
తాజా వార్తలు
పనితీరును ప్రజలు బేరీజు వేయాలి: కేసీఆర్
డిసెంబర్ 7నుంచి వరదసాయం పునఃప్రారంభం
కేంద్రాన్ని రూ.1.350కోట్లు అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదు
హైదరాబాద్ దేశంలో లేదా?
తెలంగాణ ప్రజలే మా బాసులు
తెరాస బహిరంగ సభలో సీఎం వ్యాఖ్యలు
హైదరాబాద్: ఎన్నికల్లో ఓటేసే ముందు నేతల పనితీరును ప్రజలు బేరీజు వేసుకోవాలని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, నేతలు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు.. ఏ పద్ధతిలో ముందుకెళ్తున్నారనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెరాస బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ చాలా చైతన్యం, చరిత్ర ఉన్న నగరమని చెప్పారు. ఎన్నో మంచిచెడులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. 2001లో ఉద్యమాన్ని ప్రారంభిస్తే సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్రం అంధకారమవుతుందని కొంతమంది, నీళ్లు రావని మరికొంతమంది శాపాలు పెట్టారని ఆక్షేపించారు. ఇన్ని అనుమానాలు, అపోహల మధ్య తెరాస పార్టీని నమ్మి దీవించి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు.
తెరాస ఊహించని పరిణతి సాధించింది
‘‘అంతకుముందు కేసీఆర్ ఉద్యమనాయకుడు. ప్రసంగాలకు ప్రజలు చెవికోసుకుని వినేవారు. లక్షల మంది సభలకు హాజరయ్యేవారు. దేశం ఆశ్చర్యపోయే సభలు జరిగాయి. అది రాష్ట్రం ఏర్పడేవరకు ఉన్న చరిత్ర. ఉద్యమం గమ్యాన్ని ముద్దాడింది. తెరాస ఉద్యమ పార్టీగా ఉండదని.. ఇక కావాల్సింది రాజకీయ పరిణతి అని అప్పుడే చెప్పాను. అందరి అంచనాలను తలకిందులు చేసి ఏ రకంగా తెరాస పురోగమించిందో.. కుల, మత, జాతి, ప్రాంత వివక్ష లేకుండా ఎటువంటి నైపుణ్యాన్ని ఆచరించి చూపిందో అందరిముందూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి బాధ్యత మీద పడిన తర్వాత ఎవరూ ఊహించని పరిణతిని తెరాస పార్టీ, ప్రభుత్వం ప్రదర్శించింది. ఈ గడ్డమీద ఉన్న ప్రతి బిడ్డా మా బిడ్డే అని.. వారి సంరక్షణ మాదే అని ధైర్యంగా చెప్పాం. గత ఆరేళ్లలో మత, కుల వివక్ష టార్చిలైట్ పెట్టి వెతికినా కనిపించదు. వెలుగు జిలుగుల తెలంగాణ కావాలని ప్రభుత్వం ఏర్పడిన ఏడెనిమిది మాసాల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించాం. ఆ తర్వాత విద్యుత్ కోసం బాధపడే పరిస్థితి లేదు. అది తెలంగాణ సాధించాక సాధించిన మొట్టమొదటి విజయం. దేశ తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రమే నంబర్‌వన్‌గా ఉంది. ఇది నా లెక్క కాదు.. కేంద్రమే ప్రకటించింది. దీని వెనుక ఎంతో తపన, కృషి దాగి ఉంది. ఏనాడూ పక్షపాత నిర్ణయాలు తీసుకోలేదు. తెరాస పథకాలు ఇతర రాష్ట్రాలు, పార్టీలకు ఆదర్శంగా నిలిచాయి. మిషన్ భగీరథ అద్భుతం.. అనన్య సామాన్యం. ఛాలెంజ్ చేసి తొడగొట్టి సాధించి ప్రజలకు అందించిన పథకం అది. నీటి ట్యాంకర్ల దగ్గర వీధి పోరాటాలు, పంచాయితీలు లేవు. రాష్ట్రంలో దాదాపు 95 శాతం నీటి సమస్యకు భరతవాక్యం పలికాం. రాష్ట్ర ప్రజలకు 24 గంటల మంచినీటి సదుపాయం తేవాలనేది నా కళ.
అపార్ట్మెంట్ వాసులకూ ఉచిత మంచినీరు
ప్రజల సహకారం ఉంటే రాబోయే కొన్ని నెలలు, సంవత్సరాల్లో హైదరాబాద్‌లో 24 గంటలూ నీరిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పేదలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీరు ఇవ్వాలని నిర్ణయించాం. ఇది నగర ప్రజలకు శాశ్వతంగా కేసీఆర్ అందించిన కానుక. నగరంలో దాదాపు 98 శాతం పేదలకు ఇది వర్తిస్తుంది. అపార్టుమెంట్ వాసులకూ దీన్ని వర్తింపజేస్తాం. తెరాస ఏ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా చేశాం. కంటివెలుగు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. ఇలా ఎన్నో అందించాం. కేసీఆర్ కిట్ సూపర్‌హిట్ పథకం. రైతుబంధు దేశంలో ఎక్కడా లేదు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతిరైతుకూ ఎకరాకు 10వేలు ఠంచనుగా అందుతున్నాయి. నగరంలో 350 బస్తీదవాఖానాలు ఏర్పాటు చేశాం. అవి ఏ మతానికో ఏ కులానికో కాదు.. నగర ప్రజలు అందరివీ. కులవృత్తుల వారిని ఆదుకున్నాం. యాదవ కుటుంబాలకు గతంలో మాదిరే గొర్రెలు పంపిణీ చేస్తాం. దోభీ ఘాట్లకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ నిర్ణయం తీసుకున్నాం. వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేశాం. ఇవన్నీ కులమత భేదాలు లేకుండా అందరికోసం ఏర్పాటు చేసిన పథకాలు. ఈ ఆవిష్కరణలన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయి. కరోనాతో ప్రభుత్వ ఆదాయం పడిపోయినా.. సంక్షేమ పథకాలను ఆపలేదు. ఆ సమయంలో ఏ విధంగా ముందుకెళ్లామో ప్రజలు గమనించాలి. రాష్ట్రంలో ఏటా రూ.42వేల కోట్లకు పైగా సంక్షేమానికి కేటాయిస్తున్నాం. మీ సమీక్ష కోసమే వీటిని చెబుతున్నా. ఎన్నికల్లో గాలివాటంగా ఓటేయకూడదు..వీటిని ఆలోచించాలి. ప్రజలు ఆశీర్వదించి పంపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.
చరిత్రలో ఎవరూ ఇలా ఇవ్వలేదు
దేశంలో వరదలు రాని నగరమే లేదు. ముంబయిలో 10-15రోజులు, చెన్నైలో 21 రోజులు వరద నీరు నిలిచిపోయింది. బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లోనూ వరదలు వచ్చాయి. హైదరాబాద్‌లో వచ్చిన వరదలో తెరాస ప్రజాప్రతినిధులు మోకాలిలోతు నీటిలో తిరిగారు. ప్రజల బాధలు చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎవరూ నన్న అడగకపోయినా పేదలను ఆదుకోవాలని ఒక్కో కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం ప్రకటించాం. చరిత్రలో ఎవరూ ఇలా ఇవ్వలేదు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ విధంగా అందించలేదు. కానీ ఇక్కడ మాత్రం కిరికిరి పెడుతున్నారు. బాధతో ఆ మాట అంటున్నా.. ఇది విజ్ఞతా? దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా నగరంలోని 6.50లక్షల కుటుంబాలకు రూ.650 కోట్లు అందించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా?గతంలో హైదరాబాద్‌కు వరదలు రాలేదా? ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చారా? ఎస్ఈసీని ఇబ్బంది పెట్టి వరదసాయాన్ని ఆపేయించారు. మిగిలిన అర్హులందరికీ డిసెంబర్ 7 నుంచే రూ.10వేలు పంపిణీ చేసే బాధ్యత నాది.
బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?
వరదలపై రూ.1350కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరితే 13 పైసలు కూడా ఇవ్వలేదు. మేం దేశంలో లేమా? బెంగళూరు, అహ్మదాబాద్‌కు ఇవ్వలేదా? మేమేం తప్పుచేశాం?ఎవరికి కర్రు కాల్చి వాత పెట్టి బుద్ధి చెప్పాలో నిర్ణయించుకోండి. వరదసాయం ఇవ్వలేదు కానీ.. నగరానికి వరదలా వస్తున్నారు. ఇవి మున్సిపల్ ఎన్నికలా? జాతీయ ఎన్నికలా? బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచీ వస్తారా? రక్తం, పౌరుషం ఉన్న కేసీఆర్ మీ బిడ్డ. మళ్లీ చెబుతున్నా.. ఆ రెండు జాతీయ పార్టీలు దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమయ్యాయి. సరైన విద్య, వైద్యం ఎందుకు లేదు? ఆకలి బాధలు ఇంకా ఎందుకు ఉన్నాయి? ఇళ్లులేని పేదలు ఇంకా ఎందుకు ఉన్నారు? ప్రజలు ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి. దేశంలో కొత్త పంథా రావాలి.. కొత్త ఆవిష్కరణ జరగాలి.. మూస రాజకీయం పోవాలి. దేశం, ప్రజల కోసం మాట్లాడితే తప్పా? నేను ఇలా అంటుంటే దిల్లీలో ఎందుకు గజగజ వణుకుతారు? నగర చైతన్యాన్ని దేశానికి విస్తరించాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా ఆ సందేశం ఇవ్వాలి. 40కోట్ల సభ్యులు, రూ.30కోట్ల ఆస్తి ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? బీహెచ్ఈఎల్, రైల్వేలను ఎందుకు అమ్మకానికి పెడుతున్నారు?
గతం కంటే నాలుగు సీట్లు ఎక్కువే సాధిస్తాం
హైదరాబాద్ శాంతియుతంగా ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. స్తిరాస్తి వ్యాపారులూ.. బీపాస్ కావాలా? కర్ఫ్యూ పాస్ కావాలా? ఆలోచించండి. వర్తక, వ్యాపార, వాణిజ్యవేత్తలు నగరాన్ని కాపాడుకోవాలి. దయచేసి నగర ప్రశాంతతను దెబ్బతీయొద్దు. కచ్చితంగా నూటికి నూరుశాతం శాంతి సామరస్యాలు పరిరక్షించుకోవాలి. అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండాలి. పూలబొకేలాంటి హైదరాబాద్ కావాలి. పక్కరాష్ట్రం వాళ్లు నాలుగు ముచ్చట్లు చెప్పి వెళ్తారు. వాళ్ల జిమ్మిక్కులకు మోసపోవద్దు. నన్ను కూడా ఏకవచనంతో సంబోధిస్తున్నారు. చిల్లర మాటలకు ఆవేశపడం. నేను కూడా బ్రహ్మాండంగా తిట్టగలను.. కానీ సంయమనం పాటిస్తున్నాం. మా బాసులు దిల్లీలో ఉండరు.. తెలంగాణ ప్రజలే మా బాసులు. ఎవరికీ భయపడం.. ఎక్కడా రాజీపడం. నగర భవిష్యత్‌కు యువత, మేధావులు కంకణం కట్టాలి. జీహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా విజయం సాధించబోతున్నాం. గతం కంటే నాలుగు సీట్లు ఎక్కువే వస్తాయి. కారు గుర్తుకు ఓటేసి తెరాస అభ్యర్థులందరినీ దీవించాలి’’ అని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.