close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆగొద్దు అభివృద్ధి రథం

ఎంతో చేశా.. ఇంకెంతో చేస్తా మళ్లీ ఆశీర్వదించండి
జగన్‌ వస్తే రాజధాని మార్చేస్తారు
కేసీఆర్‌ చెప్పినట్టల్లా ఆడతారు
చంద్రబాబుతో ఈనాడు ప్రత్యేక ముఖాముఖి
కనపర్తి శ్రీనివాస్‌, జె.కల్యాణ్‌బాబు
ఈనాడు - అమరావతి

నా శైలి చాలా మారింది 
ఒకప్పుడు రాష్ట్ర సంపద సృష్టిపైనే దృష్టిపెట్టా 
ఇప్పుడు సంక్షేమం, అందరి సంతోషం.. 
ఇదే నా మార్గం 
తెలంగాణ కంటే ఎంతో ముందున్నాం 
అనుభవం, సామర్థ్యంతోనే నిలబడ్డాం 
లేకపోతే రాష్ట్రం బిహార్‌ అయ్యేది
పీ అభివృద్ధిని కేసీఆర్‌ ఓర్వలేరు 
అందుకే జగన్‌తో కలిసి 
తెరచాటు మంత్రాంగం 
తెదేపా నేతలనూ బెదిరించారు 
కుట్రలు చేస్తే జనం చూస్తూ ఊరుకోరు 
అందుకే రిటర్న్‌ గిఫ్ట్‌పై ఇప్పుడు నోరెత్తట్లా
కేసీఆర్‌, జగన్‌ నాలా ఆలోచించలేరు 
బంగారు బాతులాంటి తెలంగాణను 
ఏం చేశారు? 
అక్కడ నిధులన్నీ 
కొన్నింటి మీదే పోస్తున్నారు 
మనం అన్ని ప్రాజెక్టులనూ 
పూర్తి చేస్తున్నాం
సంక్షేమాన్ని ఇంకా భారీగా పెంచుతాం 
తీరప్రాంతాన్ని అద్భుతంగా 
ఉపయోగిస్తాం 
నదులన్నీ అనుసంధానిస్తాం, 
నీటి కొరతే ఉండదు 
ఆపై దేశంలో 
మనదే అగ్రస్థానం

‘రాష్ట్ర విభజన జరిగిన రోజున ఓ నీడ కూడా లేకుండా నిలబడిన రాష్ట్రాన్ని ఈ ఐదేళ్లలో సుస్థిర అభివృద్ధి బాట పట్టించాం.. ఈ విషయంలో తెలంగాణ కూడా పోటీ పడలేదు.. ఇక వచ్చే ఐదేళ్లూ అద్భుతమైన పురోగతి సాధిస్తాం...’ అని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. రాష్ట్రాన్ని కష్టాల పాలు చేసేందుకు జగన్‌తో కలిసి తెరచాటుగా కేసీఆర్‌ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పిగొట్టటం ఖాయమని నొక్కి చెప్పారు. జగన్‌కు అసలు అభివృద్ధిపై అవగాహనే లేదని, ఆయనకు అధికారం దక్కితే రాజధానిని మార్చేస్తారని వ్యాఖ్యానించారు. 68 ఏళ్ల వయస్సులో మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా అలుపెరుగని ప్రచారం చేస్తూనే.. మధ్యలో ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తే మళ్లీ తెదేపా ప్రభంజనం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

జగన్‌, కేసీఆర్‌, మోదీలకు విలువల్లేవు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందకూడదన్న ఒకే ఒక్క లక్ష్యంతో కేసీఆర్‌, జగన్‌లు కలిసి కుట్రలు పన్నుతున్నారు. వీరితో జతకలిసిన ప్రధాని తన స్థాయికి దిగజారి మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు విశ్వసనీయత అనేదే పట్టదు.. ’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు కేసీఆర్‌ కేసులు వేశారని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో  ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో అభివృద్ధి చేశామని వివరించారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి జిల్లాలో.. ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని, మరోసారి తెదేపా విజయఢంకా మోగించి.. ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  చంద్రబాబుతో ముఖాముఖి వివరాలు ఇవీ..

నాలో ఎంతో మార్పు..!

ముఖ్యమంత్రిగా నా వ్యవహార శైలిలో చాలా తేడా వచ్చింది. 1995-2004 మధ్య సీఎంగా ఉన్నప్పుడు కొంత దూకుడుగా ఉండేవాడిని. అప్పట్లో నా లక్ష్యమంతా రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే. పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించా. నేను అర్థశాస్త్రం చదువుకున్నా. దాని ప్రభావం నా మీద ఉండేది. మనలాంటి దేశాల్లో ఏం చెయ్యాలన్నా ఆర్థికాభివృద్ధి కీలకం. అందుకే ముందు సంపద సృష్టించటానికి కృషి చేశా. కఠినంగా ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని భావించా. దాంతో ఉద్యోగులూ కొంత ఒత్తిడి అనుభవించారు. నేను తలపెట్టిన అభివృద్ధి ఫలాలు పేదలకందేందుకు సమయం పట్టింది. కానీ ఐదేళ్లు, పదేళ్ల తర్వాత లబ్ధి చేకూరుస్తామంటే ఎలా..? అందరికీ అంత ఓపిక ఉండదు. ప్రజలు ప్రయోజనాల కోసం అడుగుతున్నప్పుడు.. మనం పట్టించుకోకుండా ఉండకూడదు. అప్పట్లో అదే నేను చేసిన పెద్ద తప్పు. అందుకే 2004లో అవకాశం కోల్పోయాను. నాతో పాటు రాష్ట్రమూ నష్టపోయింది.

కానీ ఇప్పుడు...
పరిస్థితులకు అనుగుణంగా నా పాలనలో ఎంతో మార్పు తీసుకొచ్చాను. ఇప్పుడు ఎక్కడా ఉద్యోగులపై ఒత్తిడి లేదు. వారి డిమాండ్లన్నీ నెరవేర్చాను. అప్పటితో పోల్చితే ఇప్పుడే మెరుగైన ఫలితాలొచ్చాయి. సాంకేతికతను ఉపయోగించటంతో ప్రభుత్వ సేవలూ మెరుగయ్యాయి. ప్రజల్లో సంతృప్తి పెరిగింది. అప్పట్లో పెండింగ్‌ దస్త్రాలను పరిష్కరించేందుకు వారోత్సవాలు నిర్వహించాం. ఇప్పుడా బాధ లేదు. అన్నీ ఆన్‌లైన్‌ చేశాం. పాలన సాఫీగా సాగిపోతోంది. అభివృద్ధి, సంక్షేమం.. రెంటి మధ్యా సమతూకం పాటిస్తున్నాం. అవసరానికి పది వేల కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినా అప్పు చేశాం గానీ వెనకడుగు వేయలేదు. తిరిగి తీర్చగల స్థితి ఉన్నప్పుడు అప్పు చేయటంలో ఇబ్బందేం లేదు. సగటు పౌరులకు ఎలా లబ్ధి చెయ్యాలన్నదే నా ఆరాటం. అందుకే సీఎం సహాయ నిధి కింద గతంలో ఎవరూ ఇవ్వనంతగా రూ.1,500 కోట్లు ఇచ్చి పేదల్ని ఆదుకున్నా. ఈ స్థాయిలో తెలంగాణలో చెయ్యలేదు. పింఛన్లు పది రెట్లు పెంచాం. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవటమే లక్ష్యంగా చంద్రన్న బీమా, పెళ్లికానుక వంటి సంక్షేమ పథకాలెన్నో తీసుకొచ్చా. ప్రజలందరూ ఆనందంగా ఉండే సమాజం చూడాలనుకుంటున్నా. అప్పుడే నాకు సంతృప్తి.

జగన్‌ వస్తే అంతా నష్టమే
ఆయన రాజధానిని మార్చేస్తారు!

జగన్‌ కేసుల నుంచి బయట పడాలనుకుంటున్నారు. అందుకే కేసీఆర్‌తో రాజీ పడ్డారు. వీలైతే శిక్షల నుంచి తప్పించుకోవచ్చని, లేకపోతే కొంతకాలం వాయిదా వేసుకోవచ్చునన్నది ఆయన వ్యూహం. నన్ను దెబ్బతీయడానికి మోదీ, కేసీఆర్‌లు జగన్‌ని పావుగా వాడుతున్నారు. మేం మళ్లీ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో అమరావతిని... హైదరాబాద్‌కి ప్రత్యామ్నాయంగా, అంతా గర్వించే నగరంగా తీర్చిదిద్దుతాం. దాంతో హైదరాబాద్‌ కూడా పోటీ పడలేదు. పోలవరం పూర్తి చేస్తాం. పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో వేగంగా పరుగులు తీస్తుంది. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్‌ సృష్టించిన భ్రమలు తొలగిపోతాయి. ఈ ఇబ్బందిని ఊహించే కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మోకాలడ్డాలని చూస్తున్నారు. జగన్‌కు మద్దతు ఈ వ్యూహంలో భాగమే. ఇక్కడ జగన్‌ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తారు. ఒకవేళ మార్చకపోయినా... అభివృద్ధి మాత్రం చెయ్యరు. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెంది, భూముల విలువ పెరగడం, పరిశ్రమలు రావడం జగన్‌కు ఇష్టం లేదు.

కేసీఆర్‌ చెప్పినట్లు ఆడతారు

జగన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హిందూజాకి భూముల కేటాయింపు వ్యవహారంలో క్విడ్‌ప్రోకోలో లబ్ధి పొందినందుకు... కావాలంటే ఇప్పుడు కూడా జగన్‌పై తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టవచ్చు. రేపొద్దుట ఈ కేసులన్నీ కేసీఆర్‌ గుప్పిట్లో పెట్టుకుని, జగన్‌ను అతనికి కావలసినట్టు ఆడిస్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. వాళ్ల గుప్పిట ఉన్న జగన్‌ రాష్ట్రం కోసం ఏం పని చేస్తారు?

మోదీని ఓడించాలన్న లక్ష్యం ముందు అన్నీ చిన్నవే!

భాజపాను వ్యతిరేకించే పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావటంలో ఇబ్బందులున్నా.. అవసరమైనప్పుడు వాటంతట అవే వస్తాయి. విభేదాలన్నీ తాత్కాలికం. మోదీని ఓడించాలనే లక్ష్యం ముందు అవన్నీ చిన్నవే. ఈ ఐదేళ్లలో భాజపా ఏ ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు. రాష్ట్రాల వారీగా చూసినా... ఉత్తరప్రదేశ్‌లో ఇతర కారణాలతో గెలిచింది. గుజరాత్‌లో అతికష్టమ్మీద బయటపడింది. మిగిలిన పెద్ద రాష్ట్రాల్లో ఓడిపోయింది. ప్రజలు ఒకసారి మోదీని పదవి నుంచి దించేయాలనుకుంటే భాజపాకు వ్యతిరేకంగా బలమైన పార్టీ ఏది ఉంటే దానికి మద్దతిస్తారు. ఒక్కోసారి పరిస్థితులే ప్రత్యామ్నాయాన్ని చూపిస్తాయి. పరిస్థితులను బట్టి 1998, 1999లో భాజపాకి మద్దతివ్వాల్సి వచ్చింది. గుజరాత్‌లో మత కలహాలతో మోదీ సంక్షోభం సృష్టించారు. దేశం కోసం ఆయన్ను పదవి నుంచి తొలగించండి అని వాజ్‌పేయీతో చెప్పాను. అయినా మోదీ కొనసాగారు, అందరం అధికారం కోల్పోయాం. తిరిగి 2014లో మోదీ మారారనుకుని నాతో సహా అందరం మోసపోయాం. దేశాన్నీ, రాష్ట్రాన్నీ ఆయన నాశనం చేశారు.

జగన్‌ ఏనాడన్నా అమరావతి చూశారా?

మోదీ, కేసీఆర్‌, జగన్‌లకు విలువల్లేవు. మర్యాద తెలియదు. మోదీ పోలవరం కట్టలేదంటారు. పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఇచ్చానంటారు. విద్యాసంస్థలెన్నో ఏర్పాటు చేసేశానంటారు. ఇలా పచ్చి అబద్ధాలతో ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారు. జగనేమో రాజధానిని గ్రాఫిక్స్‌ అంటున్నారు. అమరావతిలో ఒక్క ఇటుకా పెట్టలేదంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు విశ్వసనీయత పెంచుకోవాలి. కానీ వాళ్లకదేం పట్టదు. అసలు జగన్‌ అమరావతికి వెళ్లి చూస్తే కదా.. అక్కడ ఏం జరుగుతోందో తెలిసేది. బలవంతంగా బస్సులో తీసుకెళ్లి చూపాలా..?

150 స్థానాలే లక్ష్యం

ఎన్నికల్లో 150 స్థానాల్ని సాధించటమే లక్ష్యం. భారీ పాజిటివ్‌ ఓటింగ్‌ తథ్యం. మా అంతర్గత సర్వేలూ ఇదే చెబుతున్నాయి. రాష్ట్రాన్ని బలోపేతం చేయాలంటే మాకు ఆధిక్యమివ్వాలి. అప్పుడే రాజకీయ చికాకులు తగ్గి అభివృద్ధి, సంక్షేమంపై ఎక్కువ దృష్టిపెట్టేందుకు అవకాశముంది.

పవన్‌ పోటీతో జగన్‌కు సెగ

మాకు ఎవరితోనూ ఎలాంటి ఒప్పందాల్లేవు. పవన్‌ కల్యాణ్‌తో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం మాకేంటి..? నిజానికి జనసేనతో పొత్తు కోసం వైకాపా వాళ్లు, వారి తరఫున తెరాసనే ప్రయత్నించాయి. ఆయనేమో స్వతంత్రంగానే వెళ్లారు. పవన్‌ పోటీలో ఉండటంతో జగన్‌కు సెగ తగిలింది. అందుకే ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అసలు అటు మోదీతోనూ, ఇటు కేసీఆర్‌తోనూ లోపాయికారీ ఒప్పందాలున్నవి జగన్‌కే కదా..! వాటిని దాచిపెట్టి ఇతరులపై విమర్శలా? నిజానికి పవన్‌ కారణంగా మాకూ కొన్నిచోట్ల నష్టం కలుగుతోంది. ఇలా పోటీ ఉన్నప్పుడు అనుకూల, ప్రతికూలతలు అనేవి ఉంటాయి.

తెలంగాణలో పోటీకి తాత్కాలిక విరామం

తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లా. కానీ దాన్ని అక్కడి పాలకులు నా బలహీనతగా తీసుకున్నారు. నన్నూ, ఆంధ్రప్రదేశ్‌నూ బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మరింత స్పష్టతతో ఉన్నా. నా ప్రాధాన్యమంతా ఆంధ్రప్రదేశే. ప్రజలు అప్పగించిన బాధ్యతను నూరుశాతం నెరవేరుస్తా. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచానికి ఒక మంచి నమూనాగా చూపిస్తా. తెలంగాణలో పోటీకి తాత్కాలికంగానే విరామం ఇచ్చాం.

ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి

ముస్లిం మైనారిటీలు తెదేపాకి అసాధారణ మద్దతు ఇస్తున్నారు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక... ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తాం. ప్రస్తుతం కాపులు, బీసీలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చాం. ఈ పదవులను మూడుకు పెంచుతాం. ముస్లింలలో ఆర్థికంగా వెనుకబడినవారికి రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇస్లామిక్‌ బ్యాంక్‌ని ఏర్పాటు చేసి, వడ్డీలేని రుణాలిస్తాం. ఇందుకు సహకరించేందుకు పలు ఇస్లామిక్‌ దేశాలు సిద్ధంగా ఉన్నాయి.

పులివెందులకు నీళ్లిచ్చాం..

ఈ ఐదేళ్లలో రైతుకు ఏ కష్టం వచ్చినా పరిష్కారం చూపించాం. మామిడి, సుబాబుల్‌, టమాటా, సెనగ, వరి.. ఇలా వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు ధరల్లేక, కొనేవాళ్లు లేక రైతులు ఇబ్బందిపడ్డ ప్రతిసారీ ప్రభుత్వం రంగంలోకి దిగి వారిని ఆదుకుంది. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు కృష్ణా జలాలు తెచ్చాం. పైడిపల్లి జలాశయం నుంచి పులివెందులకు నీళ్లిచ్చాం. ఈ సీజన్‌లో పులివెందుల పక్కన నీళ్లు పారడం ఎవరూ ఊహించని పరిణామం. కడప జిల్లాలో వేసవిలో చీనీ తోటల్ని బతికించడానికి ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు చెట్లు ఎండిపోయే పరిస్థితి లేదు. చేసిన పనులన్నీ జనం గుర్తించారు. నేను పులివెందులలో రోడ్డు షో నిర్వహస్తే పెద్ద సంఖ్యలో జనం రావడమే దీనికి నిదర్శనం.

జగన్‌కు ఓటెందుకు వెయ్యాలి?

తనకు ఒక అవకాశం ఇవ్వాలని జగన్‌ ప్రజల్ని కోరుతున్నారు. అధికారంలోకి వస్తే ఏవేవో చేస్తానని హామీలిస్తున్నారు. అసలు జగన్‌కు ఎందుకు అవకాశం ఇవ్వాలి? తన కేసుల కోసం తెలంగాణకు లొంగిపోయినందుకా? కేసులు ఉన్నవాళ్లు వాటికి భయపడతారుగానీ, ప్రజా సమస్యలపై పోరాడతారా?

అవినీతికి తావులేదు
రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని మోదీ, జగన్‌లాంటివాళ్లు చెప్పినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఇక్కడేం జరుగుతోందో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు విఫలమైతే... ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది. కానీ ఇక్కడా పరిస్థితి లేదు. రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పింఛను ఇంటికే రావడం ప్రజలకు తెలుసు. ప్రజలందరిలో ప్రభుత్వంపై ‘ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌’ ఉంది.

ఫలితం నేను చెప్పగలను
నేను అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఒక దఫా ప్రచారం పూర్తి చేశా. ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. నాకే కాదు.. మా పార్టీ అభ్యర్థులు ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. జనం స్పందన చూసి ఫలితం చెప్పగలను. ఈ ఎన్నికల్లో ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత స్పష్టంగా కనిపిస్తోంది. మళ్లీ మేం అధికారంలోకి రావడం ఖాయం.

రాష్ట్రం బిహార్‌ అయిపోయేది!

మోదీ, కేసీఆర్‌, జగన్‌... ప్రతికూల భావాలున్న ఈ ముగ్గురూ కలిసి ఏపీపై కుట్రలు చేస్తున్నారు. జగన్‌కు ఎలాంటి అవగాహనా లేదు. మోదీ ఈ ఐదేళ్లలో చేసిన గొప్ప పనులేం లేవు. కేసీఆర్‌కి బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి రాష్ట్రాన్ని ఇస్తే ఏం చేశారో చూశాం. ఇక్కడ నా అనుభవం, సామర్థ్యంతో సుస్థిర, సుపరిపాలన అందించగలిగాం. ప్రాథమిక దశలో అవన్నీ చేయకపోతే రాష్ట్రం మరో బిహార్‌లా తయారయ్యేది. అన్ని రంగాల్లో సుస్థిరత తెచ్చాం కాబట్టే కొంతయినా నిలదొక్కుకున్నాం. నిరంతరం పని చేయడం, అందర్నీ భాగస్వాముల్ని చేయడం వల్లే ఇది సాధ్యపడింది. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం పెంపునకు నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని పనిచేశాం. జన సంక్షేమాన్ని కచ్చితంగా చెప్పే స్థూల అదనపు విలువ (జీవీఏ) అన్న కాన్సెప్ట్‌ మొదట మనమే తెచ్చాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, హ్యాపీనెస్‌ ఇండెక్స్‌, ఉద్యోగార్హ నైపుణ్యాల వంటి ప్రపంచంలోని కొలమానాలన్నీ తీసుకుని... మనం ఎక్కడున్నామో ఎప్పటికప్పుడు సరి చూసుకుంటున్నాం. నిర్దిష్ట లక్ష్లాలు పెట్టుకుంటున్నాం. 20 సార్లు కలెక్టర్ల సదస్సులు పెట్టాం. నా అనుభవం, సమర్థతపై నమ్మకముంచి ప్రజలు అవకాశం ఇచ్చినందుకు.. నాపై పెట్టుకున్న అంచనాలకు మించి.. ఒకపక్క సంక్షేమాన్నీ, మరోపక్క అభివృద్ధినీ జోడెద్దుల్లా పరుగులు పెట్టించాం.

కేసీఆర్‌, జగన్‌ ఇలా ఆలోచించలేరు!

తెలంగాణలో నిధులన్నీ మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపైనే ఖర్చు పెడుతున్నారు. తాగునీరు మీదే రూ.50-60 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. కానీ ఇక్కడ మనం కేవలం రూ.20 వేల కోట్లు పెట్టి రాష్ట్రమంతా తాగునీటి వసతి కల్పించగలుగుతున్నాం. గోదావరి, కృష్ణా సహా రాష్ట్రంలోని నీటి వనరులన్నింటినీ అనుసంధానించి ‘స్మార్ట్‌ వాటర్‌ గ్రిడ్‌’గా మారుస్తున్నాం. నేను ప్రాజెక్టులన్నింటికీ సమప్రాధాన్యం ఇస్తూ అవరమైన నిధులు తెచ్చి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా. తెలంగాణలో కాళేశ్వరం ఒక్కటి పూర్తి చేయటానికే రూ.1.20 లక్షల కోట్లు కావాలి. ఒక్క ఎకరాకు నీరిచ్చేందుకు ఏటా రూ.10 వేలు ఖర్చయ్యేలా ఉంది. సౌర విద్యుత్తు చౌక ధరకు వస్తోంది కాబట్టి సరిపోయిందిగానీ లేకుంటే వారికి పెద్ద ఇబ్బందే ఉండేది. మనం సుదూర ప్రాంతాల నుంచి కాకుండా ఎక్కడికక్కడ నీటిని అందుబాటులోకి తెస్తున్నాం. వంశధార-నాగావళి నుంచి, గోదావరి-పెన్నా అనుసంధానం వరకు గ్రావిటీపై కొంత, లిఫ్టులతో మరికొంత నీటిని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లగలుగుతున్నాం. ఇప్పుడు రెండేళ్లు వర్షాలు పడకపోయినా కొంతవరకు ఫర్వాలేదు. నాలుగైదేళ్లలో వ్యవసాయంలో నూరు శాతం స్థిరత్వం సాధిస్తాం. అలాగే రాజధాని కోసం సమీకరణ విధానంలో భూములు తీసుకున్నాం. భూమి విలువ పెంచి ఆదాయమార్గాలు వెతకటంతో రూ.50 వేల కోట్ల వరకూ వస్తోంది. ఉపాధి కల్పనా జరుగుతుంది. నేను ఈ తరహాలో ఆలోచిస్తా. అలా కేసీఆర్‌ చేయలేరు. జగన్‌ అసలే చేయలేరు. ఇది వాళ్ల ఊహకు కూడా అందని విషయం. జగన్‌కి దొంగ లెక్కలు రాసుకోవటమే తెలుసు.

కేసీఆర్‌ మా వాళ్లను బెదిరించారు

కేసీఆర్‌ నాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న మా పార్టీ మద్దతుదారుల్ని పిలిపించి బెదిరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని మా అభ్యర్థుల్ని హెచ్చరించారు. రేపల్లె, బనగానపల్లె, గన్నవరం అభ్యర్థులు సహా... సుమారు 10-15 మందికి అలాంటి బెదిరింపులు వచ్చాయి. కేసీఆర్‌ వైఖరికి ఇది అద్దంపడుతుంది. రాష్ట్ర విభజనకు ముందు అక్కడి ప్రజల్ని కేసీఆర్‌ బాగా రెచ్చగొట్టారు. ఆంధ్రావాళ్లు హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతే అందరికీ ఉద్యోగాలు వస్తాయని నమ్మించారు. ఆంధ్రావాళ్ల ఆస్తులన్నీ వారికి ఇస్తానని చెప్పారు. ఆంధ్రా ప్రజల్ని ద్రోహులు, దోపిడీదారులు అంటూ స్థానికుల్ని రెచ్చగొట్టారు. అక్కడ నివసిస్తున్న ఆంధ్రా ప్రజల్లో అభద్రతాభావం రగిలించారు. హైదరాబాద్‌ని వదిలి రాలేని పరిస్థితుల్లో కొందరు వాళ్లకు లొంగిపోయారు.

ఒక నాయకుడు సమర్థ పాలనను అందిస్తే, తర్వాత వచ్చినవాళ్లు ఆ పరంపర కొనసాగిస్తారు. అసమర్థులు నాయకులైతే వ్యవస్థ కుప్పకూలుతుంది. అలాంటి రాష్ట్రాల్లో అప్పులు పెరిగిపోతాయి. రుణభారం పెరిగే కొద్దీ నిర్వహణ భారమవుతుంది. అలాంటి రాష్ట్రాలు ఏదోలా మనుగడ సాగిస్తాయిగానీ... జరగాల్సినంత అభివృద్ధి ఉండదు.

ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు పోలికా..?

ఈ ఐదేళ్లలో చేసిన పనులతో లభించిన సంతృప్తి ఇది వరకెప్పుడూ లేదు. చేసిన పనుల్ని అందరూ గుర్తించారు. ఈ ఐదేళ్లలో పూర్తి సమగ్రతతో, సమీకృతాభివృద్ధి లక్ష్యంగా పనులు చేశాం. అప్పట్లో ఒక్క హైదరాబాద్‌నే అభివృద్ధి చేశాం... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పట్టణాలు, గ్రామాల్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు అభివృద్ధిలో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ ధనిక రాష్ట్రమై ఉండి కూడా మౌలిక వసతులపై శ్రద్ధ పెట్టలేదు. తెలంగాణలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు లేవు. సీసీ రోడ్లు లేవు. అందరికీ వంట గ్యాస్‌ సదుపాయం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గ్రామంలోనూ సిమెంట్‌ రోడ్లు వేశాం. మొదట్లో కొన్ని సమస్యలు వస్తే ప్రభుత్వమే పరిష్కరించింది. సెంట్రింగ్‌ సామగ్రి కొనిచ్చి, సిమెంట్‌కి యూనిఫాం ధర ఇచ్చి, ఇసుక సరఫరా చేసి.. సీసీ రోడ్ల నిర్మాణాన్ని గాడిలో పెట్టేందుకు దాదాపు ఏడాది పట్టింది. ఇప్పుడు అక్కడక్కడా మట్టి రోడ్లు కూడా ఉంచండి, మొత్తం సిమెంట్‌ రోడ్లే వేసేస్తే నడిచినప్పుడు మోకాళ్లు అరిగిపోతాయని నేనే చెప్పాల్సి వస్తోంది. మా ఊర్లో కూడా నాగాలమ్మ గుడికి వెళ్లే దారిలో సీసీ రోడ్డు వేస్తామంటే, వద్దు మట్టి రోడ్డే ఉంచమని చెప్పాను.

కుట్ర రాజకీయాలను ప్రజలు చూస్తూ ఊరుకోరు..!

తెలంగాణకు చెందిన కేసీఆర్‌, అసదుద్దీన్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌ తదితరులు జగన్‌ తరఫున ప్రచారానికి రాష్ట్రానికొస్తామన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ నాకు గిఫ్ట్‌లా మారుతుందనుకుంటున్నారు. వారొచ్చి ఇక్కడ కుట్ర రాజకీయాలు చేస్తామంటే ఇక్కడి ప్రజలు ఊరుకుంటారా..? ప్రజలు తెలివైనవాళ్లు. 2014లో రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్‌ మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు తెలంగాణ నేతలు అలాంటి రాజకీయం చేస్తామంటే వారికీ అదే గతి పడుతుంది. అందుకే తెరవెనుకే ఉండి కుట్ర చేస్తున్నారు. సినీ ప్రముఖులంతా ఎప్పుడూ తెదేపా వైపే ఉండేవారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ ప్రోద్బలంతో కొందరు జగన్‌ పక్కన చేరుతున్నారు.

జగన్‌ కన్నా వైఎస్‌ వేయి రెట్లు మేలు!

ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా.. నాపై హత్యా రాజకీయ ఆరోపణలు ఎవరూ చేయలేదు. మొదటిసారి జగన్‌ ఆ పని చేశారు. జగన్‌ వంటి నేరస్థుడు, అవినీతిపరుడితో ఎన్నికలలో తలపడటం చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ.. ఏం చేస్తాం..? ఎదుర్కోవాల్సిందే..! ప్రజల కోసం తప్పదు.! జగన్‌తో పోలిస్తే వాళ్ల నాన్న రాజశేఖరరెడ్డి వెయ్యి రెట్లు మేలు. ఆయనా ఒకసారి తప్పుగా మాట్లాడారు. ‘నీ తల్లి ఎందుకు కన్నానో అని బాధపడే పరిస్థితి వస్తుంది’ అన్నారు. నేను గట్టిగా మాట్లాడితే వెనక్కి తగ్గారు. వైఎస్‌కు ఎక్కడో కొద్దిగా స్పృహ ఉండేది. జగన్‌కు అదేం లేదు. అతనో దారి తప్పిన వ్యక్తి. సీఎంగా ఉన్న నన్ను తుపాకీతో కాల్చేయాలని, బంగాళాఖాతంలో పడేయాలని, చెప్పులతో కొట్టాలని, నడి రోడ్డులో ఉరితీయాలని.. ఇలా ఎన్ని మాటలన్నారో..! రాజకీయంగా, వ్యక్తిత్వం పరంగా మరుగుజ్జుల్లాంటి వారు విమర్శిస్తుంటే.. వాటిని వృత్తిపరమైన ఇబ్బందులుగానే తీసుకోవాలి!

ఏపీపై కేసులు వేసే కేసీఆర్‌తో ఎలా కలుస్తారు?

మన మధ్య ఎన్ని ఉన్నా రాష్ట్రానికేదైనా ఆపద వచ్చినప్పుడు అంతా ఒకే మాటపై ఉండాలి. పక్క రాష్ట్రాలను చూసినా మనకు అదే అర్థమవుతుంది. కానీ ఇక్కడ అలా లేదు. కేసీఆర్‌ పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకుని కేసులేస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారంటారు. కృష్ణా జలాలపై పేచీలు పెడతారు. మన వాటాకు రావాల్సిన ఆస్తులు, నిధులు ఇవ్వరు. అలాంటి నాయకుడితో కలిసి జగన్‌ ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారు? వారి సహకారంతోనే హోదా సాధిస్తానంటుంటే ఎవరు నమ్ముతారు..? ఉద్ధృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతుంటే అతనేమో హైదరాబాద్‌లోనే ఉండి మంతనాలు, కుట్రలు చేస్తుంటారు.

మున్ముందు దేశంలో మనమే ముందు.. అందుకేం చేస్తామంటే...

‘మీ భవిష్యత్తు-నా బాధ్యత’.. ఈ ఎన్నికల్లో ఇదే నా నినాదం. గతంలో ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అన్నాను, అన్నట్లే ఈ ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొన్ని వేల ఉద్యోగావకాశాలు కల్పించాం. వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చాం. నిరుద్యోగులకు భృతి ఇస్తున్నాం. ఇప్పటి వరకూ జరిగింది ఒక ఎత్తు. వచ్చే ఐదేళ్లలో చూడబోయేది మరో ఎత్తు. ఊహించని పురోగతి చూస్తారు.

* రాష్ట్రంలోని సముద్ర తీరం వెంట వెయ్యి కి.మీ.ల పొడవునా బీచ్‌ రోడ్డు నిర్మిస్తాం. దాన్ని ప్రతి 10 కి.మీ.లకు జాతీయ రహదారితో అనుసంధానిస్తాం. తీరం వెంట వెయ్యి కిలోమీటర్ల కనెక్టివిటీ దేశంలో ఎక్కడా లేదు.

* దాదాపు ప్రతి జిల్లాలో వివిధ రూపాల్లో నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, జలరవాణా మార్గాలు అభివృద్ధి చేస్తాం.

* శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నదులన్నీ అనుసంధానం చేస్తాం. లిఫ్ట్‌లు ఏర్పాటుచేసి అవసరాన్ని బట్టి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నీరు పంపిస్తాం. చెరువులన్నీ నింపుతాం. రాష్ట్రంలో పడిన వర్షం నీరు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేది వృథాగా పోనివ్వకుండా స్మార్ట్‌ వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేస్తాం.

* కోస్తా తీరాన్ని తయారీ రంగానికి, పర్యాటకానికీ కేంద్రంగా మారుస్తాం. రాయలసీమలో రహదారుల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. పరిశ్రమలు, ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్లను భారీగా ఏర్పాటు చేస్తాం. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహిస్తాం.

* ఇప్పటికే 8 విమానాశ్రయాలున్నాయి. అవసరమైతే మరో ఐదారు నిర్మిస్తాం. ప్రయాణికులు, సరకు రవాణాకు వీలుగా వాటిని అభివృద్ధి చేస్తాం. హబ్‌ అండ్‌ స్పోక్‌ నమూనాలో చిన్న విమానాశ్రయాల్ని, పెద్ద విమానాశ్రయాలతో అనుసంధానం చేసి అంతర్జాతీయ కనెక్టివిటీ తెస్తాం. పర్యాటక, ఆర్థిక కార్యకలాపాల్ని ప్రోత్సహిస్తే ఊహించని ఫలితాలు వస్తాయి. రాష్ట్రాభివృద్ధిని ఎవరూ ఆపలేరు.

* ప్రతి మేజర్‌ పంచాయతీలో పారిశ్రామిక టౌన్‌షిప్‌లు నిర్మిస్తాం. ఎవరైనా తమ ఇళ్లల్లో తయారీ యూనిట్లు పెట్టుకోవచ్చు. వారు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోదాములు, టెస్టింగ్‌, ప్యాకేజింగ్‌ సదుపాయాలు టౌన్‌షిప్‌లో ఉంటాయి. ఆ ఉత్పత్తుల్ని స్థానిక, దేశ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రమోట్‌ చేస్తాం.

* ఈ ఐదేళ్లలో వివిధ రంగాల్ని స్థిరీకరించాం. వచ్చే ఐదేళ్లలో ఆయా రంగాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది.
ఆ తర్వాత ఐదేళ్లలో ఆయా రంగాల్లో మనమే దేశంలో అగ్రస్థానంలో ఉంటాం.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ఆరంభమే..

ఇప్పుడు రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా మేం చేసిన అభివృద్ధి కళ్లకు కడుతోంది. మారుమూల గ్రామాల్లోనూ సిమెంట్‌ రోడ్లు, ఎల్‌ఈడీ వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించాం. పేదలకు లక్షల సంఖ్యలో ఇళ్లు నిర్మించాం. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా.. కేంద్రం సహకరించకపోయినా ఇవన్నీ చేయడంతో మా ప్రభుత్వం ప్రజల మన్ననలు    అందుకుంది. వచ్చే ఐదేళ్లలో..

* ఇళ్లకు సంబంధించి పాత బకాయిలు రద్దు చేస్తాం. కొత్తగా ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం.
* చంద్రన్న బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు, పెళ్లి కానుకను రూ.లక్షకు పెంచుతాం.
* బీసీలకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తాం. ముస్లింల కోసం ఇస్లామిక్‌ బ్యాంకు పెడతాం.

* పసుపు-కుంకుమ మూడుసార్లు ఇస్తాం. అంటే ప్రతి మహిళకూ వచ్చే ఐదేళ్లలో 30 వేలు అందుతాయి.
* వ్యవసాయ పంపుసెట్లన్నీ సోలార్‌ పంప్‌ సెట్‌లుగా మారుస్తాం. రైతులు వాడుకోగా మిగిలిన కరెంట్‌ని గ్రిడ్‌కి ఇస్తే తిరిగి డబ్బులిస్తాం. స్మార్ట్‌ పవర్‌గ్రిడ్‌లు ఏర్పాటు చేస్తాం.

ప్రపంచంలో ఎక్కడ టెక్నాలజీ ఉన్నా.. తెచ్చాం!

కొన్ని దశాబ్దాలుగా పరిష్కారానికి నోచని, అత్యంత సంక్లిష్టమైన సమస్యలు అనేకం ఈ ఐదేళ్లలో పరిష్కరించాం. సింహాచలం భూముల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న లక్ష మంది పేదలకు పట్టాలిచ్చాం. నెల్లూరు జిల్లాలో కో-ఆపరేటివ్‌ జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీ భూముల సమస్యను పరిష్కరించి 70 వేల మంది రైతులకు మేలు చేశాం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. భూధార్‌తో భూవివాదాలకు పరిష్కారం చూపించాం. తుపానులు, పిడుగుల్ని ముందుగానే గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేసే వ్యవస్థలు నెలకొల్పాం. ప్రపంచంలో ఎక్కడ కొత్త టెక్నాలజీ ఉన్నా.. దాన్ని తెచ్చి, రాష్ట్ర అవసరాలకు వినియోగించాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.