తస్మాత్‌ జాగ్రత్త!

ప్రధానాంశాలు

తస్మాత్‌ జాగ్రత్త!

కేరళ, మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు
టీకాల కొనసాగింపుతో పాటు కట్టడి చర్యలపై ఆరోగ్యశాఖ దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: దేశమంతా కొవిడ్‌ వ్యాధి నియంత్రణలోనే ఉన్నా.. కేరళ, మహారాష్ట్రల్లో క్రమేణా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలు నిరంతరం కొనసాగుతుండడంతో.. కరోనా కట్టడిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆరోగ్యశాఖ తీర్మానించింది. ‘టీకా పొందండి.. కొవిడ్‌ను ఖతం చేయండి’ వంటి నినాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించింది. అలానే నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఏమాత్రం కొవిడ్‌ లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు స్పష్టం చేసింది.

ఏమరుపాటుగా ఉంటే..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆగస్టు, సెప్టెంబరులో రోజుకు 3 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. గత నెల రోజులుగా రోజుకు 150కి మించడం లేదు. కొవిడ్‌ మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఇదే సమయంలో మహారాష్ట్ర, కేరళలో మాత్రం రోజుకు వేలల్లోనే కేసులు నమోదవుతున్నాయి. బుధవారం మహారాష్ట్రలో 3,663, కేరళలో 4,937 కేసులు నమోదుకావడం గమనార్హం. పరిస్థితి ఇలా ఉన్నా.. కొవిడ్‌ నిబంధనలపై ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో మాస్కులు ధరించే వారి సంఖ్య తగ్గిపోగా.. 6 అడుగుల భౌతిక దూరాన్ని ఎక్కడా పాటించడం లేదు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడాన్ని కూడా బాగా తగ్గించేశారు. ఈ నేపథ్యంలో వైరస్‌ మళ్లీ విజృంభించే అవకాశాలను కొట్టిపడేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్‌రాష్ట్ర ప్రయాణాలతో కరోనా వైరస్‌ ఒక చోటు నుంచి మరో చోటుకు సులువుగా వ్యాప్తి చెందే అవకాశముంది. ఇటీవల కర్ణాటకలో ఒక అపార్ట్‌మెంట్‌లో 103 కేసులు నమోదవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో దారి లేదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం అనుమానిత లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ సిబ్బందికి తొలి డోసు కొవిడ్‌ టీకాను పంపిణీ చేశారు. వైద్య సిబ్బందిలో 58 శాతం మంది మాత్రమే టీకాలను పొందగా.. మిగిలిన విభాగాల్లో 33 శాతం మందే టీకాను స్వీకరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని టీకాల పంపిణీని సాధ్యమైనంత వరకూ విజయవంతం చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కొవిడ్‌ కట్టడిలో టీకాల ప్రాధాన్యాన్ని గుర్తించేలా విస్తృత ప్రచారం కల్పించనుంది. మార్చిలో 50 ఏళ్ల పైబడిన వారికి, ఆ లోపు వయసులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకాలు ఇవ్వనుండడంతో.. సాధారణ ప్రజల్లో అపోహలు, భయాందోళనలు తొలగించేలా ప్రచార చిత్రాలను రూపొందించనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని