close

ప్ర‌త్యేక క‌థ‌నం

కులమే పార్టీల అస్త్రం!

సామాజిక వర్గాలదే పైచేయి
ఓట్లు, సీట్లకు అదే ప్రధాన ప్రాతిపదిక
ఈనాడు-దిల్లీ, ఎన్నికల విభాగం

దేశంలో  బీసీ కులాలు సుమారు  2400
అత్యంత వెనుకబడిన కులాలు (ఎంబీసీలు) 837

భారతదేశంలో కులం అంటే జనాభాను కృత్రిమంగా విభజించడమే.
కుల వ్యవస్థను రూపుమాపడమంటే కులాంతర వివాహాలు, సామూహిక విందులు నిర్వహించడంకాదు.
- బి.ఆర్‌.అంబేడ్కర్‌

బాహాటంగా అంగీకరించినా, విభేదించినా ఉత్తరాది రాజకీయాల్లో కులమతాలకు ఉన్న ప్రాధాన్యం తోసిపుచ్చలేనిది. దేశంలో మిగిలిన చోట్లా ఈ పోకడ ఉన్నప్పటికీ ఉత్తరాదిలో మరింత స్ఫుటంగా కనిపిస్తోంది. టికెట్ల కేటాయింపులో, ఓట్లు వేయడంలో, మంత్రుల్ని, ఆఖరికి ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడంలో ఇతరత్రా అంశాలతో పాటు కులాలు పోషిస్తున్న పాత్ర అంతాఇంతా కాదు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలే కాస్త నయమని ఓ అధ్యయనంలో బయటపడింది..! ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు, కుల సేనలు రెచ్చిపోతున్న తీరు ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల్లో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎస్సీ-ఎస్టీలపై దురాగతాల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తున్న నిబంధనల్లో మార్పు చేయాలనుకున్నప్పుడు అటు కేంద్రంలో, ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే. అంతర్లీనంగా దానికి కారణం సామాజిక సమీకరణాలే. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ కులాల కోణంలోనే దాదాపు అన్ని పార్టీలూ పావులు కదుపుతున్నాయి. ఏయే వర్గాలు ఏయే పార్టీలకు అండగా ఉంటాయో దాదాపుగా తెలిసిన విషయమే కావడంతో దానికి తగ్గట్టుగా అడుగులు పడుతున్నాయి.


ఎందుకీ పరిస్థితి?

కులాలకు, రాజకీయాలకు లంకె ఏమిటంటే కొంత చరిత్ర లోతుల్లోకి వెళ్లాలి. ఒక పార్టీలో తమకు న్యాయం జరగడం లేదని భావించే కొన్ని వర్గాలు అనివార్యంగా మరో పార్టీని ఆశ్రయించి, క్రమేణా బంధం పెనవేసుకుంటున్నాయి. తర్వాత అదొక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.

* బిహార్‌, కర్ణాటకల్లో జనతాదళ్‌ ప్రభుత్వాలు సామాజిక సమీకరణలతోనే కొలువుదీరాయి.
* వెనుకబడిన తరగతులు, ముస్లింల మద్దతును కూడగట్టి 1993 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభంజనం సృష్టించింది.

* దళితుల అండతో బీఎస్పీ బలపడిన తీరు యూపీలో కాంగ్రెస్‌ విజయావకాశాలకు గణనీయంగా గండికొట్టింది.
* ఉత్తరాది అంత ఎక్కువగా కాకపోయినా చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఉండడంతో సామాజిక వర్గాల వారీగానూ పథకాలు ప్రకటించాల్సిన పరిస్థితి.


అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

కుల వ్యవస్థ మన సమాజంలో అంతర్భాగంగా ఉన్నా, రాజకీయాలకు దీనితో ఉన్న సంబంధం ఎలాంటిదనేది తెలుసుకునేందుకు గతంలో జరిగిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం (ఏపీయూ), లోక్‌నీతి సంస్థ కలిసి 8 రాష్ట్రాల్లోని 22 శాసనసభ స్థానాల పరిధిలో 16,680 మందితో మాట్లాడి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించింది. దీనిలో ఏం తేలిందంటే...

55%
మంది ప్రజలు ఎన్నికల్లో తమ కులానికి, లేదా మతానికి చెందినవారినే ఎన్నుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

35%
మంది నేతను ఎన్నుకునేందుకు కులం, మతం ఒక     విషయమే కాదని తేల్చి చెప్పారు.

47%
మంది కళాశాల స్థాయి వరకు చదువుకున్న  వారిలో తమ నేతల కులమతాల గురించి పట్టించుకోవడం లేదు.


63% మంది నిరక్షరాస్యులు
60% మంది గిరిజనులు


‘తమ’వారినే ఎన్నుకోవాలని భావిస్తున్నారు.
* ఏపీయూ అధ్యయనం ప్రకారం సంకుల రాజకీయాల్లో అగ్రగామి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలుస్తుంది. అక్కడ మూడింట రెండొంతులకు పైగా ప్రజలు కులమతాలకే పెద్దపీట వేస్తున్నారు. ఆ విషయంలో తెలుగు రాష్ట్రాలు నయం. కులం ప్రాతిపదికగా ఓట్లు వేస్తామని ఆంధ్రప్రదేశ్‌లో 43% మంది, తెలంగాణలో 48% మంది ఆ సర్వేలో చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.