Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 27/09/2021 21:00 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. పర్యావరణ, అటవీశాఖ వ్యవహారశైలిపై ఎన్జీటీ ఆగ్రహం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, అటవీశాఖల వ్యవహారశైలిపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని మండిపడింది. ప్రాజెక్టుపై అక్టోబరు 1లోగా నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), అటవీ, పర్యావరణ శాఖలను ఎన్జీటీ ఆదేశించింది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ కోసమే పనులు చేపట్టామని ఏపీ తరఫు న్యాయవాది తెలిపారు. అక్రమాలు జరిగాయని నిజమైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

2. పవన్‌..! మంత్రులు తప్పు చేస్తే కేసులు పెడదాం.. ఈలోగా మీరొక పనిచేయండి!

‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా పవన్‌కల్యాణ్‌ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణ మురళి అన్నారు. పవన్‌ వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు, వైకాపా నాయకులు కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పోసాని విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పు చేస్తే పోలీసు కేసులు పెడదాం. ఈలోగా మీరొక పని చేయాలి. తెలుగు సినీ పరిశ్రమలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మీరు పెద్ద హీరో. మీరు పరిష్కరించగలరు. ముందు ఆ సమస్యలను పరిష్కరించండి’’ అని పోసాని పవన్‌కల్యాణ్‌కు పోసాని సూచించారు.

3. ‘గులాబ్‌’ ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా కుండపోత వర్షం

గులాబ్‌ తుపాను తీవ్రత తెలంగాణపై చూపిస్తోంది. తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని వనస్థలిపురం, ఎల్బీనగర్‌, నాగోల్‌, మన్సూరాబాద్, బీఎన్‌రెడ్డి నగర్‌, తుర్కయాంజాల్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌,  కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్, నారాయణగూడా, హిమాయత్‌నగర్, లక్డికాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది.

Cyclone gulab live Updates
రామోజీ గ్రూప్ సంస్థలకు రెండు ఎక్సలెన్సీ అవార్డులు

4. ప్రైవేటు వ్యక్తులు నడపలేక పోతున్నారనే ప్రభుత్వం తీసుకుంటోంది: ఆదిమూలపు సురేశ్‌

ప్రభుత్వ గ్రాంటుతో ప్రైవేటు యాజమాన్యాలు కాలేజీలు, పాఠశాలలు నడుపుతున్పప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఎక్కడైనా నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని.. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రభుత్వ గ్రాంటుతో నడుస్తున్న పాఠశాలలు, కళాశాలలు 2,200కు పైగా ఉన్నాయన్నారు. సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు.

5. రూ.16.9 లక్షల కోట్లను తాకిన రిలయన్స్‌ మార్కెట్‌ విలువ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర నేడు రికార్డు స్థాయికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.16.9లక్షల కోట్లను తాకింది. ఉదయం 9.44 సమయంలో రిలయన్స్‌ షేరు  జీవితకాల అత్యధికం రూ.2,510ని తాకింది. దాదాపు ఏడాది నుంచి ఈ కంపెనీ షేరు వరుసగా పెరుగుతూ వస్తోంది. దాదాపు ఏడాది కాలంలో ఈ కంపెనీ షేరు 25శాతం విలువ పెంచుకొంది. రిలయన్స్‌ జియో డిజిటల్‌ ఎకో సిస్టమ్‌లో తిరుగులేని శక్తిగా ఎదగడం, రిలయన్స్ రిటైల్‌ వేగంగా నెట్‌వర్క్‌ను విస్తరించడం వంటి కారణాలతో షేరు ధర పెరుగుతోంది.

6. దిలీప్‌ ఘోష్‌పై దాడికి యత్నం.. తుపాకులు ఎక్కుపెట్టిన భద్రతాసిబ్బంది

పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపూర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్నిక తేదీ సమీస్తుండటంతో భాజపా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఈ సమయంలో భాజపా నేత దిలీప్ ఘోష్‌పై దాడి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దాడికి యత్నించిన గుంపును చెదరగొట్టేందుకు ఘోష్ భద్రతా సిబ్బంది తుపాకులను ఎక్కుపెట్టాల్సిన పరిస్థితి తలెత్తినట్లు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.

7. అలాంటి అధికారులు జైలుకు వెళ్లాల్సిందే : సుప్రీం కోర్టు

మునుపటి ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలిగి అక్రమార్జనకు పాల్పడే అధికారులు.. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని తిరిగి చెల్లించే పరిస్థితులను ఎదుర్కొంటారని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అలాంటి పోలీసు అధికారులకు రక్షణ కల్పించలేమని.. వారిని తప్పకుండా జైలుకు పంపించాల్సిందేనని స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో సస్పెండైన ఐపీఎస్‌ అధికారి గుర్జీందర్‌పాల్‌ సింగ్‌.. తనను అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

8. కరోనా పుట్టుకపై మరోసారి దర్యాప్తునకు సిద్ధం..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మరోసారి పరిశోధనలు ప్రారంభించే అవకాశం ఉంది! ఈ వారం చివరిలోగా ఏర్పాటయ్యే కొత్త బృందం ఆధ్వర్యంలో అన్వేషణ చేపట్టనుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన తాజా కథనంలో పేర్కొంది. జెనెటిక్స్‌, జంతు వ్యాధులు, లేబొరేటరీ సేఫ్టీ, బయోసెక్యూరిటీ తదితర రంగాల్లో నిపుణులైన దాదాపు 20 మంది శాస్త్రవేత్తలు ఈ బృందంలో ఉంటారని, ఈ క్రమంలో చైనాతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆధారాలు సేకరిస్తారని తెలిపింది.

9. ‘జీ’ అత్యవసర బోర్డు సమావేశానికి వాటాదారుల డిమాండ్‌?

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రధాన వాటాదారులైన ఇన్వెస్కో, ఓఎఫ్‌ఐ గ్లోబల్‌ చైనా అత్యవసర బోర్డు సమావేశానికి పిలుపునిచ్చినట్లు సమాచారం. సీఈఓ పునీత్‌ గోయెంకాను ఆ పదవి నుంచి తప్పించాల్సిందేనని వారు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబరు 23న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు లేఖ రాసినట్లు ఓ ప్రధాన వాణిజ్య పత్రిక పేర్కొంది. మూడు వారాల్లోగా సమావేశం నిర్వహించకుంటే కోర్టుకు వెళ్లే యోచనలో వాటాదార్లు ఉన్నట్లు తెలుస్తోంది.

10. ముంబయిపై ట్రోల్స్‌.. ఏకంగా స్కోర్‌కార్డునే ఫోన్‌ నంబర్‌ చేసేశారుగా!

ఐపీఎల్‌ టోర్నీలో ఇప్పటి వరకూ అత్యధికంగా ఐదుసార్లు కప్పుకొట్టిన ముంబయి ఇండియన్స్‌ ఈ సారి ఎందుకో తడబడుతోంది. ఈ సీజన్‌లో పది మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ఈ సీజన్‌ రెండో దశలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఏడో స్థానానికి పడిపోయింది. బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోవడం చూసి.. ఒకప్పటి ముంబయి జట్టేనా అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

ఐపీఎల్‌: ఎస్‌ఆర్‌హెచ్‌ vs ఆర్‌ఆర్‌ లైవ్‌ బ్లాగ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని