Night curfew విధిస్తే సరిపోతుందా?
close

తాజా వార్తలు

Updated : 23/04/2021 17:55 IST

Night curfew విధిస్తే సరిపోతుందా?

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు, చికిత్సలు, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ విజయ్‌ సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 1 నుంచి 21 వరకు 19.64 లక్షల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. 16.17 లక్షల ర్యాపిడ్‌ పరీక్షలు, 3.47 లక్షల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసినట్లు తెలిపింది. అయితే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య ఎప్పుడు పెంచుతారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.  కర్ఫ్యూ, ఎన్నికలు, ఔషధ విక్రయాల వంటి అంశాలపై పలు ప్రశ్నలు సంధించింది. 

ఎందుకు సిద్ధం కాలేదు?

‘‘రెండో దశ పొంచి ఉందన్న విషయం తెలిసినా ఎందుకు సిద్ధం కాలేదు. కరోనా రెండో దశ వ్యాప్తి చెందాక మేల్కొంటారా? రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారని చెబుతున్నారు. కర్ఫ్యూ అమలు చేస్తే సరిపోతుందా? సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలు, పబ్‌లపై ఆంక్షలేవి? ఎన్నికల ర్యాలీలపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదు? ఏం చర్యలు తీసుకున్నారు? పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఆంక్షలున్నప్పుడు.. మరి ఎన్నికలు అతీతమా? రాష్ట్రంలో కరోనా మరణాలపై ప్రభుత్వానివి కాకిలెక్కలని ఆరోపణలున్నాయి. ఔషధాల అక్రమ విక్రయాల నియంత్రణకు ఏం చేస్తున్నారు? రెండు నెలల వ్యవధిలో నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులేమిటో వెల్లడించాలి’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

పడకల వివరాలు ప్రదర్శించాలి

‘‘రాష్ట్రంలోని నిర్మల్‌, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచాలి. ఆస్పత్రిలో చేరేందుకు ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు కోసం ఒత్తిడి చేయొద్దు. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చుకోవాలి. హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి కమ్యూనిటీ కిచెన్‌ ద్వారా భోజనం అందించాలి. సాయం చేసేందుకు ముందుకొచ్చే వారితో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలి. కుంభమేళాకు హాజరైనవారు హోంక్వారంటైన్‌లో ఉండేలా చూడాలి. ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల వివరాలు ప్రదర్శించాలి. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలి’’ అని హైకోర్టు తెలిపింది.

ఆక్సిజన్‌, ఔషధాల కొరతపై నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. తెలంగాణకు తక్కువగా రెమ్‌డెసివిర్‌ ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మే 1 నుంచి వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ప్రణాళిక తెలపాలని.. ఈ నెల 26లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని