close

తాజా వార్తలు

Updated : 10/10/2020 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజమౌళిపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కంప్లెయింట్స్‌!

తారక్‌‌, చెర్రీ, కీరవాణి కూడా..

హైదరాబాద్‌: పని విషయంలో ఎంతో నిబద్ధతగా ఉంటారు అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. సమయం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ఎంతో పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. అందుకే ఆయన్ని అందరూ జక్కన్న అంటారు. అయితే రాజమౌళిపై తమకున్న కంప్లెయింట్స్‌ గురించి తెలియజేస్తూ తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. దర్శకధీరుడు పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది.

‘‘జనవరి నెలలో పల్లవి చేస్తాం.. ఆరు నెలల తర్వాత జూన్‌లోనో జులైలోనో చరణం చేస్తాం. డిసెంబర్‌లో లిరిక్‌ రాయిస్తాడు. ఆ తర్వాత సంవత్సరం మార్చి నెలలో రికార్డింగ్‌ అంటాడు. నవంబర్‌లో వాయిస్‌ మిక్సింగ్‌ ఉంటుంది. ఈలోపు పల్లవి ఏంటో మర్చిపోతాం. మాలోని ఆసక్తి పోతుంది’’ - కీరవాణి

‘‘రిలాక్స్‌ అవుదామనుకునే సమయంలోనే కష్టమైన షాట్స్‌ షూట్‌ చేస్తానంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు షాట్‌ పెడతారు. షూట్‌ చేస్తారు. కానీ ఆయనకి ఏదీ ఒక్కపట్టాన నచ్చదు. అలా ఆ షాట్‌ కాస్తా దాదాపు రెండు గంటల వరకూ షూట్‌ చేస్తారు. దాంతో మా ఆకలి చచ్చిపోయింది. ప్రతి సన్నివేశం కూడా పర్‌ఫెక్ట్‌గా రావాలని చెక్కుతూనే ఉంటారు. అందుకే ఆయన జక్కన్న అయ్యారు. ఒక షాట్‌ కోసం అర్ధరాత్రి ఒకటిన్నరకి షూట్‌ ప్రారంభించి తెల్లవారుజామున నాలుగున్నరకి పేకప్‌ చెప్పారు. పర్ఫెక్షన్‌ కోసం ఆయన మమ్మల్ని చంపేస్తున్నారు’’ - తారక్‌ 

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోన్న సమయంలో సెట్‌కి వెళ్లగానే రాజమౌళిని పలకరించి.. ఆయన పక్కన కూర్చున్నా. ఆయన వెంటనే కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ చెప్పారు. ఆయన చెప్పిన షాట్స్‌ విని.. ‘బాగుంది సర్‌ కానీ కొంచెం కష్టం. ఎవరు చేస్తున్నారు?’ అని అడగగా.. ‘నువ్వే’ అన్నారు. అనంతరం ఆయన ఒక ల్యాప్‌టాప్‌లో ముందే చిత్రీకరించిన ఫుటేజ్‌ చూపించారు. నో చెప్పలేక మేము కూడా ఆయనతో అలా వెళ్లిపోతున్నాం’’- రామ్‌చరణ్‌

‘‘రాజమౌళితో షూటింగ్‌ అంటే పేకప్‌ ఎప్పుడు ఉంటుందో తెలియదు. షూటింగ్‌ పూర్తయ్యాక ఇంటికెళ్లాలనుకున్న సమయంలో మీటింగ్‌ పెడతారు. రేపు ఏం చేయాలి? అని క్లియర్‌గా వివరిస్తారు. అలా మీటింగ్‌లో ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇంటికి త్వరగా వెళ్లాలని నేను టైమ్‌ చూసుకుంటుంటాను’’ - సెంథిల్‌ కుమార్‌, డీవోపీ

‘‘విక్రమార్కుడు’ సినిమా నుంచి నేను రాజమౌళిగారితో కలిసి పనిచేస్తున్నా. తరచూ ఇంట్లోనో లేదా ఆఫీస్‌లోనో ఆయన స్టోరీ డిస్కషన్‌ పెట్టేవారు. ‘సర్‌.. స్టోరీ గురించి చర్చించడానికి చాలామంది మలేసియా, బ్యాంకాక్‌ వెళ్తున్నారు. కాబట్టి మనం కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డిస్కషన్‌ కోసం ఎక్కడికైనా వెళ్దాం’ అని అడిగాను. ఆయన సరే అన్నారు. తీరా చూస్తే ఇంటి మేడ మీదకి తీసుకువెళ్లి.. ఇక్కడే స్టోరీ గురించి చర్చిద్దాం అన్నారు. భవిష్యత్‌లోనైనా బ్యాంకాక్‌, మలేసియా వెళ్లడానికి మీరు అంగీకరించాలి’ - త్రికోఠి, కో డైరెక్టర్‌

ఇలా రాజమౌళి దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరూ సరదాగా ఏదో ఒక ఫిర్యాదు చేశారు. ఎవరెవరు? ఎలాంటి ఫిర్యాదులు చేశారో ఈ వీడియోలో చూసేయండి.

 Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన