Mask:మాస్కు పెట్టుకోకపోతే తలపై ఒక్కటిస్తుంది!
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 12:45 IST

Mask:మాస్కు పెట్టుకోకపోతే తలపై ఒక్కటిస్తుంది!

సరదాతో పాటు సందేశాన్నీ పంచుతున్న హర్ష్‌ గొయెంకా వీడియో

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. కఠిన ఆంక్షలను ప్రభుత్వాలు సడలిస్తున్నాయి. దీంతో ప్రజలు యథావిధిగా రోడ్లపైకి వస్తున్నారు. అయితే, కొవిడ్‌ కట్టడి నిబంధనల్ని పాటించకపోతే మూడో వేవ్‌ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ.. ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. మార్కెట్లు, రోడ్లు, షాపింగ్‌ మాళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి.

ఈ తరుణంలో కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించే వారి కోసం రూపొందించిన ఓ ప్రత్యేక యంత్రానికి సంబంధించిన ఓ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గొయెంకా ట్విటర్‌లో పంచుకున్నారు. వీటిని ప్రతి క్రాసింగ్‌ వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియో సరదాతో పాటు సందేశాన్నీ పంచుతోంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఇద్దరు వ్యక్తులు బయటి నుంచి లోపలికి వస్తుంటారు. అందులో ఒకరు మాస్క్‌ పెట్టుకోగా.. మరొకరు మాస్క్‌ లేకుండా నిర్లక్ష్యంగా ఉంటాడు. అయితే, ఎంట్రీ వద్ద ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక యంత్రం మాస్క్‌ లేని వ్యక్తిని గుర్తించి తలపై ఒక్కటి మోదుతుంది. దీంతో వెంటనే ఆ వ్యక్తి అప్రమత్తమై మాస్కు ధరించగానే వదిలిపెడుతుంది.

మూడో వేవ్‌ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే కొవిడ్‌ కట్టడి నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. లేదంటే వైరస్ మరింత రూపాంతరం చెంది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో పాటు ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలతోనే భవిష్యత్‌ వేరియంట్లను నివారించగలమని స్పష్టం చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని