close

తాజా వార్తలు

తొలి రోజే తేల్చేశారు

 బౌలింగ్‌, బ్యాటింగ్‌లో భారత్‌ జోరు
 150 పరుగులకే కుప్పకూలిన బంగ్లా
 టీమ్‌ఇండియా 86/1

అంచనాలు తప్పలేదు.. కోహ్లీసేనకు ఎదురే లేదు.. మనోళ్ల ధాటికి మరో జట్టు కుదేలు!

అంచనాల్ని మించి రాణిస్తున్న బౌలర్లు మరోసారి అద్భుత ప్రదర్శన చేసిన వేళ.. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది.

ప్రత్యర్థిని 150 పరుగులకే కుప్పకూల్చిన కోహ్లీసేన..  ఆపై బ్యాటింగ్‌లోనూ శుభారంభం చేసింది. ఒక వికెట్‌ మాత్రమే నష్టపోయి ప్రత్యర్థి స్కోరులో సగానికి పైగా కరిగించేసింది. ఆధిక్యంలోకి వెళ్లడానికి చేయాల్సిందిక 65 పరుగులే.

లెక్కకు మిక్కిలి ఫీల్డింగ్‌ తప్పిదాలు చోటు చేసుకున్నా.. ప్రత్యర్థిని 150కే కుప్పకూల్చారంటే మన బౌలర్ల జోరెలా సాగిందో అంచనా వేయొచ్చు. ముఖ్యంగా మ్యాచ్‌ మ్యాచ్‌కూ బౌలింగ్‌లో పదును పెంచుతున్న మహ్మద్‌ షమి పడగొట్టిన మూడు వికెట్లు వేటికవే హైలైట్‌!

తొలి రోజు ఆట సాగిన తీరు చూస్తే ఇక మ్యాచ్‌ భారత్‌ చేయి దాటి పోయే అవకాశాలు దాదాపు లేనట్లే!

ఇండోర్‌

అనుకున్నట్లే బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆధిపత్యం మొదలైంది. గురువారం ఇక్కడి హూల్కర్‌ స్టేడియంలో ఆరంభమైన తొలి టెస్టులో కోహ్లీసేన శుభారంభం చేసింది. మహ్మద్‌ షమి (3/27) మెరుపులకు మిగతా బౌలర్ల కృషి కూడా తోడవడంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 58.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (43; 105 బంతుల్లో 4×4, 1×6), కొత్త కెప్టెన్‌ మొమినుల్‌ హక్‌ (37; 80 బంతుల్లో 6×4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌.. ఆట ఆఖరుకు వికెట్‌ నష్టపోయి 86 పరుగులు చేసింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ (6) నిరాశపరిచినప్పటికీ.. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (37 బ్యాటింగ్‌; 81 బంతుల్లో 6×4)తో కలిసి చెతేశ్వర్‌ పుజారా (43 బ్యాటింగ్‌; 61 బంతుల్లో 7×4) బంగ్లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. వీళ్లిద్దరూ చూడముచ్చటైన షాట్లతో చివరి సెషన్లో అభిమానుల్ని అలరించారు. అభేద్యమైన రెండో వికెట్‌కు ఈ జోడీ 72 పరుగులు జోడించింది.   9 వికెట్లు చేతిలో ఉన్న టీమ్‌ఇండియా.. బంగ్లా స్కోరుకు 64 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగితే రెండో రోజే మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేసే అవకాశముంది.

ఉమేశ్‌ మొదలుపెడితే..: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే టాస్‌ గెలిచిన మొమినుల్‌.. పిచ్‌పై కాస్త పచ్చిక ఉన్నప్పటికీ బ్యాటింగ్‌ చేయడానికే నిర్ణయించుకున్నాడు. అయితే ఇషాంత్‌, ఉమేశ్‌ పదునైన బంతులతో ఓపెనర్లు షాద్మన్‌ ఇస్లామ్‌ (6), ఇమ్రుల్‌ కెయెస్‌ (6)లకు పరీక్ష పెట్టారు. తొలి వికెట్‌ పడింది ఆరో ఓవర్లోనే కానీ.. ఆలోపు త్రుటిలో కొన్ని అవకాశాలు చేజారాయి. బౌలర్ల జోరు, బ్యాట్స్‌మెన్‌ తడబాటు చూస్తే వికెట్‌ పడటానికి ఎంతోసేపు పట్టదనిపించింది. తన మూడో ఓవర్లో ఉమేశ్‌ (2/47).. కెయెస్‌ను ఔట్‌ చేసి భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. మూడో స్లిప్‌లో రహానె చక్కటి క్యాచ్‌తో కెయెస్‌ను వెనక్కి పంపాడు. ఆ తర్వాతి ఓవర్లోనే షాద్మన్‌ను ఇషాంత్‌ (2/20) వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో ఔట్‌ చేశాడు. చేంజ్‌ బౌలర్‌గా వచ్చిన షమి.. మిథున్‌ (13)ను ఔట్‌ చేయడంతో బంగ్లా  31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ మొమినుల్‌, ముష్ఫికర్‌ రహీమ్‌ల భాగస్వామ్యం (68) బంగ్లా కోలుకునేలా చేసింది. పదే పదే క్యాచ్‌లు చేజారడం వల్ల వీళ్లిద్దరూ బతికిపోయారు కానీ.. లేదంటే తొలి సెషన్లోనే బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడేదే. లంచ్‌ విరామానికి 63/3తో ఉన్న ఆ జట్టు తర్వాత 99/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే దురదృష్టం కొద్దీ తన తొలి 13 ఓవర్లలో వికెట్లు చేజిక్కించుకోలేకపోయిన అశ్విన్‌  (2/43).. ఒక అద్భుత బంతితో మొమినుల్‌ను ఔట్‌ చేసి వికెట్ల పతనానికి మళ్లీ గేట్లెత్తాడు. అశ్విన్‌ క్యారమ్‌ బంతిని తప్పుగా అంచనా వేసి మొమినుల్‌ ఆడకుండా బ్యాట్‌ పైకెత్తేశాడు. కానీ లోపలికి టర్న్‌ అయిన బంతి స్టంప్‌లను ముద్దాడింది. ఆపై మహ్మదుల్లా సైతం అశ్విన్‌ బౌలింగ్‌లోనే బోల్తా కొట్టి బౌల్డయ్యాడు. బంగ్లా 115/5కు చేరుకుంది.

5 ఓవర్లలోపే 5 వికెట్లు: బంగ్లా తొలి 5 వికెట్లను 45 ఓవర్ల వ్యవధిలో కోల్పోతే.. చివరి 5 వికెట్లను 5 ఓవర్లలోపే చేజార్చుకుంది. టీ విరామానికి ముంగిట చెలరేగిపోయిన షమి వరుస బంతుల్లో ముష్ఫికర్‌, మెహదీ హసన్‌ (0)లను ఔట్‌ చేయడంతో బంగ్లా 140/7తో సెషన్‌ను ముగించింది. విరామం తర్వాత తొలి బంతికే లిటన్‌ దాస్‌ (21) ఔటైపోయాడు. మిగతా రెండు వికెట్లు పడటానికి ఎంతో సమయం పట్టలేదు.

ఫటా ఫట్‌
కోహ్లి కోరుకున్నదే..

టాస్‌ గెలిచి బంగ్లా కెప్టెన్‌ మొమినుల్‌ బ్యాటింగ్‌ తీసుకున్నాడు. పిచ్‌ గట్టిగా ఉండటమే అందుక్కారణమన్నాడు. ఐతే కాస్త పచ్చిక ఉన్నందున టాస్‌ గెలిచివుంటే తాను బౌలింగ్‌ తీసుకునేవాడినని చెప్పాడు కోహ్లి.

తొలి సెషన్‌ 

బంగ్లాదేశ్‌: 26 ఓవర్లు 
63 పరుగులు 3 వికెట్లు
* బ్యాటింగ్‌ ఎందుకు ఎంచుకున్నామా అని బంగ్లా చింతించేలా చేశారు భారత పేసర్లు. స్వింగ్‌, లెంగ్త్‌ బౌలింగ్‌తో వణికించిన షమి, ఇషాంత్‌, ఉమేశ్‌  లంచ్‌ లోపే బంగ్లాను కష్టాల్లోకి నెట్టారు.

రెండో సెషన్‌ 

బంగ్లాదేశ్‌: 28 ఓవర్లు 
77 పరుగులు 4 వికెట్లు
* పేసర్లకు పోటీగా  అశ్విన్‌ స్పిన్‌ ఉచ్చు బిగించాడు.  పైగా షమి నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోవడంతో బంగ్లాకు కోలుకునే అవకాశమే దక్కలేదు.

మూడో సెషన్‌

బంగ్లాదేశ్‌: 4.3 ఓవర్లు 
10 పరుగులు 3 వికెట్లు

భారత్‌: 26 ఓవర్లు 
86 పరుగులు 1 వికెట్‌
* బంగ్లా ఇన్నింగ్స్‌ త్వరగానే ముగిసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్‌ త్వరగా నిష్క్రమించడం ఒక్కటే భారత్‌కు నిరాశ. 

251

స్వదేశంలో అశ్విన్‌ పడగొట్టిన వికెట్లు. 42 టెస్టుల్లో అతడు ఈ ఘనత సాధించాడు. మొత్తంమీద ఇప్పటివరకు 69 టెస్టుల్లో 359 వికెట్లు తీశాడు.
కట్టుదిట్టమైన లైన్‌లో బంతి విసరాలన్న లక్ష్యంతో బౌలింగ్‌ చేశాను.. విజయవంతమయ్యాను. వరుస బంతుల్లో వికెట్లు తీశాక టీ విరామానికి వెళ్లాం. అదే జోరులో బౌలింగ్‌ చేసివుంటే హ్యాట్రిక్‌ లభించేదేమో..
- మహ్మద్‌ షమి

ఆ హ్యాట్రిక్‌.. జట్టు ఖాతాలో

బంగ్లా ఇన్నింగ్స్‌ 54వ ఓవర్‌ చివరి రెండు బంతులకు మహ్మద్‌ షమి వరుసగా ముష్ఫికర్‌, మెహిదీ హసన్‌లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ ముంగిట నిలిచాడు. తర్వాతి ఓవర్‌ తొలి బంతికి ఇషాంత్‌.. లిటన్‌ దాస్‌ను ఔట్‌ చేసి జట్టు ఖాతాలో హ్యాట్రిక్‌ జమ చేశాడు. అయితే తర్వాతి ఓవర్‌ వేయడానికి వచ్చిన షమి వ్యక్తిగత హ్యాట్రిక్‌ నమోదు చేస్తాడేమో అని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ తైజుల్‌ అతడి బంతిని సమర్థంగా అడ్డుకుని హ్యాట్రిక్‌కు అడ్డు పడ్డాడు.

బంతులా బుల్లెట్లా!

తొలి రోజు ఆటలో హైలైట్‌ మహ్మద్‌ షమి బౌలింగే. గత ఏడాది నుంచి చాలా కసిగా బౌలింగ్‌ చేస్తూ మ్యాచ్‌ మ్యాచ్‌కూ పదును పెంచుతున్న షమి.. మరోసారి మెరుపు బౌలింగ్‌లో అబ్బురపరిచాడు. బుల్లెట్ల లాంటి బంతులతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను అతను బెంబేలెత్తించాడు. ముఖ్యంగా వందకు పైగా బంతులాడి, క్రీజులో బాగా కుదురుకుని చక్కటి షాట్లు ఆడుతున్న బంగ్లా టాప్‌స్కోరర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (43)ను షమి బౌల్డ్‌ చేసిన వైనం అద్భుతమే. ఆఫ్‌ స్టంప్‌ ఆవల పడి లోపలికి అనూహ్యంగా స్వింగ్‌ అయిన బంతికి ముష్ఫికర్‌ వద్ద సమాధానమే లేకపోయింది. అతను డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేసినా.. బంతి చిక్కకుండా లోపలికి వచ్చి ఆఫ్‌ స్టంప్‌ను లేపేసింది. బ్యాట్స్‌మన్‌ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఆ వెంటనే మెహిదీ హసన్‌, అంతకుముందు తొలి సెషన్లో మహ్మద్‌ మిథున్‌.. షమి మెరుపు వేగం, కచ్చితత్వంతో విసిరిన బంతులకు వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయారు. ఈ రెండు బంతులు ప్యాడ్లకు తాకడం ఆలస్యం అంపైర్‌ వేలెత్తేయడం విశేషం. పేసర్లకు అంతగా సహకారం అందించని భారత పిచ్‌లపై షమి చెలరేగుతున్న తీరు మాజీ ఆటగాళ్లు, వ్యాఖ్యాతల్ని ఆశ్చర్యపరుస్తుండటం గమనార్హం.

రహానె ఒక్కడే మూడు..

బంగ్లాను 150 పరుగులకే ఆలౌట్‌ చేయడం మంచి విషయమే కానీ.. భారత ఫీల్డింగ్‌ స్థాయికి తగ్గట్లు సాగి ఉంటే ఆ జట్టు 100 పరుగులైనే చేసేది కాదు. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఏకంగా అయిదు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. అందులో మూడు మంచి ఫీల్డర్‌ అయిన రహానేనే జారవిడిచాడు. స్లిప్‌లో ముష్ఫికర్‌ క్యాచ్‌లు రెండు, మహ్మదుల్లా క్యాచ్‌ ఒకటి అతను జారవిడిచాడు. ఈ మూడూ అశ్విన్‌ బౌలింగ్‌లోనే నేలపాలయ్యాయి. అవి కాస్త కష్టమైన క్యాచ్‌లే అయినా.. మామూలుగా ఇలాంటివి రహానె తేలిగ్గానే పట్టేస్తాడు. కోహ్లి, సాహా సైతం ఒక్కో క్యాచ్‌ వదిలేశారు. ఇన్నింగ్స్‌ టాప్‌స్కోరర్‌ ముష్ఫికర్‌ మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. మొమినుల్‌, మహ్మదుల్లాలకూ ఒక్కోసారి      జీవనదానం లభించింది.
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: షాద్మన్‌ ఇస్లామ్‌ (సి) సాహా (బి) ఇషాంత్‌ 6; ఇమ్రుల్‌ కెయెస్‌ (సి) రహానె (బి) ఉమేశ్‌ 6; మొమినుల్‌ హక్‌ (బి) అశ్విన్‌ 37; మిథున్‌ ఎల్బీ (బి) షమి 13; ముష్ఫికర్‌ (బి) షమి 43; మహ్మదుల్లా (బి) అశ్విన్‌ 10; లిటన్‌ దాస్‌ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 21; మెహిదీ హసన్‌ ఎల్బీ (బి) షమి 0; తైజుల్‌ ఇస్లామ్‌ రనౌట్‌ 1; అబు జాయెద్‌ నాటౌట్‌ 7; ఇబాదత్‌ హుస్సేన్‌ (బి) ఉమేశ్‌ 2; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (58.3 ఓవర్లలో ఆలౌట్‌) 150; వికెట్ల పతనం: 1-12, 2-12, 3-31, 4-99, 5-115, 6-140, 7-140, 8-140, 9-148

బౌలింగ్‌: ఇషాంత్‌ 12-6-20-2; ఉమేశ్‌ 14.3-3-47-2; షమి 13-5-27-3; అశ్విన్‌ 16-1-43-2; జడేజా 3-0-10-0

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ బ్యాటింగ్‌ 37; రోహిత్‌ (సి) లిటన్‌ (బి) జాయెద్‌ 6; పుజారా బ్యాటింగ్‌ 43; ఎక్స్‌ట్రాలు 0 మొత్తం: (26 ఓవర్లలో  వికెట్‌ నష్టానికి) 86; వికెట్ల పతనం: 1-14; బౌలింగ్‌: ఇబాదత్‌ హుస్సేన్‌ 11-2-32-0; అబు జాయెద్‌ 8-0-21-1; తైజుల్‌ ఇస్లామ్‌ 7-0-33-0

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.