close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% కోటా

రాష్ట్రంలో అమలుకు నిర్ణయం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

ప్రస్తుత రిజర్వేషన్లు యథాతథం

మొత్తం 60 శాతానికి చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి (ఈడబ్ల్యూఎస్‌) పది శాతం రిజర్వేషన్ల కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో వెల్లడించారు. రెండుమూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్నవర్గాలకు వాటిని యథాతథంగా కొనసాగిస్తూనే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం కోటా అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యుఎస్‌తో కలుపుకొని అవి 60 శాతం అవుతాయి’’ అని సీఎం స్పష్టం చేశారు.

2019 నుంచే కేంద్రం అమలు
కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా తమ పరిధిలోని శాఖలు, సంస్థల్లోని విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాను 2019 ఫిబ్రవరి నుంచి అమల్లోకి తెచ్చింది. రాష్ట్రాల పరిధిలో వీటి అమలు అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే దీనిని ఆచరణలో పెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం మొదట్లో ఈ కోటాకు అంగీకరించలేదు. 2017 ఏప్రిల్లో తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానించి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. పదేపదే కోరినా కేంద్రం ఆమోదం తెలపలేదు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ కోటా ప్రవేశపెట్టింది. తెలంగాణలో ముస్లింలు, ఎస్టీలకు కోటా పెంచకుండా కేంద్రం తెచ్చిన ఆ కోటాను అమలు చేయడం సమస్యాత్మకంగా మారుతుందనే భావనతో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం దాని అమలుకు నిరాకరించింది. తాజాగా వివిధ వర్గాల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న వినతుల మేరకు సీఎం ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ముస్లిం, ఎస్టీ కోటా రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ఇవీ రిజర్వేషన్లు
రాష్ట్రంలో ప్రస్తుతం విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విధానం అమల్లో ఉంది.
* బీసీలకు 29 (గ్రూపు ఎ - 07%; బి - 10%; సి - 01%; డి - 07%; ఇ (ముస్లింలు) - 04%)
* ఎస్సీలకు 15 శాతం
* ఎస్టీలకు 6 శాతం

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు ఎవరు అర్హులు
కేంద్ర నిబంధనల మేరకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు పొందాలంటే సదరు అభ్యర్థి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించరాదు. 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండొచ్చు. నివాస ప్రాంతం 1000 చదరపు అడుగుల కంటే తక్కువగానే ఉండాలి. నోటిఫైడ్‌ పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో నివాస స్థలం 100 చదరపు గజాల కంటే తక్కువగా ఉండాలి. ఇతర ప్రాంతాల్లో నివాస స్థలం 200 చదరపు గజాలకు మించకూడదనేది కేంద్రం సూచించిన నిబంధనలు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుకు ప్రభుత్వం విడిగా మార్గదర్శకాలు జారీచేసే అవకాశాలున్నాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు