close

తాజా వార్తలు

Published : 22/10/2020 07:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గంభీర స్వరం..ఆగిన క్షణం

భాగ్యనగరిలో నాయిని గురుతులు ఎన్నో

గతంలో హోంమంత్రిగా ప్రకటించగానే అభిమానులతో నాయిని

కవాడిగూడ: ఆత్మబలం.. గంభీర స్వరం.. కార్మికులు, ప్రజలను ఆదుకునేందుకు ఎంతకైనా తెగించి పోరాడేతత్వం..ఇవీ నాయిని నర్సింహారెడ్డి ఆభరణాలు. అనారోగ్యంతో ఆయన బుధవారం నగరంలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారని తెలిసి అభిమానులు తల్లడిల్లారు. రాజకీయపక్షాలు, ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు.

చివరి సభ అదే.. నిరంతరం జనం మధ్య ఉండే నాయిని సెప్టెంబరు 27న ఆఖరిసరిగా ముషీరాబాద్‌ పద్మశాలి ప్రజాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అశోక్‌నగర్‌లో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ కన్నుమూసిన చోట ఏర్పాటుచేసిన విగ్రహావిష్కరణకు హాజరయ్యారు.

అంచెలంచెలుగా ఎదిగి..

పదేళ్ల వయసులో నిజాం పోలీసులు జరిపిన కాల్పుల్లో తండ్రిని కోల్పోయిన నాయిని కుటుంబం స్వస్థలం నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ నుంచి దేవరకొండ గ్రామానికి వెళ్లింది. 4వ తరగతి చదువుతున్నపుడు ప్రొగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ పార్టీ మీటింగ్‌కు ఆయన వెళ్లారు. తర్వాత సోషలిస్టు పార్టీలో చేరారు. రాజకీయాలు, యజమాన్యాలకు అతీతంగా కార్మికుల కోసమే పనిచేయాలనే నిబంధనలతో హింద్‌ మజ్దూర్‌ సభ సిద్ధాంతాలను ఔపోసన పట్టి ఆచరించారు. బేగంబజార్‌ పహిల్వాన్లతో కుస్తీ పట్టేవారు. చార్మినార్‌, బేగంబజార్‌, కోవాబేలా, లాడ్‌బజార్‌లో చిరువ్యాపారులతో యూనియన్‌ ఏర్పాటు చేశారు. ఎమర్జన్సీ సమయంలో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తొలి దశ, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించారు.

 తెరాస ఆవిర్భావం నుంచి తుదిశ్వాస వరకు..

హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభించి గులాబీ జెండా ఎగుర వేసిన తొలిరోజు నుంచి తుదిశ్వాస వరకు గులాబీ కండువాతోనే నాయిని ఉన్నారు. ధీర, గంభీర స్వరంతో నాయిని సాగించిన పోరాటం మరపురానిది. 1978 శాసనసభ ఎన్నికల్లో ముషీరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా నాయిని పోటీ చేశారు. ఆ తర్వాత రెండు దఫాలు ఇక్కడినుంచే గెలుపుబావుటా ఎగరేశారు. మూడుసార్లు ఓడారు. ఇక్కడి ప్రజలతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉండేది.

బుల్లెట్‌ సవారీ..

మోడరన్‌ బేకరీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నపుడు రూ.6,700కు బుల్లెట్‌ కొని సవారీ చేసేవారు. ఆ వాహన శబ్దం వింటూ నాయిని ఎంత దూరంలో ఉన్నాడో పలువురు పందెం కాసేవారు. హైదరాబాద్‌లోని సోషలిస్టు పార్టీ కార్యాలయం నుంచి సికింద్రాబాద్‌లోని దినపత్రికలకు ప్రకటనలు ఇచ్చేందుకు ట్యాంక్‌బండ్‌పై నుంచి తిరిగేవారు. ధోవతీకట్టు.. మీసం కట్టు..మల్లయోధుడి స్వరూపం.. గంభీరమైన స్వరం నాయినికి వన్నెలద్దాయి. రష్యాలో మే డే ఉత్సవాలకు వెళ్లినప్పుడు, అమెరికాలో తానా సభలకు హాజరైనప్పుడు సైతం ఇదే ధోవతీకట్టుతోనే పాల్గొన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.