పంట రుణాలతోనే సరిపెట్టొద్దు: హరీశ్‌రావు

తాజా వార్తలు

Updated : 30/01/2021 13:58 IST

పంట రుణాలతోనే సరిపెట్టొద్దు: హరీశ్‌రావు

నాబార్డు రాష్ట్ర ఫోకస్‌ పేపర్ విడుదల చేసిన మంత్రి

హైదరాబాద్‌: బ్యాంకులు పంట రుణాలతో సరిపెట్టకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే అంశాలపైనా దృష్టి సారించాల్సిన అవసరముందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నగరంలోని అమీర్‌పేటలో నిర్వహించిన నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు-2021కు హాజరైన మంత్రి.. నాబార్డు రాష్ట్ర ఫోకస్‌ పేపర్ 2021-22ని విడుదల చేశారు. వార్షిక రుణ ప్రణాళిక కింద రూ.1,35,780.33 కోట్లను నాబార్డు ప్రకటించగా.. అందులో వ్యవసాయ, మార్కెటింగ్‌ రంగానికి రూ.59,440.44 కోట్లను కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.12,881.49 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,764.82 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 39,361 కోట్లు, వ్యవసాయ సహకార కార్యకలాపాలకు రూ.8,281.30 కోట్లు కేటాయించారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యవసాయ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించినప్పటికీ రైతుల ఆదాయం మాత్రం రెట్టింపు కావడం లేదన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టి నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు కల్పించాలని సూచించారు. పంటలు పండుతున్నా ప్రాసెసింగ్‌ పరిశ్రమలు లేకపోవడంతో తీవ్రనష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పిల్లలు.. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కోర్సులు చేసిన యువతను ప్రోత్సహించగలిగితే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. నాబార్డు, బ్యాంకులు కేవలం రుణాలు ఇవ్వడంలోనే కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఉపయోగపడే అంశాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

‘‘మన దేశంలో పట్టు కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగతా 50 నుంచి 60 శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడే ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లయితే రైతుల ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ క్రాప్‌ లోన్లు కాకుండా పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరమయ్యే పంటల సాగుపై బ్యాంకులు దృష్టి సారించి రైతులకు పెట్టుబడి సాయం అందేలా చూడాలి’’ అని హరీశ్‌రావు కోరారు. నాబార్డు విడుదల చేసిన క్రెడిట్‌ యాక్షన్‌ ప్లాన్‌ రాష్ట్రంలోని రైతులకు మరింత మేలు చేస్తుందన్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకులు, నాబార్డు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..

రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలు

2020లో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టాంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని