Bharat bandh: నేడు భారత్‌ బంద్‌

ప్రధానాంశాలు

Bharat bandh: నేడు భారత్‌ బంద్‌

రైతు సంఘాలకు విపక్షాల మద్దతు
దిల్లీలో బందోబస్తు ముమ్మరం

దిల్లీ, ఈనాడు- హైదరాబాద్‌: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం ‘భారత్‌ బంద్‌’ పాటించాలని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన పిలుపునకు కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు మద్దతు ప్రకటించాయి. రైతులతో కలిసి ఇందులో పాల్గొంటామని కాంగ్రెస్‌, ఆప్‌, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు, బీఎస్పీ, తెజస, తెదేపా తదితర పార్టీలు తెలిపాయి. ఇప్పటివరకు 11 విడతలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. బంద్‌ పిలుపు నేపథ్యంలో దిల్లీలో ఇండియా గేట్‌, విజయ్‌చౌక్‌ సహా ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిరసన శిబిరాల నుంచి దేశ రాజధానిలోకి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ పాటిస్తామని, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని ఎస్‌కేఎం తెలిపింది. 10 నెలలుగా ఉద్యమిస్తున్న తాము అవసరమైతే పదేళ్ల పాటు దాన్ని కొనసాగించడానికి సిద్ధమేనని, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమలు కానిచ్చేది లేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ ఆదివారం స్పష్టంచేశారు. డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామన్నారు.

రాష్ట్రంలో పాల్గొననున్న ముఖ్య నాయకులు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వరంగల్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న ఉప్పల్‌ బస్‌ డిపో వద్ద, తెజస అధ్యక్షుడు కోదండరాం హయత్‌నగర్‌ వద్ద, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ శంషాబాద్‌ వద్ద, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హయత్‌నగర్‌ బస్టాండ్‌ వద్ద బంద్‌లో పాల్గొంటారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గాంధీభవన్‌ నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండ్లపై వెళ్లనున్నారు. భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని రేవంత్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు కోఠి మహిళా కళాశాల నుంచి వైఎంసీఏ చౌరస్తా వరకూ ప్రదర్శన జరుగుతుందని సీపీఎం ప్రకటించింది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా.మిరియాల రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. భారత్‌ బంద్‌ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీలు, కమిషనర్లకు ఉన్నతాధికారులు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని