాడల్లో డబ్బు..మద్యం ఏరుల్లా పారించి ఓట్లు రాబట్టుకుంటారు. 
ఇక్కడ 200-400 ఓట్లు ఉండే బహుళ అంతస్తుల భవనాలు వేలల్లో ఉంటాయి. వాటిని ఆనుకుని ఉండే 60కి పైగా మురికివాడల్లో దాదాపు లక్షన్నరకు పైగా ఓటర్లు ఉంటారు. 


ఎల్‌బీనగర్‌.. వలస జీవుల చిరునామా

చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ నగరానికి వచ్చేవారికి చిరునామాగా   ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాన్ని పేర్కొంటారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దగా నైపుణ్యం అవసరం లేని పనులు చేసుకొని బతికే అల్పాదాయ వర్గాలు నగరానికి రాగానే నివాసం కోసం వెతుక్కునేది ఈ నియోజకవర్గ పరిధిలోనే. అందుకే ఈ ప్రాంతం గత దశాబ్ద కాలంలో అనూహ్యంగా విస్తరించింది. కొత్త బస్తీలు పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ కూడా ప్రచారం చేసుకోవడం రాజకీయ పార్టీలకు అంత సులభమైన విషయం కాదు. పక్కాగా కార్యకర్తల బలం...ప్రణాళికలు..సామాజిక వర్గాల నాయకులు..కాలనీ అసోసియేషన్ల నాయకులను మచ్చిక చేసుకునే వారినే గెలుపు వరిస్తుంది. మద్యం..డబ్బు..ఇతర ప్రలోభాలూ అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేస్తాయిక్కడ. 


మేడ్చల్‌... కార్మికులదే

మేడ్చల్‌ నియోజకవర్గం కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమ్మేళనంగా ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక వాడలూ  ఎక్కువే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. బస్తీల్లో ఇంటి అద్దెలు చాలా తక్కువగా ఉండటం వల్ల చాలామంది ఇక్కడే ఉంటూ..  నగరంలోని ఇతర ప్రాంతాల్లో పనులకు వెళ్తుంటారు. బస్తీల నాయకులు, సామాజిక వర్గాల ప్రతినిధులు, స్థానిక నేతల ఆశీర్వాదం ఉంటే తప్ప ఇక్కడ గెలవడం సాధ్యం కాదు. అందుకే వారి మద్దతు పొందేందుకు యత్నిస్తున్నారు. 
వరంగల్‌, మెదక్‌, కరీంనగర్‌ తదితర జిల్లాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి స్థిరపడుతుంటారు. 


రాజేంద్రనగర్‌.. పొరుగు వారే కీలకం

పారిశ్రామిక వాడలు విస్తరించడం, వందల్లో పరిశ్రమలు ఏర్పాటు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బిహార్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి ఇక్కడికి పనుల కోసం వచ్చి స్థిర పడ్డ ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. అత్తాపూర్‌ ప్రాంతంలో మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి వచ్చి స్థిరపడిన వారుంటారు. మణికొండ..పుప్పాల్‌గూడ..అత్తాపూర్‌ ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు..ఆపార్ట్‌మెంట్లలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు..మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా ఉంటారు. ఇలా ఈ నియోజకవర్గం వివిధ వర్గాల సమ్మిళితంగా ఉంటుంది. భిన్న వర్గాలకు చెందిన ఓటర్లను కలిసేందుకు..వారి ఆశీస్సులు పొందేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చాలా శ్రమించాల్సి వస్తుంది. కొన్ని పరిశ్రమల్లో నాలుగైదు వేల మంది కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో.. పరిశ్రమల యజమానులను మచ్చిక చేసుకోవడం ద్వారా ఓట్లు రాబట్టుకునేందుకు నేతలు ప్రాధాన్యమిస్తారు. 
కాటేదాన్‌, గగన్‌పహాడ్‌ల పరిధిలో విస్తరించిన పరిశ్రమల్లోనే దాదాపు లక్షన్నర మంది వరకూ పనిచేస్తుంటారు. 


మహేశ్వరం... అల్పాదాయ వర్గాల అడ్డా

మహేశ్వరం నియోజకవర్గం కూడా చిన్నచిన్న పనులు చేసుకునే కూలీలకు అడ్డా. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలతో పాటు..సీమాంధ్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. బాలాపూర్‌ ప్రాంతంలోనే సుమారు 2.12 లక్షల మంది, సరూర్‌నగర్‌ ప్రాంతంలో 1.02 లక్షల మంది ఓటర్లు ఉంటారు. భవన నిర్మాణ రంగం సహా చిన్నచిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఇక్కడ ఉంటారు. బస్తీల నాయకులే ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారతారు. డబ్బు, మద్యం ఈ నాయకుల చేతుల మీదుగానే సాగుతుంది. మహిళా సంఘాల గ్రూపులు కూడా ఇక్కడ ప్రభావితం చేస్తుంటాయి. 


కుత్బుల్లాపూర్‌.. పక్కా మాస్‌

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో జీడిమెట్ల పారిశ్రామికవాడ కీలకమైంది. రసాయన పరిశ్రమలు, ఫ్యాబ్రికేషన్‌ పరిశ్రమలు అనేకం ఉన్నాయి. రసాయన పరిశ్రమలు, ఇటుక బట్టీలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ నియోజకవర్గ పరిధిలో స్థిరపడ్డారు. ఇక్కడ 30 శాతం ఓటర్లు కార్మికులే. నిజాంపేట, ప్రగతినగర్‌, బాచుపల్లి ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు..బహుళ అంతస్తుల భవనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇక్కడ స్థానికుల కంటే వలస జీవుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. సామాజిక వర్గాల నాయకులు..బస్తీల్లో పలుకుబడి ఉన్న వారే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. 


ఉప్పల్‌.. తిప్పల్‌

వలస జీవులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. నాచారం, చర్లపల్లి, ఉప్పల్‌, మల్లాపూర్‌ పారిశ్రామిక వాడలు..అనేక కేంద్ర పరిశోధన సంస్థలు ఇక్కడే ఉండటం, జీవన వ్యయం చాలా తక్కువగా ఉండటంతో..ఇతర ప్రాంతాల వారు ఇక్కడి బస్తీల్లో స్థిరపడుతుంటారు. ఇక్కడ కూడా బస్తీ నాయకులు.. సామాజిక వర్గాల నాయకులే అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషిస్తారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.