Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 23/09/2021 20:58 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. పండుగలే లక్ష్యం.. 40 మంది ఉగ్రవాదుల పన్నాగం!

రాబోయే పండుగ రోజుల్లో దేశంలో భారీ దాడులకు తెగబడేందుకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు మరోసారి హెచ్చరించాయి. మన దేశంలోకి చొరబడేందుకు 40 మంది అఫ్గాన్‌ ఉగ్రవాదులు పన్నాగాలు రచిస్తున్నట్టు తెలిపింది. పాక్‌ మద్దతుతో దేశంలోకి చొరబడేందుకు వారంతా సిద్ధంగా ఉన్నట్టు హెచ్చరించింది. 

2. కొవిడ్‌పై పోరులో.. భారత్‌ చర్యలు భేష్‌..!

కరోనా వైరస్‌పై చేస్తోన్న పోరాటంలో భారత్‌ చేస్తోన్న కృషిని మరే దేశం చేయలేకపోయిందని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రశంసించింది. కొవిడ్‌తో మరణించిన కుటుంబాలకు రూ.50వేల పరిహారం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. కొవిడ్‌ మృతుల పరిహారంపై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీం కోర్టు.. అక్టోబర్‌ 4వ తేదీన తుది తీర్పును వెలువరించనుంది.

3. ఏపీలో మరింత సులభంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా తొలి దశలో త్వరలో 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.

4. హైదరాబాద్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. 31 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలు

హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదగాలని.. నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.హైదరాబాద్‌లో ప్రస్తుతం 772 ఎంఎల్‌డీలను శుద్ధి చేసే సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో 25 సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ (ఎస్‌టీపీ) పని చేస్తున్నాయన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లోని మరో 31 ప్రాంతాల్లో ఎస్‌టీపీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రూ. 3,866 కోట్లు మంజూరు చేస్తూ జీవో 669ని జారీ చేశారు.

5. నరేగా బిల్లులు రాలేదా.. నాకు చెప్పండి: చంద్రబాబు

రాష్ట్రంలో ఎవరికైనా నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) బిల్లులు రాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నరేగా ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. బాధితులకు ప్రభుత్వం వడ్డీతో సహా చివరి పైసా చెల్లించే వరకూ ఈ విభాగం కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు.

6. మేం చెప్పే వరకు ప్రభుత్వ భూములు విక్రయించొద్దు: హైకోర్టు

రాష్ట్రంలో మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ భూముల అమ్మకాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. విశాఖ, గుంటూరులోని ప్రభుత్వ స్థలాలు, భూముల అమ్మకాలు ఆపాలని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈమేరకు ఆదేశాలిచ్చింది.

7. జాగ్రత్త.. ఇంకా కరోనా సెకండ్‌ వేవ్‌ మధ్యలోనే ఉన్నాం: కేంద్రం

దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇంకా మనం సెకండ్‌ వేవ్‌ మధ్యలోనే ఉన్నామని.. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఒక్క కేరళలోనే లక్షకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయని, గత వారంలో నమోదైన మొత్తం ఇన్ఫెక్షన్లలో 62.73% కేసులు ఆ రాష్ట్రం నుంచే వచ్చాయని పేర్కొంది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు. 

8. భారత మార్కెట్‌లోకి ఫోక్స్‌వాగన్‌ టైగన్‌..!

భారత మార్కెట్లోకి ఫోక్స్‌వేగన్‌ టైగన్‌ అడుగుపెట్టింది. వేరియంట్‌ను బట్టి ఈ ఎస్‌యూవీ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.10.49 లక్షల నుంచి 17.49 లక్షల వరకు ఉంది.  దీనిలో ఫీచర్ల ఆధారంగా టైగన్‌ 1.0 కంఫర్ట్‌ లైన్‌, హైలైన్‌, హైలైన్‌ ఏటీ, టాప్‌లైన్‌ ఎంటీ, టాప్‌లైన్‌ ఏటీ, 1.5 టీఎస్‌ఐ జీటీ లైన్‌, 1.5 టీఎస్‌ఐ జీటీ లైన్‌ ప్లస్‌ వేరియంట్లను సిద్ధం చేశారు. ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కారును లుక్స్‌లో చాలా స్టైలిష్‌గా తీర్చిదిద్దారు.

9. వచ్చే వారం ఓయో ఐపీవో దరఖాస్తు!

ఆతిథ్య రంగ స్టార్టప్‌ ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ ఐపీవోకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. వచ్చేవారం ఈ కంపెనీ ఐపీవోకు సంబంధించిన ఫైల్‌ను నియంత్రణ సంస్థకు సమర్పించనున్నట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. ఈ ఐపీవో విలువ  బిలియన్‌ డాలర్ల నుంచి 1.2 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనావేశారు. ప్రస్తుతం ఓయోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకుకు 46శాతం వాటాలు ఉన్నాయి. 

10. సీఎం సాబ్‌ డ్యాన్స్‌ చూశారా!

ఈ చిత్రంలో అదరగొట్టే డ్యాన్స్‌ స్టెప్స్‌తో కనిపించేది.. ఏ సినిమా హీరో కాదు, డ్యాన్స్‌ షో జడ్జి కాదు.. కొరియోగ్రాఫర్‌ అంతకన్నా కాదు. ఆయన ఎవరో కాదు పంజాబ్‌ సీఎం, చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీనే. ఈనెల 19న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన ఆయన.. కపుర్తాలాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఇలా స్టేజీ మీద ‘భాంగ్రా డ్యాన్స్‌’ వేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని