close

తాజా వార్తలు

మండ్య.. సినీపోరులో విజేత ఎవరు?

పోటాపోటీగా సుమలత, నిఖిల్‌ ప్రచారం

 

బెంగళూరు : వారసత్వం, సానుభూతి.. దేశ రాజకీయాల్లో చాలాకాలంగా భాగమైపోయిన విషయాలు. అనేక ఎన్నికల్లో ఫలితాన్ని నిర్ణయించే కీలకాంశాలు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతోంది. ఇందుకు కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గం వేదికైంది. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్‌ 20 చోట్ల, జేడీఎస్‌ 8 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇందులో మండ్య స్థానం జేడీఎస్‌కు దక్కినా రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌కు తిరుగుబాటు అభ్యర్థిగా సినీనటి సుమలత బరిలోకి దిగడమే అందుకు కారణం.

ఈ లోక్‌సభ ఎన్నికల ద్వారా దేవెగౌడ కుటుంబంలో మూడోతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడను రంగంలోకి దింపాలని నిర్ణయించింది జేడీఎస్‌. నిఖిల్‌ రాజకీయ ప్రస్థానం ఆరంభంలోనే అదరగొట్టాలన్న ఉద్దేశంతో తమ పార్టీకి కంచుకోటలాంటి మండ్య నియోజకవర్గాన్ని ఎంచుకుంది. అక్కడ దేవెగౌడకు చెందిన వొక్కలిగ సామాజిక వర్గానిదే మెజారిటీ. నిఖిల్‌ విజయానికి తిరుగులేని చోటు అదేనన్నది జేడీఎస్‌ ఆలోచన. అందుకే నిఖిల్‌కు ఆ స్థానం వదిలిపెట్టేలా మిత్రపక్షం కాంగ్రెస్‌ను ఒప్పించింది.

అయితే, నటుడు అంబరీష్‌ భార్య ప్రముఖ నటి సుమలత రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మండ్య నుంచి గతంలో మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు అంబరీష్‌. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. గతేడాది చివర్లో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అంబరీష్‌ భార్య సుమలత మండ్య నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించి కన్నడ రాజకీయాల్లో సునామీ సృష్టించారు. కాంగ్రెస్‌ మాత్రం టికెట్‌ నిరాకరించింది. పొత్తుధర్మంలో భాగంగా ఆ స్థానం జేడీఎస్‌దేనని తేల్చిచెప్పింది. అయితే, సుమలత మాత్రం వెనక్కి తగ్గలేదు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. నియోజకవర్గంలోని మాలవల్లి ప్రాంతంలో ఇటీవల ప్రచారం నిర్వహించారు. అంబరీష్‌ అభిమానులు 4వేల మంది బైక్‌ ర్యాలీ చేశారు. పోటీగా మరుసటి రోజు ఇదే ప్రాంతంలో నిఖిల్‌గౌడ ప్రచారం చేశారు. నిఖిల్‌, సుమలత వర్గాల మధ్య ఇప్పుడు తీవ్రస్థాయిలో మాటలయుద్ధం సాగుతోంది. అది సామాజిక మాధ్యమాలకూ విస్తరించింది. పరస్పర వ్యతిరేక ప్రచారాలతో ఇరువర్గాలు నెట్టిల్లును హోరెత్తిస్తున్నాయి. అంబరీష్‌ వర్గీయులు కుమారస్వామి వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. ‘నిఖిల్‌ గో బ్యాక్‌’ అంటూ పోస్టర్లు పెడుతున్నారు. నిఖిల్‌ వర్గీయులు ‘మన జిల్లా, మన మండ్య’ అంటూ స్థానిక సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారు.

అంబరీష్‌ అభిమానులతోపాటు కర్ణాటక సినీ పరిశ్రమ ప్రముఖులు దర్శన్‌, సుదీప్‌, చరణ్‌రాజు సుమలతకు మద్దతు ప్రకటించారు. సుమలత తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు చరణ్‌రాజు. కుమారస్వామి సోదరుడు, కర్ణాటక మంత్రి హెచ్‌డీ రేవణ్ణ గౌడ సుమలతపై విమర్శలు చేసి చిక్కుల్లో పడ్డారు. అంబరీష్‌ మరణించిన నెల రోజులైనా కాకముందే ఆమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రత్యర్థులతోపాటు కొందరు సొంత పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు పోటీ నుంచి తప్పుకునేలా సుమలతను ఒప్పించేందుకు కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అవసరమైతే మరో నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది. సుమలత మాత్రం ఈనెల 18న తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి ఉత్కంఠ కొనసాగిస్తున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.