close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రీడిజైనింగ్‌తోనే ముప్పు తప్పేది

మౌలిక వసతుల అభివృద్ధిలో మార్పులు రావాలి
‘ఈనాడు’తో భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్‌ కె.జె.రమేష్‌

ఈనాడు హైదరాబాద్‌: ‘‘వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వర్షాలు, వరదల్లో భారీ మార్పులు చోటు చేసుకొంటున్నాయి. దీనికి తగ్గట్లుగా మౌలికవసతుల్లో ఆధునిక పోకడలు అవసరం. డిజైనింగ్‌లో మార్పు రావాల్సిన అవసరం ఉంది’’ అని భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ కె.జె.రమేష్‌ అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందని, మేల్కొని ఇకపైనైనా తగిన చర్యలు తీసుకోకపోతే తరచూ ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ అన్నారు.

భవిష్యత్తులో తీవ్రత ఇంకా పెరుగుతుంది
‘‘పాత రికార్డులు చెరిగిపోయి కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దీంతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మౌలిక వసతులను రీ డిజైన్‌ చేయాలి. ప్రతి సంవత్సరం అక్టోబరు, నవంబరు నెలల్లో తుపాన్లు, వాయుగుండాలు ఏర్పడుతుంటాయి. వాతావరణ మార్పుల కారణంగా వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది కూడా సాధారణంగా కురిసే వర్షానికి భిన్నంగా. వాతావరణంలో మార్పుల వల్ల గతంలో వచ్చిన వర్షానికి ఇప్పుడు వచ్చే వర్షానికి తేడా ఉంది. ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో ఈ తీవ్రత ఇంకా పెరుగుతుంది. కొత్త రికార్డులు వస్తాయి.

అడ్డదిడ్డంగా కట్టడాలు పెరిగాయి
భారీ వర్షాలు, వరదలు వచ్చినపుడు బ్రిడ్జిలు, కల్వర్టులు, డ్రెయినేజి వ్యవస్థ తట్టుకోవడం లేదు. మారిన పరిస్థితులకు తగ్గట్లుగా వీటిని విస్తరించాలి. యాభై ఏళ్లలో అత్యధిక వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని డిజైన్‌ చేసి ఉంటారు. ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ వర్షం రావడం లాంటివి వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్నాయి. వీటిని తట్టుకొనే శక్తి మౌలిక సదుపాయాలకు ఉండటం లేదు. వీటికి తోడు అనేక ప్రాంతాల్లో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. అడ్డదిడ్డంగా కట్టడాలు పెరిగాయి. అనేక నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి. ముంబయిలో మౌలిక వసతుల అభివృద్ధికి ఏ నగరంలోనూ చేయనంత ఖర్చు చేశారు. అయినా పూర్తిగా పరిష్కారం లభించలేదు. నీటి ప్రవాహ సామర్థ్యం పెంచేలా రీ డిజైన్‌ చేయాలి. ఆక్రమణలు తొలగించాలి. డ్రెయినేజీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. వీటివల్లే సమస్యను అధిగమించవచ్చు.

అలుగు పోయే ప్రవాహ సామర్థ్యాన్నీ పెంచాలి
హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-కర్నూలు జాతీయ రహదారులు కొత్తగా నిర్మించినవి. అయినా కల్వర్టులన్నీ నీటితో నిండి రవాణా స్తంభించింది. రైల్వే పరిస్థితి కూడా ఇంతే. 1999-2000వ సంవత్సరంలో హైదరాబాద్‌కు భారీ వర్షం వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్‌తోపాటు దీనిని ఆనుకొని ఉన్న రంగారెడ్డి, భువనగిరితోపాటు సరిహద్దు జిల్లాలన్నింటిలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఇంత నీరు గతంలో ఎప్పుడూ రాలేదు. మిషన్‌ కాకతీయ కింద చెరువులను అభివృద్ధి చేశారు. చెరువు అలుగు పారినప్పుడు వెళ్లే నీటి ప్రవాహ సామర్థ్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది’’ అని రమేష్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.