close

తాజా వార్తలు

Updated : 19/10/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. వరద ప్రాంతాల్లో ఉచిత రేషన్‌: సీఎం జగన్‌

వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టంపై అంచనాలను వెంటనే పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తే రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే వరద ప్రాంతాల్లో నిత్యావసరాలు, ఉచిత రేషన్‌ అందించాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు సుచరిత, కొడాలి నాని ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నిరూపిస్తే రాజీనామా చేస్తా: హరీశ్‌రావు

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో అధికార పార్టీ నాయకులపై భాజపా నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెరాస సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా విజయం తెరాసదేనని హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. భాజపా గోబెల్స్‌ ప్రచారానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోందని దుయ్యబట్టారు. ఎదుటి పార్టీలు చేసినవి కూడా తామే చేశామని చెప్పుకుంటున్నారని చెప్పారు. దుబ్బాక ప్రజలంతా తిరగబడుతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో కొత్తగా 2,918 మందికి కరోనా

రాష్ట్రంలో కొత్తగా మరో 2,918 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 24 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు చేరింది. ప్రస్తుతం 35,065 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 6,453 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,330 శాంపిళ్లను పరిశీలించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వ్యాక్సిన్‌ కోసం వంద కోట్ల సిరంజిలు..!

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రయోగాలు తుది దశకు చేరుకున్న తరుణంలో టీకా పంపిణీపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల సిరంజిలను అందుబాటులో ఉంచుతామని యునిసెఫ్‌ వెల్లడించింది. వీటిలో ఈ సంవత్సరం చివరినాటికే 52 కోట్ల సిరంజిలను సిద్ధం చేస్తామని ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌ను ముందస్తుగా పంపిణీ చేసే దేశాల్లోని తమ గోదాముల్లో ఈ 52కోట్ల సిరంజిలను నిల్వచేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి చిన్నారుల నిధి విభాగం (యునిసెఫ్‌) ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఉన్నత విద్యకు అంతర్జాతీయ హబ్‌గా భారత్‌: మోదీ 

దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి అన్ని రంగాల్లో అవసరమైన మార్పులు చేపడుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అంతర్జాతీయంగా ఉన్నత విద్యకు భారత్‌ను హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ దశాబ్దాన్ని భారత దశాబ్దంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మోదీ కర్ణాటకలోని మైసూరు విశ్వవిద్యాలయం పట్టా ప్రదాన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వారు ఉబెర్‌ ఎక్కాలంటే.. సెల్ఫీ దిగాల్సిందే!

ప్రముఖ వాహన సేవల సంస్థ ఉబెర్‌ భారత్‌లో కొత్త భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. ‘మాస్క్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌’ అనే ఈ విధానం నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం గతంలో మాస్క్‌ ధరించకుండా ఉబెర్‌లో ప్రయాణించిన వారికి యాప్‌ ఆ సంగతిని గుర్తు చేస్తుంది. వారు తదుపరి ఉబెర్‌ రైడ్‌ను బుక్‌ చేసుకోవాలంటే .. మాస్క్‌ ధరించి ఉన్న సెల్ఫీని పంపవలసి ఉంటుందని సంస్థ వివరించింది. ఎవరైనా వినియోగదారుడు మాస్క్‌ ధరించనపుడు.. ఆ విషయాన్ని డ్రైవర్‌ తన యాప్‌లో నమోదు చేస్తాడు. ఆ సమాచారం ఆధారంగా ఇది పనిచేస్తుందని అధికారులు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. త్వరలోనే సీఏఏ అమలు: నడ్డా

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని త్వరలోనే అమలు చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఈ చట్టం అమలులో జాప్యం ఏర్పడిందన్నారు. ఉత్తర బెంగాల్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా విభజించి పాలించే రాజకీయాలను సాగిస్తోందని ఆరోపించారు. భాజపాలా అందరి అభివృద్ధి కోసం పని చేయడంలేదని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ధోనీ మరో అరుదైన రికార్డు!

టీ20 క్రికెట్‌ లీగ్‌లో చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ అరుదైన రికార్డు సృష్టించాడు. లీగ్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. సోమవారం రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ అరుదైన ఘనత సాధించాడు. చెన్నైకి 170 మ్యాచ్‌లు ప్రాతినిధ్యం వహించిన అతడు పుణె తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా చెన్నై జట్టును రెండేళ్లు నిషేధించడంతో 2016, 2017 సీజన్‌లో ధోనీ పుణె తరఫున ఆడిన సంగతి తెలిసిందే. సారథిగా చెన్నై జట్టుకు అతడు మూడు టైటిళ్లు సాధించాడు. అంతేగాక ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కు చేర్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చెన్నైXరాజస్థాన్‌ మ్యాచ్‌: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

9. ఇంటి వద్దే మ్యాథ్స్‌ .. సులువుగా నేర్చుకోండిలా!

కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు చదువుకునేందుకు ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. వివిధ విషయాల్ని అర్థం చేసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు గణితాన్ని సులువుగా అర్థం చేసుకునేలా సీబీఎస్‌ఈ సరికొత్త పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం గణితం ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ బుక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో పేర్కొంది. దానికి సంబంధించిన వివరాలను కేంద్ర విద్యాశాఖ ట్విటర్‌ ద్వారా పరిచయం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కోలుకున్నా.. వదలని ‘కరోనా’ లక్షణాలు!

కరోనా బారినపడి కోలుకున్నవారిలో చాలా మందిని ఈ వైరస్‌ లక్షణాలు వెంటాడుతున్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్‌ సోకి డిశ్చార్జి అయిన రెండు, మూడు నెలల తర్వాత కూడా వారిలో ఆ ప్రభావం ఉన్నట్టు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. 58 మందిపై అధ్యయనం చేసిన శాస్ర్తవేత్తలు పలు విషయాలను వెల్లడించారు. ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న వారిలో సగం మందిలో శ్వాస సంబంధమైన ఇబ్బందులతో పాటు అలసట, మానసిక ఆందోళన, ఒత్తిడి తదితర సమస్యలు తలెత్తినట్టు అధ్యయనంలో తేలిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.