icon icon icon
icon icon icon

చెల్లెళ్ల కంటే భార్య బంధువులే ఎక్కువయ్యారా జగనన్నా

‘జగనన్నా.. నీకు చెల్లెళ్ల కంటే భార్య తరఫు బంధువులు ఎక్కువయ్యారా.. వివేకా కంటే అవినాష్‌రెడ్డి ఎక్కువా? అంతలా అవినాష్‌ను కాపాడటానికి కారణమేంటి?’ అని కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిల ప్రశ్నించారు.

Updated : 10 May 2024 08:56 IST

ప్రజలు న్యాయం వైపే నిలవాలి
కాంగ్రెస్‌ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల

వేంపల్లె, వేముల, న్యూస్‌టుడే: ‘జగనన్నా.. నీకు చెల్లెళ్ల కంటే భార్య తరఫు బంధువులు ఎక్కువయ్యారా.. వివేకా కంటే అవినాష్‌రెడ్డి ఎక్కువా? అంతలా అవినాష్‌ను కాపాడటానికి కారణమేంటి?’ అని కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిల ప్రశ్నించారు. గురువారం ఆమె వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె, వేముల, లింగాల మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. పులివెందుల రోడ్‌షోలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వివేకా కుమార్తె సునీతతో కలిసి పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో న్యాయం కోసం చెల్లెలు ఒకవైపు, జగన్‌ భార్య, బంధువులు మరోవైపు ఉన్నారు. వివేకాకు కుమారులు లేరని జగన్‌ను కుమారుడిలా చూసుకున్నారు. కానీ బాబాయ్‌ని చంపిన నిందితులనే జగన్‌ కాపాడుతున్నారు. అవినాష్‌ నిర్దోషి అని జగన్‌ నమ్ముతున్నారట. ఆయన నమ్మితే ప్రపంచమంతా నమ్మాలా? పులివెందుల ప్రజలు ఓటుతో పాటు తమ ప్రేమను కురుపిస్తారని నమ్ముతున్నాను. ఒకప్పుడు నేను అన్న కోసం ఇల్లు, వాకిలి వదిలిపెట్టి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. కడప ఎన్నికల్లో వైఎస్సార్‌ బిడ్డ ఒక వైపు, వివేకా హత్య కేసు నిందితుడు మరోవైపు పోటీ పడుతున్నారు. వివేకా హత్యకేసులో ప్రజాకోర్టులో న్యాయం కోసం కొంగుచాచి అడుగుతున్నా. ఈ కేసులో ఎంపీని కాపాడడమే కాకుండా, ఆయనకే టికెట్ ఇచ్చారు’’ అని మండిపడ్డారు.

పులివెందుల ఆడబిడ్డలకు న్యాయం చేయండి

షర్మిల, సునీత పులివెందుల ఆడబిడ్డలని, వారికి న్యాయం చేయాలని మాజీమంత్రి వివేకా భార్య సౌభాగ్యమ్మ కోరారు. ‘ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం అడుగుతున్నారు. న్యాయం చేయడానికి ఇప్పుడు సమయం వచ్చింది. ప్రజలందరూ షర్మిలమ్మకు ఓటువేసి ఆమె కొంగు నింపాలి. ఓట్ల ద్వారా షర్మిలమ్మ కొంగు నింపితే గెలిచి మన సమస్యలపై దిల్లీ వేదికగా పోరాటం చేస్తుంది. షర్మిలను ఎంపీగా చూడాలన్నది వివేకా కోరిక. పార్టీలకతీతంగా షర్మిలను గెలిపించి రాజన్న పాలనను చూడవచ్చు’ అని ఆమె తెలిపారు.

న్యాయం కోసమే పోరాటం

సునీత మాట్లాడుతూ.. ‘వివేకా హత్య విషయంలో న్యాయం కోసం పోరాడుతున్నాను. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం కావొచ్చు. కానీ ప్రజాతీర్పు చాలా పెద్దది. ప్రజాతీర్పు కోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారు. అవినాష్‌రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదు. ఆయన రేపో, మాపో జైలుకు వెళతారు. ఇలాంటివారికి ఓటు వేయడం అవసరమా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీ మీడియా సెల్‌ రాష్ట్ర ఛైర్మన్‌ తులసిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి ధ్రువకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img