
తాజా వార్తలు
రాష్ట్రపతితో ప్రధాని మోదీ సమావేశం
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వారివురు చర్చించినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రధాని మోదీ రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. వీరివురి సమావేశానికి సబంధించిన ఫొటోను రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను వివరించారు’’ అని ట్వీట్ చేశారు.
రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ లేహ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా జూన్ 15న చైనాతో జరిగిన ఘర్షణలో గాయపడిన సైనికులను పరామర్శించి వారితో కొద్దిసేపు మాట్లాడారు. అలానే ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి సైనికాధికారులతో సమావేశమై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పైచర్చించారు. అలానే ఆ ప్రాంతంలోని భద్రతా బలగాలను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రపతితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.