TS News: కేఆర్‌ఎంబీ మార్గదర్శకాలపై తెలంగాణ అభ్యంతరం

తాజా వార్తలు

Published : 21/10/2021 19:45 IST

TS News: కేఆర్‌ఎంబీ మార్గదర్శకాలపై తెలంగాణ అభ్యంతరం

హైదరాబాద్‌: గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మార్గదర్శకాలు బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈమేరకు కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌కుమార్‌ లేఖ రాశారు. ప్రాజెక్టుల స్వాధీనం కోసం కేఆర్‌ఎంబీ ప్రతిపాదనల్లోని రూల్‌ కర్వ్స్‌, ఆపరేషన్ ప్రొటోకాల్స్‌ను నిపుణుల కమిటీ ఈనెల 20న పరిశీలించిందన్న ఆయన.. అవన్నీ బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డుకు విరుద్ధంగా ఉన్నట్టు సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడిందని తెలిపారు. జల విద్యుత్‌ ప్రాజెక్టు అయిన శ్రీశైలం నుంచి
బేసిన్‌ వెలుపలకు నీటిని మళ్లించరాదని ట్రైబ్యునల్‌ స్పష్టంగా పేర్కొందని, దీన్ని మార్చే అధికారం కృష్ణా బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి లేదని లేఖలో స్పష్టం చేశారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ అవార్డు అమల్లోకి వచ్చే వరకు బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డును పూర్తి స్థాయిలో పాటించాల్సిందేనన్న రజత్‌ కుమార్‌... అంతర్రాష్ట్ర ఒప్పందం,  ప్రణాళికాసంఘం ఆమోదం ప్రకారం శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ కేవలం 34 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకోవాలన్నారు. సగటు వినియోగం గణాంకాల కోసం 2014-15 నుంచి ఏడేళ్ల సగటును తీసుకోవడం బచావత్‌ అవార్డుకు విరుద్ధమని పేర్కొన్నారు. 

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా అక్రమంగా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్న ఏపీ వాదనకు బలం చేకూర్చినట్లవుతుందని అన్నారు. పరీవాహక ప్రాంతం లేకున్నప్పటికీ రెండు రాష్ట్రాల తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం నాగార్జున్ సాగర్ కీలకమని రజత్ కుమార్ అభిప్రాయపడ్డారు. శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తేనే సాగర్ కు జలాలు వస్తాయని... ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులకు సమీకృతంగా రూల్ కర్వ్ అవసరమని తెలిపారు. బచావత్ అవార్డు ప్రకారం రెండు జలాశయాల్లోనూ క్యారీ ఓవర్ స్టోరేజ్ కోసం నిబంధనలు పెట్టడం తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో బచావత్‌ ట్రైబ్యునల్ అవార్డుకు లోబడి రూల్ కర్వ్స్, ఆపరేషన్ ప్రొటోకాల్స్ సవరించాలని కృష్ణా బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని