close
Array ( ) 1

తాజా వార్తలు

మార్కెట్లను వీడని కరోనా భయాలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో లాభపడి మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 810 పాయింట్లు నష్టపోయి.. 30,579 వద్ద ముగిసింది. నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయి 8,967 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీలో యెస్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, ఐషర్‌ మోటర్స్‌, హీరో మోటర్స్‌, హిందుస్థాన్‌ యూనీలివర్‌ షేర్లు లాభాల్లో పయనించగా.. జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి. 

వీడని భయం..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ ఊగిసలాట ధోరణిలో ట్రేడయ్యాయి. ఉదయం నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన సూచీలు సమయం గడిచేకొద్దీ లాభాల్లోకి వచ్చాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 32వేల పాయింట్లను దాటి మంచి జోరుమీద ఉంది. కానీ, మధ్యాహ్నానికి సూచీలు నెమ్మదిగా కిందకు రావడం మొదలుపెట్టాయి. ఇక చివరి అరగంటలో మదుపరులు పోటీ పడి విక్రయాలకు చేశారు. రేపు ఏం జరుగుతుందో అనే భయం మార్కెట్లలో స్పష్టంగా కనిపించింది. నేటి రాత్రి అమెరికా మార్కెట్లలో ప్రతికూల వాతావరణం ఉంటే నేడు వచ్చిన లాభాలను కూడా కోల్పాతామనే భయాలతో విక్రయాలకు పాల్పడ్డారు. ఫలితంగా సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. 

పూర్తిగా కోలుకోని ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు కూడా పూర్తిగా కోలుకోలేదు. చైనా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మరోపక్క జపాన్‌ మార్కెట్లు అత్యంత స్వల్పంగానే కోలుకొన్నాయి. దీంతో దేశీయ మదుపరులు ఆందోళనకు గురయ్యారు. 

నష్టాల్లో మొదలైన యూరప్‌ మార్కెట్లు..

యూరప్‌ మార్కెట్లు ట్రేడింగ్‌ మొదలయ్యాకే సెన్సెక్స్‌, నిఫ్టీ పడిపోవడం మొదలైంది. యూరప్‌ సూచీలు మొత్తం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. జర్మనీ సూచీ ఏకంగా 7శాతం నష్టపోవడం, మిగిలిన సూచీలు 1శాతానికి పైగా విలువ కోల్పోవడంతో వాల్‌స్ట్రీట్‌ కూడా ఇదే పంథాలో కొనసాగుతుందనే ఇన్వెస్టర్లు అంచనా వేశారు. 

ట్రంప్‌ అంచనాలతో ఆందోళన..

ఇక ఆర్థిక పరిస్థితిపైనా ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేయడం మార్కెట్లను ఆలోచనలో పడేసింది. వైరస్‌ వల్ల ఎదురవుతున్న సవాళ్లతో అమెరికా ఆర్థిక వ్యవస్థ త్వరలో మాంద్యంలోకి జారుకోవచ్చని ఆయన అంచనావేశారు. అయితే తిరిగి వెంటనే కోలుకుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాము మార్కెట్ల గురించి ఆలోచించడం లేదని.. వైరస్‌ను ఎలా కట్టడి చేయాలన్న దానిపైనే దృష్టి సారించామని తెలిపారు. అమెరికాలో గత వందేళ్లలో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు వాదనల్ని వాయిదా వేసింది.

ఒకే రోజు 14వేల కేసులతో భయం..

ఒక్కరోజులో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోవడం మదుపరులను భయపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం ప్రపంచదేశాల్లో బాధితుల సంఖ్య 1,67,500 దాటినట్లు మంగళవారం పేర్కొంది. ఆయా దేశాల అధికారిక గణాంకాల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉన్నట్లు వివిధ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఐరాస భద్రతా మండలికి సంబంధించిన అన్ని రకాల సమావేశాల్ని వాయిదా వేస్తున్నట్లు యూఎన్‌ఎస్సీ ప్రకటింటింది.

భారత్‌ పై భయాలు..

కరోనా వైరస్‌ కేంద్రంగా భారత్‌ మారే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలతో వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతినే ప్రభావం ఉందని భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఫలితం కంపెనీల లాభాలపై ఉండొచ్చని మార్కెట్లలో వాటాల విక్రయాలకు పాల్పడుతున్నారు. దీనికి తోడు  నేడు భారత్‌లో మరో కరోనా రోగి మరణించడం.. వ్యాపార రాజధాని ముంబయిలో భారీగా కొత్త కరోనా కేసులు నమోదు కావడం కూడా మరో కారణంగా నిలిచింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.