close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పుస్తెల తాకట్టు

లాక్‌డౌన్‌తో పేద, మధ్య తరగతి కుటుంబాలు అతలాకుతలం
బంగారాన్ని కుదువ పెట్టి నెట్టుకొస్తున్న దైన్య స్థితి
ఈనాడు డిజిటల్‌, అమరావతి

లాక్‌డౌన్‌తో పేద, మధ్యతరగతి కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వారు పుస్తెలు కూడా తాకట్టు పెట్టుకోవాల్సి వస్తోంది. మూడు నెలలుగా సంపాదన లేక ఇంటి అద్దెలు, రుణ వాయిదాలు బకాయిపడ్డారు. చివరికి నిత్యావసరాలకూ చేతిలో డబ్బుల్లేక.. బిడ్డల ఆకలి బాధలు చూడలేక పుస్తె పూసా తాకట్టు పెట్టి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో గత 25 రోజుల్లో 40 మంది తాళిబొట్లను తాకట్టు పెట్టడం.. లాక్‌డౌన్‌ పేద, మధ్యతరగతి కుటుంబాలను ఎంత ఛిన్నాభిన్నం చేసిందో చెప్పడానికి నిదర్శనం. ఇల్లు, దుకాణాల అద్దె చెల్లింపు, వాహనాలు, ఇతరత్రా వస్తువుల కొనుగోలుకు సంబంధించి రుణ వాయిదాలు, చిట్టీలు, కిరాణా దుకాణాల వద్ద అప్పులు మధ్యతరగతి కుటుంబాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.

లాక్‌డౌన్‌తో రెండున్నర నెలలుగా ఉపాధి లేక వీటిని చాలా వరకు కట్టలేదు. అప్పు అడగలేక కొందరు, అడిగినా ఎవరూ ఇచ్చే పరిస్థితి లేక మరికొందరు సతమతమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఉంగరాలు, చెవి కమ్మలు, గాజులు, గొలుసులు, చివరికి తాళిబొట్లు.. ఏది ఉంటే అది తాకట్టు పెట్టి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.


మగ్గం ఆడక.. ఆకలి తీరక..

మగ్గం నేస్తున్న ఈ మహిళ పేరు వెంకట మునెమ్మ. ఊరు అనంతపురం జిల్లా తాడిపత్రి. ఆమెకు 12 ఏళ్ల కుమార్తె ఉంది. లాక్‌డౌన్‌తో ఉపాధి కరవైంది. కుటుంబపోషణ కోసం తనకున్న 2 తులాల గొలుసును రూ.30 వేలకు తాకట్టు పెట్టారు. ఆ డబ్బుతో మూడు నెలల ఇంటి అద్దె, కిరాణా దుకాణంలో బాకీ, రుణవాయిదాలు చెల్లించారు. మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర కొన్న ముడిసరకు బాకీనీ తీర్చేశారు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ మిగల్లేదు. ఇప్పట్లో మగ్గం ఆడే పరిస్థితి లేదని.. తాకట్టు పెట్టేందుకు ఇక బంగారమూ లేదని మునెమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.


పట్టణాల్లోనే ఎక్కువ
రోజువారీ జీవనమే కష్టమవుతుంటే దీనికితోడు ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ విధానంలో బోధన తీసుకురావడంతో పిల్లలకు ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లు కొనాల్సి వస్తోంది. దీంతో ఫైనాన్స్‌ కంపెనీలు, బ్యాంకులను ఆశ్రయించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలా తాకట్టు పెడుతున్నవారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల చిన్న చిన్న వస్తువులను కుదువ పెట్టుకునేందుకు ఫైనాన్సు నిర్వాహకులు నిరాకరిస్తుండటంతో ఎంత వస్తే అంతే ఇవ్వండని బతిమాలుతున్న సంఘటనలు ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతున్నాయి.

30 వేల లోపు మొత్తాలే ఎక్కువ
రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేల మొత్తం కోసం బంగారు ఆభరణాలు కుదువ పెట్టేవారు ఎక్కువగా ఉంటున్నారని విజయనగరంలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీ మేనేజర్‌ తెలిపారు. గతంతో పోలిస్తే ఈ మొత్తాలు తీసుకోవడం 40 నుంచి 50 శాతం పెరిగిందన్నారు. లాక్‌డౌన్‌కు ముందు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, రైతులు ఎక్కువగా బంగారం తాకట్టు పెట్టేవారని.. ఇప్పుడు రోజు కూలీలే అధికంగా వస్తున్నారని చిత్తూరులోని ఓ ఫైనాన్స్‌ కంపెనీ నిర్వాహకులు చెప్పారు. రోజుకు 7 లక్షల వరకు కొత్త అప్పులు ఇస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఫైనాన్స్‌ నిర్వాహకులు తెలిపారు. ఇందులో 70% మంది దినసరి కూలీలేనని.. అందులోనూ తాపీ పనివారే ఎక్కువగా వస్తున్నారని చెప్పారు.

ఇంకాస్త వస్తుందేమో చూడండి..
ఇప్పటికే ఇతరత్రా అవసరాల కోసం బంగారాన్ని కుదువ పెట్టినవారు దానిపై అదనంగా మరికొంత మొత్తం వస్తుందేమోనని ఫైనాన్స్‌ కంపెనీల దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు. అదనంగా ఎంతొచ్చినా ఇవ్వండని అడుగుతున్నారని విశాఖ జిల్లాకు చెందిన ఓ ఫైనాన్స్‌ సంస్థ అధికారి తెలిపారు. ఆభరణాలను విడిపించుకునేవారి కంటే వాటిపై అదనంగా మరికొంత తీసుకోవడానికి వచ్చేవారే అధికంగా ఉన్నారన్నారు. ఫైనాన్స్‌ కంపెనీలు కూడా ఇంతకుముందే తాకట్టు పెట్టుకున్నవాళ్లకు ఫోన్‌ చేసి మీ ఆభరణాలపై మరికొంత రుణం వస్తుంది.. తీసుకెళ్లమని చెబుతుండటం గమనార్హం. వేరే దారి లేక బంగారం కుదువ పెడుతున్నామని.. వాటిని తిరిగి తీసుకెళ్లడం తలకు మించిన భారమేనని మధ్యతరగతి మహిళలు ఆవేదనగా చెబుతున్నారు.


బిడ్డ ఆకలి చూడలేక..

ఈ చిత్రంలోని దంపతులు కొల్నాటి సత్తిబాబు, కనకమహాలక్ష్మి. వీరిది విశాఖ జిల్లా నక్కపల్లి. భర్త కూలీ. భార్య పాఠశాలలో వంటపని సహాయకురాలు. లాక్‌డౌన్‌తో మూడు నెలలుగా పని లేక ఇంటి అద్దె కట్టలేదు. డ్వాక్రా రుణ వాయిదా చెల్లించాలి. కిరాణా కొట్లో, ఫైనాన్స్‌ వ్యాపారుల దగ్గర తీసుకున్న అప్పూ చెల్లించలేదు. కొన్ని రోజులు రెండు పూటలకు సరిపడా బియ్యాన్ని మూడు పూటలకు సర్దుకున్నారు. బిడ్డ ఆకలి బాధ చూడలేక తాళిబొట్టును, చెవిదిద్దులను రూ.40 వేలకు తాకట్టు పెట్టారు. అప్పులు తీర్చి సరకులు తెచ్చుకున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.