close

తాజా వార్తలు

ఎన్టీఆర్‌.. నానిలతో సినిమా చేయాలని ఉంది!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్‌ కథలు అంటే టక్కున గుర్తొచ్చే అగ్ర కథానాయకుల్లో వెంకటేశ్‌ తప్పకుండా ఉంటారు. హీరోగా మాస్‌, యాక్షన్‌ సన్నివేశాలతో అదరగొట్టే ఆయన కామెడీ టైమింగ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, తనదైన నటనతో మహిళా ప్రేక్షకులను కూడా మెప్పిస్తారు. ఈ ఏడాది ఆరంభం ‘ఎఫ్‌2’తో ఘన విజయాన్ని అందుకున్న వెంకీ ఇప్పుడు చివరిలో ‘వెంకీమామ’గా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. నాగచైతన్యతో కలిసి కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ‘వెంకీమామ’ ముచ్చట్లు...

‘వెంకీ మామ’ ప్రచార పర్వంలో హడావుడి అంతా మీదే కనిపిస్తోంది కారణం?

వెంకటేశ్‌: అందుకు ప్రేక్షకులే కారణం. కొన్నిసార్లు అలా జరిగిపోతోంది. ఈ ప్రాజెక్టు నాకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది.  చైతూతో కలిసి చేయడం నిజంగా ఆనందంగా అనిపించింది. రానా, చైతూ ఇలా కుటుంబంలో ఉన్న వారితో కలిసి నటించాలన్నది నాన్నగారి కోరిక. ఆ ఆనందం ఇలా బయటకు వచ్చేస్తోందేమో.

చైతూని దగ్గర్నుంచి గమనించారు కదా? మేనమామ పోలికలు ఏమైనా వచ్చాయా?

వెంకటేశ్‌: చెప్పిన టైమ్‌కి నేను సెట్లో ఉంటాను. తను కూడా అంతే. అయితే అక్కడికొచ్చాక ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. వాడిని చూడగానే ‘వీడూ మనలైన్‌లోనే ఉన్నాడన్నమాట’ అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచీ వాడితో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అప్పట్లో చాలా ముద్దుగా ఉండేవాడు. వాడిని ఎత్తుకోవడానికి మేమంతా పోటీపడేవాళ్లం. మా ఇంట్లో ఎవ్వరం ‘సినిమాల్లోకి రావాలి’ అని ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు. నేనూ, రానా, చైతూ.. ముగ్గురం అనుకోకుండానే వచ్చాం. ‘కలియుగ పాండవులు’తో నేను నటుడిగా ప్రయత్నం చేశా. ఆ తర్వాత ఎన్ని ఫ్లాప్‌లు వచ్చిన బాధపడలేదు. ప్రేక్షకులు ఆశీర్వదించడం మా అదృష్టం.

33 ఏళ్ల సినీ జీవితంలో మీ పుట్టిన రోజున విడుదల అవుతున్న తొలి సినిమా ఇదే కదా?

వెంకటేశ్‌: అవును. నేనైతే ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోను. పుట్టిన రోజు వస్తోందంటే ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతాను. ఈసారి కూడా ఎందుకైనా మంచిదని టికెట్లు తీసి పెట్టుకున్నాను.. (నవ్వుతూ).

చైతూ పాత్ర బాగుండాలని ముందు నుంచీ గట్టిగా చెబుతూ వచ్చారట. మేనల్లుడికి ఓ విజయం అందివ్వాలని గట్టిగా అనుకున్నారా?

వెంకటేశ్‌: సినిమాలో అన్ని భావోద్వేగాలూ బలంగా ఉండాలనుకున్నాం. దాని వల్ల చైతూ పాత్ర బాగుండడమే కాకుండా, సినిమా కూడా బాగా వస్తుంది.  హిట్లూ, ఫ్లాపులూ అందరికీ ఉంటాయి. మనపని మనం చేసుకుంటూ వెళ్లడమే. చైతూ కూడా అదే చేస్తున్నాడు.

మల్టీస్టారర్‌ చిత్రాలనగానే మీరు గుర్తొస్తున్నారు? దీనిపై మీరేమంటారు

వెంకటేశ్‌: అంత లేదమ్మా.. ఒకట్రెండు సినిమాలు సరిగా ఆడకపోతే ‘వీడికి ఎక్కువైంది... ఎందుకు మల్టీస్టారర్లు. సోలో హీరోగా చేసుకోకుండా’ అని అంటారు. ఆ సంగతి నాకు తెలుసు. 

రిటైర్‌మెంట్‌ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?

వెంకటేశ్‌: నేనెప్పుడో రిటైర్‌ అయిపోదామనుకున్నా. కానీ అవ్వనివ్వడం లేదు. ‘ఫర్లేదు.. కొన్ని సినిమాలు చేయగలవు’ అనుకుంటున్నారన్నమాట.

మరో కథానాయకుడితో సినిమా చేస్తున్నప్పుడు స్క్రీన్‌ టైమ్‌ పట్టించుకుంటారా?

వెంకటేశ్‌: అలా అనుకుంటే ఆ సినిమాలు చేయలేం. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’, ‘ఎఫ్‌ 2’.. ఇవన్నీ చేస్తున్నప్పుడు ‘నా పాత్రేమిటి? నేనేం చేయాలి’ అనే ఆలోచించాను. ఈతరం హీరోలు ఎన్టీఆర్‌, నాని.. వీళ్లతో సినిమాలు చేయాలనివుంది.

వెంకటేశ్‌: ‘అసురన్‌’ రీమేక్‌ చేస్తున్నారు కదా. ఆ కథలో ఏం నచ్చింది?

వెంకటేశ్‌:  ఎమోషన్‌ బాగుంది. చూడగానే ‘ఇది మనం చేయాల్సిందే’ అనుకున్నాను. అరగంటలో.. రైట్స్‌ తీసేసుకున్నాం. ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీకాంత్‌ అడ్డాలను ఎంచుకున్నాం. తను చాలా కసిగా ఈ సినిమా చేస్తున్నాడు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.