లాజిస్టిక్స్‌ పార్కుల దిశగా అడుగులు
close
లాజిస్టిక్స్‌ పార్కుల దిశగా అడుగులు

కేంద్రం ప్రకటించినదానిపై కొలిక్కి వచ్చిన సర్వే
తాజాగా ప్రైవేటు రంగంలో అదాని సంస్థ ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌; చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: మరో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా... ప్రసిద్ధ పారిశ్రామికవేత్త అదానికి సంబంధించిన సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ప్రైవేటు రంగంలో మరొకటి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. 1,676 ఎకరాలలో దీనిని స్థాపిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణలో ఎగుమతులు పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం లాజిస్టిక్స్‌ పార్కులు, మల్టీమోడల్‌ పార్కులు ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా... రాష్ట్రానికి మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కును మంజూరు చేసింది. దీనికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను (ఎన్‌హెచ్‌ఏఐని) నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. ఈ పార్కుకు స్థలం, మౌలిక వసతులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. కేంద్రం దానికి నిధుల కేటాయింపుతో పాటు రాయితీలను ఇస్తుంది. పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్టుపై కార్యాచరణను ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టింది. సీబీఆర్‌ఈ అనే సలహా సంస్థ ద్వారా అనువైన స్థలాల ఎంపికకు అధ్యయనం చేసింది. పది ప్రాంతాల్లో సర్వేలు సాగాయి. త్వరలో తుది నివేదికను సీబీఆర్‌ఈ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు ఇవ్వనుంది. శుక్రవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) అధికారులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. సీబీఆర్‌ఈ నివేదికను సమర్పించిన తర్వాత తమకు ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు సమర్పిస్తామని టీఎస్‌ఐఐసీ అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు వరకు నివేదిక అందే వీలుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలియజేశారు.
ప్రోత్సాహాల గురించి తెలిసి....
రాష్ట్రం లాజిస్టిక్స్‌ పార్కులకు ఇస్తున్న ప్రోత్సాహాల గురించి తెలిసి అదాని సంస్థ రంగంలోకి దిగింది. సంస్థ ప్రతినిధులు దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు. మొత్తం 1,676 ఎకరాల్లో, రూ.30 వేల కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేస్తామని, పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలియజేసింది. తమకు విజయవాడ జాతీయ రహదారిపైనున్న రామన్నపేట వద్ద భూమిని సేకరించి ఇవ్వాలని కోరింది. అక్కడ ఏ భూములు అందుబాటులో ఉన్నాయో వివరించింది. రైల్వే మార్గం అందుబాటులో ఉండడంతో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపింది. భూసేకరణ సాధ్యాసాధ్యాల (ఫీజిబిలిటీ)పై నివేదిక ఇవ్వాలని టీఎస్‌ఐఐసీ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. భూసేకరణకు సానుకూలతలు లేకపోతే మరో ప్రాంతాన్ని ఎంచుకోవాలని టీఎస్‌ఐఐసీ అధికారులు కోరనున్నారు.
మంత్రుల కమిటీది తుది నిర్ణయం
భారీ పెట్టుబడులతో కూడిన మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులకు మంత్రివర్గ ఉపసంఘం అనుమతులు పొందాల్సి ఉంటుందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ఇందులో రాయితీలు, ఇతర అంశాలను ఖరారు చేస్తారని చెప్పారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని