Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176522
            [news_title_telugu_html] => 

చిదంబరం మెడపై అరెస్టు కత్తి!

[news_title_telugu] => చిదంబరం మెడపై అరెస్టు కత్తి! [news_title_english] => [news_short_description] => కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి మంగళవారం న్యాయస్థానాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/HCmMHAsg0b4 [news_videoinfo] => |https://www.youtube.com/embed/HCmMHAsg0b4 [news_sections] => ,27,26, ) )
చిదంబరం మెడపై అరెస్టు కత్తి! - EENADU
close
చిదంబరం మెడపై అరెస్టు కత్తి!

‘ఐఎన్‌ఎక్స్‌’ కేసులో ముందస్తు బెయిలుకు దిల్లీ హైకోర్టు నిరాకరణ
ప్రాథమికంగా చూస్తే కుంభకోణానికి ఆయనే సూత్రధారి
కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది: న్యాయమూర్తి తీర్పు
ఆగమేఘాలపై సుప్రీంకు చిదంబరం
తక్షణ విచారణకు కోర్టు నిరాకరణ
ఆచూకీ లేని మాజీ ఆర్థిక మంత్రి

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి మంగళవారం న్యాయస్థానాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ఆయన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా ఆయనకు ఉపశమనం లభించలేదు. ఆయన పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత చూపలేదు. బుధవారం ఉదయం దీన్ని దాఖలు చేయాలని సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో చిదంబరానికి అరెస్టు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఆయన ఆచూకీ దొరకడంలేదని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఫోన్లను స్విచ్చాఫ్‌ చేసినట్లు వివరించాయి. సీబీఐతోపాటు ఈడీ కూడా ఆయన కోసం గాలిస్తున్నట్లు తెలిపాయి. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు సీబీఐ అధికారులు దిల్లీలో ఆయన నివాసానికి వచ్చారు. అక్కడ చిదంబరం లేరని తెలుసుకొని వారు వెనుతిరిగారు. అనంతరం 2 గంటల్లోగా దర్యాప్తు అధికారుల ఎదుట హాజరుకావాలని చిదంబరం ఈమెయిల్‌కు నోటీసు పంపారు.

బెయిలు పిటిషన్‌పై వాదనలను ముగించిన హైకోర్టు జనవరి 25న తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ సునీల్‌ గౌర్‌ మంగళవారం 24 పేజీల తీర్పును వెలువరించారు. సీబీఐ, ఈడీకి సంబంధించిన రెండు కేసుల్లోనూ చిదంబరం పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తీర్పు స్పష్టం చేసింది. ‘‘ప్రాథమికంగా పరిశీలిస్తే.. ఈ కుంభకోణం మొత్తానికీ పిటిషనరే (చిదంబరం) సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఆయనే ప్రధాన కుట్రదారు. దర్యాప్తునకు ఆయన సహకరించడంలేదని తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు సమర్పించిన పత్రాల తీవ్రతను పరిశీలిస్తే ఎలాంటి ముందస్తు బెయిలుకు ఆయనకు యోగ్యత లేదని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో సమర్థ దర్యాప్తు కోసం కస్టోడియల్‌ దర్యాప్తు అవసరమన్నది మా ప్రాథమిక అభిప్రాయం. ఇలాంటి కేసుల్లో బెయిలు మంజూరు చేస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది’’ అని వ్యాఖ్యానించింది. ఎంపీగా ఉండటం, న్యాయవాది కావడం వంటివి ముందస్తు బెయిలు మంజూరును సమర్థించజాలవని తెలిపింది. నగదు చలామణీ కేసుకు ఇది ప్రబల ఉదాహరణ అని వ్యాఖ్యానించింది. కేసు తీవ్రత, కోర్టు ఇచ్చిన రక్షణ చట్రంలో ఉన్నప్పుడు ఆయన దాటవేత సమాధానాలు ఇవ్వడం వంటి కారణాలతోనూ ఆయనకు ముందస్తు బెయిలును నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. ‘‘చిదంబరాన్ని ప్రాసిక్యూట్‌ చేయడం రాజకీయ ప్రేరేపితమని, కక్షసాధింపు చర్య అని వ్యాఖ్యానించడం అర్థరహితం. నేరగాళ్ల హోదాతో సంబంధం లేకుండా వారి గుట్టును రట్టు చేయాలి. ఆర్థిక నేరాలది భిన్న తరగతి. బెయిలు విషయంలో ఈ కేసులను భిన్న దృక్కోణంతో పరిశీలించాలి. ఆ నేరాలను ఉక్కు పిడికిలితో ఎదుర్కోవాలి’’ అని పేర్కొంది. ఇంత భారీ స్థాయి ఆర్థిక నేరాలను చాలా జాగ్రత్తగా ప్రణాళిక రచించి, అమలు చేస్తుంటారని వ్యాఖ్యానించింది. ఇంత పెద్ద ఆర్థిక నేరంపై సాగుతున్న విచారణలో దర్యాప్తు సంస్థ చేతులను తాము  కట్టేయజాలమని తెలిపింది. సన్నితమైన ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ నిష్ఫలంగా మారడానికి అనుమతించబోమని పేర్కొంది. అత్యున్నత స్థాయి వ్యక్తుల ప్రమేయమున్న పలు కేసుల్లో ఇలాగే జరిగిందని వ్యాఖ్యానించింది.

సుప్రీం కోర్టులో సవాల్‌ చేయడానికి వీలుగా ఈ తీర్పును మూడు రోజుల పాటు నిలుపుదలలో ఉంచాలని చిదంబరం తరఫు న్యాయవాది దయాన్‌ కృష్ణన్‌ కోరారు. దీన్ని పరిశీలించి, ఉత్తర్వులిస్తానని న్యాయమూర్తి జస్టిస్‌ గౌర్‌ స్పష్టంచేశారు. అనంతరం ఈ వినతిని కూడా తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. జస్టిస్‌ గౌర్‌ గురువారం పదవీ విరమణ పొందనున్నారు.

సుప్రీం కోర్టులో హడావుడి
హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది నిమిషాలకే చిదంబరంతో కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ భేటీ అయ్యారు. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్‌ చేయాలని నిర్ణయించారు. ఇద్దరూ కలసి సుప్రీం కోర్టులోని పలు కారిడార్ల మధ్య కొద్దిసేపు హడావుడిగా తిరిగారు. సెక్రటరీ జనరల్‌, ప్రధాన న్యాయమూర్తి సిబ్బంది సహా పలువురు అధికారులను కలిసేందుకు ప్రయత్నించారు. ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత చిదంబరం, సిబల్‌లు సంప్రదింపుల గదిలోకి వెళ్లారు. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాదులు సల్మాన్‌ ఖుర్షీద్‌, అభిషేక్‌ మను సింఘ్వీలు హడావుడిగా అక్కడికి వచ్చారు. తీవ్ర చర్చోపచర్చల తర్వాత చిదంబరం పిటిషన్‌ను బుధవారం ఉదయం 10.30 గంటలకు సంబంధిత ధర్మాసనం వద్ద దాఖలు చేయాలని కోర్టు అధికారి తనకు సూచించినట్లు సిబల్‌ తెలిపారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి బుధవారం రాజ్యాంగ ధర్మాసనంలో ఉంటారు. అందువల్ల ఆ ధర్మాసనంలో లేనివారిలో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి ఎదుట దీన్ని ప్రస్తావించాల్సి ఉంటుందని సిబల్‌ చెప్పారు. సీనియారిటీలో మూడో స్థానంలో ఉన్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం ముందుకు ఇది వచ్చే అవకాశం ఉందని తెలిపారు.


ఇదీ ఐఎన్‌ఎక్స్‌ కేసు కథ

2007లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో రూ.305 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌బీఐ) అందుకోవడానికి ‘ఐఎన్‌ఎక్స్‌ మీడియా’కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) పచ్చజెండా ఊపింది. ఈ వ్యవహారంలో నగదు అందుకున్న కంపెనీలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చిదంబరం కుమారుడు కార్తి నియంత్రణలో ఉన్నాయన్నది సీబీఐ, ఈడీల వాదన. ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ మాత్రమే ఈ ఆమోదం తెలపాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్‌ఐపీబీ ద్వారా సమ్మతి వచ్చేలా చిదంబరం చక్రం తిప్పారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ కేసులో చిదంబరాన్ని అనేకసార్లు దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. రూ.3500 కోట్ల ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందం కేసులోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ విమానయాన సంస్థలకు మార్గాలను కేటాయించడంలో అవకతవలకు పాల్పడడం ద్వారా ఎయిర్‌ ఇండియాకు నష్టం కలిగించారన్న కేసుకు సంబంధించి కూడా చిదంబరంపై ఆరోపణలున్నాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.