close
మహారాష్ట్రలో 60.46% పోలింగ్‌

హరియాణాలో 65% నమోదు

‘మహా’సంగ్రామంలో కీలక దశ ముగిసింది. కురుక్షేత్రంలోనూ ఎన్నికల రణక్షేత్రం రంజుగా సాగింది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికతో పాటు.. 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 51 శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్‌ సోమవారం ముగిసింది. 2014 శాసనసభ ఎన్నికల కంటే రెండు ప్రధాన రాష్ట్రాల్లోనూ ఈసారి పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. కడపటి వార్తలు అందేసరికి మహారాష్ట్రలో 60.46 శాతం, హరియాణాలో 65 శాతం ఓట్లు పోలయ్యాయి.

దిల్లీ, ముంబయి, చండీగఢ్‌:  రెండు ప్రధాన రాష్ట్రాల శాసనసభలకు సోమవారం జరిగిన పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్ర, హరియాణా శాసనసభలతో పాటు పలు రాష్ట్రాలలోని శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలూ సోమవారమే జరిగాయి. పట్టణ, నగర ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం బాగా తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు ఉత్సాహం చూపించారు.

 

మరాఠా సీమలో..
మహారాష్ట్రలో 60.46 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014లో 63.38 శాతం ఓట్లు పోలయ్యాయి. తాజా ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల కంటే గ్రామాల్లోనే ఎక్కువమంది ఓట్లేశారు. అత్యధికంగా కర్వీర్‌ నియోజకవర్గంలో 83.20% ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా కొలాబాలో 40.20% పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రంలో 96,661 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 3,237 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి 250కి పైగా ఫిర్యాదులు చేసింది.

హరియాణా బరిలో..
హరియాణా శాసనసభలోని 90 స్థానాలకు జరిగిన ఎన్నికలలో సాయంత్రం 6 గంటల వరకు 65 శాతం పోలింగ్‌ నమోదైంది. నుహ్‌లో ఒక హింసాత్మక ఘటన మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 76.54 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 70.36 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో 1,169 మంది అభ్యర్థులు పోటీపడగా, వారిలో 105 మంది మహిళలు.

సైకిల్‌ ఎక్కి ఓటేసిన సీఎం
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చండీగఢ్‌ నుంచి కర్నాల్‌ వరకు రైల్లో వెళ్లి, తర్వాత సైకిల్‌ తొక్కుతూ వెళ్లి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలుత జనశతాబ్ది రైల్లోను, తర్వాత ఈ-రిక్షాలోను వెళ్లిన ఆయన.. చివరగా సైకిల్‌ తొక్కుతూ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.

* థానెలో బహుజన సమాజ్‌పార్టీ నాయకుడు సునీల్‌ ఖాంబే తాను ఓటేసిన తర్వాత ఈవీఎంపై ఇంకు పోశారు. ఈవీఎం ముర్దాబాద్‌ అంటూ నినాదాలు చేశారు.

 

ముంబయిలో అత్యల్పం
దేశ ఆర్థిక, వినోద రాజధానిగా పేరొందిన ముంబయి మహానగరంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కేవలం 44.74% పోలింగ్‌ నమోదైంది. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులుండే బాంద్రా, దక్షిణ ముంబయిలోని కొలాబా నియోజకవర్గాల్లో అత్యల్ప స్థాయిలో ఓట్లు పోలయ్యాయి.

ఓటర్ల అనాసక్తి
మహారాష్ట్ర, హరియాణా శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఆసక్తిగా ముందుకొచ్చి ఓట్లేయలేదు. హరియాణాలో గత 50 ఏళ్లలోను, మహారాష్ట్రలో 39 ఏళ్లలోను ఇదే అత్యల్ప పోలింగ్‌. 1968లో అత్యల్పంగా 57.26% పోలింగ్‌ నమోదుకాగా, మహారాష్ట్రలో 1980లో 53.3% ఓట్లు పోలయ్యాయి. ఈసారి  నియోజకవర్గాల వారీగా చూస్తే.. హరియాణాలో బాద్షాపుర్‌, పానిపట్‌ సిటీ నియోజకవర్గాల్లో 45% పోలింగ్‌ నమోదైంది.

అభ్యర్థిపై కాల్పులు
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మోర్షి నియోజకవర్గం నుంచి స్వాభిమాని పక్ష అనే పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి దేవేంద్ర భుయార్‌పై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున ఆయన కారులో వెళ్తుండగా మోటారుసైకిల్‌పై వచ్చిన ముగ్గురు ముసుగువ్యక్తులు కాల్పులు జరిపి, కారును తగలబెట్టారు. భుయార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మార్పు ఖాయం
మహారాష్ట్రలో ఈసారి అధికారం మారడం ఖాయం. యువత మార్పు కోరుకున్నారు. భాజపా-శివసేన పాలనలో తమ ఆకాంక్షలు నెరవేరతాయని ప్రజలు భావించారు. కానీ వారి నమ్మకం వమ్మయింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం వెనకబడింది. ఉద్యోగాల్లేవు. ఇదంతా ప్రజల్లో అశాంతిని పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా మాకు మంచి ఆదరణ లభించింది.

-శరద్‌పవార్‌, ఎన్సీపీ అధినేత

 


 
 
 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.