close

ప్ర‌త్యేక క‌థ‌నం

నీటిని ఎగదోసిన నిప్పు

 

సాధారణంగా నీరు వల్ల నిప్పు ఆరిపోతుంది. ఇక్కడ మాత్రం నిప్పు రెచ్చిపోయి నీటిని వెల్లువలా ఎగదోసింది. ఫలితంగా ఎగసిన సునామీతో ఇండోనేసియాలో 200 మందికిపైగా బలయ్యారు. సాధారణంగా భూకంపాల వల్ల ఈ రాకాసి అలలు విరుచుకుపడుతుంటాయి. ఇప్పుడు మాత్రం అగ్నిపర్వత విస్ఫోటంతో ఈ విపత్తు చెలరేగింది. నిప్పు కణికతో నీరు ఉవ్వెత్తున విరుచుకుపడే తీరు చాలా సంక్లిష్టం, చాలా అరుదు.

ఎలా? 
తీర ప్రాంతంలోని లేదా సాగరంలోని అగ్నిపర్వత విస్ఫోటం వల్ల సునామీ ఏర్పడవచ్చు. ఈ ప్రక్రియ రెండు రకాలుగా ఉండొచ్చు. 
1. అగ్నిపర్వత విస్ఫోటం వల్ల పర్వతంలోని ఒక భాగం కుప్పకూలి ఆ శకలాలు సాగరంలో పడటం వల్ల అకస్మాత్తుగా నీరు స్థానభ్రంశం చెంది ఈ తరంగాలు ఏర్పడవచ్చు. 
2. అగ్నిపర్వతంలోని శిలాద్రవ వాయువులు, భూగర్భ జలానికి సంబంధించిన ఆవిరిని వెదజల్లే ఫ్రియాటోమ్యాగ్మాటిక్‌ విస్ఫోటం సంభవించినప్పుడు అగ్నిపర్వత శిలాద్రవ గది కుప్పకూలడం లేదా  నీట మునగడం వల్ల కూడా ఇది జరగొచ్చు. 
ఈ రెండింటిలో ఏది జరిగినా ఫలితం మాత్రం ఒక్కటే.. నీటి తీరుతెన్నుల్లో వైరుద్ధ్యం చోటుచేసుకుంటుంది. తీరం దిశగా అలలు దూసుకొస్తాయి.

130 ఏళ్ల కిందట పెను విస్ఫోటం 
ప్రస్తుతం సునామీని కలిగించిన అనక్‌ క్రాకటోవాకు మాతృ రూపం క్రాకటోవా అగ్నిపర్వతం. 1883 ఆగస్టు 27న ఈ క్రాకటోవా తీవ్ర విస్ఫోటంతో విరుచుకుపడింది. దీనివల్ల చెలరేగిన సునామీ అల ఎత్తు 41 మీటర్లుగా ఉంది. సునామీ, బూడిద వల్ల దాదాపు 36 వేల మంది బలయ్యారు. నాటి విస్ఫోట శబ్దం 4500 కిలోమీటర్ల దూరంలోని మారిషస్‌ సమీపం వరకూ వినిపించింది.

20 కిలోమీటర్ల మేర బూడిద మేఘాలను వెదజల్లింది. దీనివల్ల రెండు రోజుల పాటు అక్కడ చీకటి నెలకొంది. ఆకాశంలో ఆ ధూళి వల్ల సూర్యోదయాలు, సూర్యాస్తమయాల రంగు మారిపోయింది. కొన్నేళ్లపాటు వాతావరణ పోకడలకు అవరోధం కలిగింది.

నాటి విస్ఫోటక శక్తి హిరోషిమాపై వేసిన అణుబాంబు కన్నా 13వేల రెట్లు ఎక్కువ.

జ్వాలా ‘శిశువు’ జననం 
1883 నాటి భీతావహ విస్ఫోటం వల్ల క్రాకటోవా దీవిలోని చాలా భాగం సముద్రం కిందున్న అగ్నిపర్వత బిలంలో కూలిపోయింది. 1928లో మరోసారి విస్ఫోటం వల్ల అది సముద్రం నుంచి బయటకొచ్చింది. దీనికి అనక్‌ క్రాకటోవా (క్రాకటోవా శిశువు) అని పేరు పెట్టారు.

ఆ తర్వాత లావా ప్రవాహాల కారణంగా అది పెరిగి పెద్దదైంది. క్రమంగా చిన్నపాటి అగ్నిపర్వత దీవిగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం అది సముద్ర మట్టానికి 305 మీటర్ల ఎత్తులో ఉంది.

ఆవిర్భావం నుంచి అనక్‌ క్రాకటోవా దాదాపుగా నిరంతర విస్ఫోట స్థితిలోనే ఉంటోంది. తన పరిమాణాన్ని పెంచుకుంటోంది.

ఈ దీవిపై ఎవరూ ఉండటంలేదు. పర్యాటకులు, అగ్నిపర్వత పరిశోధకులు వస్తుంటారు. కొన్ని నెలల నుంచి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. దీంతో 2 కిలోమీటర్ల దూరం వరకూ ఎవరినీ అనుమతించడంలేదు.

 

హెచ్చరిక ఎందుకు లేదు?

విస్ఫోటం వల్ల అనక్‌ క్రాకటోవాలోని ఒక పార్శ్వం సముద్రంలోకి కుప్పకూలి ఉండటం వల్లే తాజా సునామీ వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ అగ్నిపర్వతం నుంచి శబ్దాలు, విస్ఫోటాలు నిత్యకృత్యమయ్యాయి. దీంతో స్థానికులు వీటిని పెద్దగా లెక్కలోకి తీసుకోవడంలేదు. తాజా సునామీకి ముందు కూడా భారీ విస్ఫోటం లేదని చెబుతున్నారు. అందువల్ల ప్రజలు అప్రమత్తం కాలేదు.

సునామీ హెచ్చరిక వ్యవస్థలో భాగంగా సాగరంపై తేలియాడే పరికరాలను ఉంచారు. అయితే వాటిని భూఫలకాల సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఒకవేళ అనక్‌ క్రాకటోవా వద్ద ఇలాంటి పరికరం ఉన్నా.. హెచ్చరికకు సరిపడా సమయం ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు.

తీరానికి వచ్చేసరికి..

జెట్‌ విమానం వేగంతో (గంటకు 640-960 కిలోమీటర్ల వేగం) ఈ సునామీ అల దూసుకెళుతుంది. 
సముద్రంలో ఉన్నప్పుడు ఈ తరంగం ఎత్తు పెద్దగా ఉండదు. అల విస్తీర్ణం 200 కిలోమీటర్లు ఉండొచ్చు. 
తీరం దగ్గరకు వచ్చేసరికి అల వేగం తగ్గుతుంది. ఎత్తు పెరుగుతుంది. 
పెను శక్తితో అది తీర ప్రాంతాన్ని ముంచెత్తుతుంది. ఆ తర్వాత నీరు వెనక్కి మళ్లుతుంది. కొద్దిసేపటి తర్వాత మరో రాకాసి అల రూపంలో విరుచుకుపడుతుంది.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.