close

తాజా వార్తలు

చల్లారని దిల్లీ

38కి పెరిగిన మృతుల సంఖ్య
కొనసాగిన ఆస్తుల విధ్వంసం
  సోనియా నేతృత్వంలో రాష్ట్రపతికి కాంగ్రెస్‌ ఫిర్యాదు
  ఆప్‌ కౌన్సిలర్‌పై ఎఫ్‌ఐఆర్‌... సస్పెన్షన్‌ వేటు వేసిన పార్టీ
  అంతర్గత భద్రత విషయంలో రాజకీయాలొద్దు: కేజ్రీవాల్‌
  అల్లర్లపై దర్యాప్తు కోసం 2 సిట్‌లు

దిల్లీ: ఈశాన్య దిల్లీ జిల్లాలో అల్లర్ల తీవ్రత గురువారం నాటికి కాస్త తగ్గినా పూర్తిగా మాత్రం చల్లారలేదు. ఆస్తుల విధ్వంసం కొనసాగింది. మసిబారిన గోడలు, కాలిపోతున్న వాహనాలు, గాజుపెంకులు, చెల్లాచెదురుగా పడి ఉన్న రాళ్లు పలుచోట్ల కనిపించాయి. దుకాణాలు మూతపడ్డాయి. అత్యవసర పనులుంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. 11 మంది బాధితులు ఒక్కరోజు వ్యవధిలో కన్నుమూయడంతో మృతుల సంఖ్య 38కి చేరింది. జోహ్రి ఎన్‌క్లేవ్‌ వద్ద మురుగునీటి కాలువలో ఒక మృతదేహం లభ్యమయింది.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేత రాజీనామా చేయించాలని, రాజధర్మం నిర్వర్తించాలని కోరారు. అల్లర్లపై నేర పరిశోధన విభాగం ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్‌లను) దిల్లీ పోలీసులు ఏర్పాటు చేసి, కేసుల్ని వాటికి బదిలీ చేశారు. హింసాత్మక ఘటనలపై 48 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా దిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఈశాన్య దిల్లీ జిల్లాలో 36 గంటల్లో ఎలాంటి ప్రధాన ఘటన చోటు చేసుకోలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రశ్నించే నిమిత్తం 514 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలిపింది. గురువారం రాత్రి అమిత్‌షా సీనియర్‌ అధికారులతో సమీక్షించారు. పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, శుక్రవారం 10 గంటల పాటు నిషేధాజ్ఞల్ని సడలించనున్నామని హోంశాఖ వెల్లడించింది.

పారామిలిటరీ బలగాల రక్తదానం
హింసాత్మక ఘటనల్లో గాయపడినవారిలో ఎక్కువ మందిని చేర్చిన జీటీబీ ఆస్పత్రిలోనే గురువారం ఐదుగురు చనిపోయారు. వారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు కుటుంబీకులు శవాగారం వద్ద కన్నీళ్లతో పడిగాపులు కాశారు. క్షతగాత్రుల కోసం 34 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఈ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఎయిమ్స్‌ నిర్వహించిన శిబిరంలో దాదాపు 1300 మంది పారామిలిటరీ సిబ్బంది రక్తదానం చేశారు. ధ్వంసమైన తమ ఇళ్లు, దుకాణాల నుంచి వస్తువుల్ని స్థానికులు వెతుక్కుంటున్న దృశ్యాలు పలు ప్రాంతాల్లో కనిపించాయి.

అల్లర్లలో ఆప్‌ వాళ్లుంటే రెట్టింపు శిక్ష వేయండి: దిల్లీ సీఎం
ఈనాడు, దిల్లీ: అల్లర్ల వెనుక ఏ పార్టీవారున్నా కఠినంగా శిక్షించాల్సిందేనని, ఒకవేళ వారు ఆప్‌ వాళ్లయితే రెట్టింపు శిక్ష వేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఐబీ అధికారి అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై కనిపించడం వెనుక ఆప్‌ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఆయన ఈ మేరకు స్పందించారు. దేశ అంతర్గత భద్రతను రాజకీయం చేయడం మానుకోవాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. దిల్లీ అల్లర్లపై ఆయన సమీక్షించారు. గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఖర్చులన్నీ పూర్తిగా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అల్లర్లలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. మైనర్లకు, శాశ్వతంగా వికలాంగులైనవారికి, ఇల్లు పూర్తిగా దగ్ధమైన వారికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఆస్తి నష్టానికీ పరిహారం అందిస్తామని, చిరు వ్యాపారులకు, విద్యార్థులకు కావాల్సినవి సమకూరుస్తామని తెలిపారు.

హుస్సేన్‌పై హత్యానేరం కింద కేసు
తన కుమారుడి మరణానికి ఆప్‌ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేనే కారణమని ఐబీ అధికారి తండ్రి ఫిర్యాదు చేయడంతో హత్యానేరం కింద హుస్సేన్‌పై పోలీసు కేసు నమోదయింది. తన ప్రమేయం ఏమాత్రం లేదని, నిష్పాక్షిక విచారణ జరిపి దోషులపై చర్య తీసుకోవాలని తాహిర్‌ డిమాండ్‌ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు హుస్సేన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆప్‌ ప్రకటించింది.

నా ఫిర్యాదుకే దిక్కు లేదు: నరేశ్‌ గుజ్రాల్‌
బాధితులను రక్షించాలంటూ ఓ ఎంపీగా తాను చేసిన ఫిర్యాదుకే దిక్కు లేదని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ నరేశ్‌ గుజ్రాల్‌ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర హోంమంత్రికి, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఆయన లేఖలు రాశారు. ‘‘బుధవారం రాత్రి 11.30కి నాకు ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. ఓ ఇంట్లో 15 మంది చిక్కుకుపోయారని, అల్లరిమూకలు లోపలికి చొరబడే ప్రయత్నం చేస్తున్నాయనేది దాని సారాంశం. వెంటనే కంట్రోల్‌రూంకి ఫోన్‌చేశాను. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇరుగుపొరుగు కుటుంబాలు ఆదుకోవడంతో బాధితులు బయటపడ్డారు’’ అని దానిలో వివరించారు. 


అమిత్‌షా రాజీనామా కోరండి
రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం
ఈనాడు - దిల్లీ

హస్తినలో హింసను నివారించడంలో హోంమంత్రి అమిత్‌షా విఫలమయ్యారని, ఆయనతో రాజీనామా చేయించాలంటూ... కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలోని నేతల బృందం రాష్ట్రపతి కోవింద్‌ను కోరింది. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించింది. దిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు గురువారం రాష్ట్రపతిని కలిశారు. ‘‘రాష్ట్రపతిగా మీకు భారత రాజ్యాంగం అత్యున్నతస్థాయి బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వంలో ఉన్న వారికి రాజ్యాంగ బాధ్యతలు, రాజధర్మ మూల సూత్రాలను గుర్తు చేయండి. వాటికి ఏ ప్రభుత్వమైనా కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. మీకు ఉన్న రాజ్యాంగపరమైన అధికారాలను ఉపయోగించి ఈ దేశ ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తులను భద్రంగా కాపాడాలి. అందువల్ల విధి నిర్వహణలో ఘోరంగా విఫలమై, పరిస్థితులను అదుపు చేయలేకపోయిన హోంమంత్రి అమిత్‌షాకి తక్షణం ఉద్వాసన పలకండి’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరారు. అనంతరం సోనియాగాంధీ విలేకర్లతో మాట్లాడారు. పరిస్థితులను నియంత్రించడంలో కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

ఈశాన్య దిల్లీలో జరుగుతున్న అల్లర్ల నియంత్రణకు వేగంగా చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ దిల్లీ ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని ఆరోపించారు. విధ్వంసకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ ఆస్తులను లూటీ చేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాయని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రి చేతకానితనం వల్ల జరిగిన హింసలో 38మంది బలయ్యారని, మరో 200మంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. అల్లర్లలో ఆస్తులను, ఆప్తులను కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని తాము రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రపతి నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. నిఘా వర్గాల వైఫల్యాలను ఎత్తిచూపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ నాలుగురోజులుగా దేశ రాజధానిలో ఏం జరుగుతోందో వివరించడానికే తాము రాష్ట్రపతిని కలిసినట్లు చెప్పారు. ఇది జాతికి తలవంపులు తెచ్చే ఘటన అని ఆరోపించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.