
తాజా వార్తలు
ఏపీ ‘పంచాయతీ’.. నేతల మాటల యుద్ధం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రోజురోజుకూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు.. ఎన్నికలు నిర్వహించి తీరుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం మరోవైపు.. ఇలా ఏపీలో ప్రస్తుతం వాడీవేడి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు సైతం ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు విముఖత చూపిస్తున్నాయి. ఇదేం లెక్కచేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రాష్ట్ర స్థాయి అధికారులతో నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్‌కు సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, కొన్ని జిల్లాల అధికారులు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓవైపు అధికార వైకాపా నేతలు ఎస్ఈసీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే.. ఎన్నికల నిర్వహణను అడ్డుకుంటుందని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలు జరిగితే తమ ఓట్ల ద్వారా వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు: పెద్దిరెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల కంటే కొవిడ్ వ్యాక్సినేషన్ ముఖ్యమైనదన్నారు. గతంలో ఎన్నికలను నిమ్మగడ్డ స్వార్థంతో వాయిదా వేశారని విమర్శించారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెబుతుందో ఎస్ఈసీ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా ఎప్పటికీ అధికారం చేజిక్కించుకోలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత తెదేపా ఎక్కడ కనిపించదని ఎద్దేవా చేశారు.
పెద్దిరెడ్డికి ఎందుకు భయం: అచ్చెన్నాయుడు
‘‘స్వేచ్ఛాయుత ఎన్నికలంటే మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకు భయం?స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికలు జరిగితే వైకాపాకి ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతో ఉన్నారు. ప్రజాబలం వైకాపాకు ఉంటే ఎస్ఈసీకి ఎందుకు భయపడుతున్నారు?ఎస్ఈసీకి ఉద్యోగులు సహకరించకూడదంటూ పెద్దిరెడ్డి చెప్పడం రాజ్యాంగ విరుద్ధం. కరోనా వ్యాక్సిన్ కుంటిసాకు మాత్రమే. స్వేచ్ఛాయుత ఎన్నికలంటే వైకాపాకు జ్వరం వచ్చినట్టుగా ఉంది’’ అని తెలిపారు.
రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు: అంబటి
‘‘ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయినప్పటికీ లెక్కచేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పంథాలో ముందుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు. 2018 నుంచి ఎన్నికలు నిర్వహించలేకపోయిన ఎస్ఈసీ మూడు నెలల్లోనే నిర్వహించాలని పట్టుదలతో వ్యవహరించడం సరికాదు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోన్న సమయంలో ఎన్నికలు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తూ వద్దంటున్నాం. వాక్సినేషన్ పూర్తైన వెంటనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం కోరుతున్నా ఎస్ఈసీ వినడం లేదు’’ అని అంబటి వ్యాఖ్యానించారు.
ప్రాణాలు పోతే ఎవరి బాధ్యత: తమ్మినేని సీతారాం
‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం సరైంది కాదు. ఎన్నికల్లో కరోనా సోకి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు. ఎవరికోసం ఎస్ఈసీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రకృతి విపత్తులను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. దీనిపై అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి’’ అని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.
భయపడే ప్రసక్తే లేదు: ఎంపీ రామ్మోహన్నాయుడు
‘‘పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సీఎం జగన్మోహన్రెడ్డికి చెంపపెట్టు లాంటిది. సీఎం జగన్ ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకతతోనే ఎన్నికలంటే వైకాపా భయపడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా సత్తా చాటుతుంది. భయపడే ప్రసక్తే లేదు. క్షేత్రస్థాయిలో తెదేపా బలం ఏ మేరకు ఉందో తెలిపేందుకు ఈ ఎన్నికలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటాం’’ అని ఎంపీ పేర్కొన్నారు.
రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తోంది: పట్టాభి
‘‘ప్రభుత్వం అకారణంగా రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తోంది. రాజ్యాంగ ప్రక్రియను జగన్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎస్ఈసీపై ఎదురుదాడి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు పాటించకపోవడం కోర్టు ధిక్కరణే అవుతుంది. ఇంటిపట్టాల పంపిణీలో ఉద్యోగ సంఘాలకు వ్యాక్సిన్ గుర్తుకు రాలేదా? ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి ఎవరిని చంపుతారు?చంపుతామని బెదిరిస్తున్న వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్‌కు బానిసలుగా మారి ఎవరిని బెదిరిస్తున్నారు?’’ అని పట్టాభి నిలదీశారు.
ఇవీ చదవండి..
మీ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల