గుజరాత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద జూ

ప్రధానాంశాలు

గుజరాత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద జూ

2023 కల్లా ఏర్పాటుకు రిలయన్స్‌ కృషి
కనువిందు చేయనున్న  కొమొడో డ్రాగన్లు, ఇతర జంతువులు

జామ్‌నగర్‌: అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో భారీ జంతు ప్రదర్శనశాలను ఏర్పాటుచేస్తున్నారు. ‘గ్రీన్స్‌ జులాజికల్‌ రెస్క్యూ అండ్‌ రిహాబిలిటేషన్‌ కింగ్‌డమ్‌’ పేరుతో 250 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో, పలురకాల జంతువులు సందడి చేయనున్నాయి. కొమొడో డ్రాగన్లు, చిరుతలు, ఆఫ్రికా సింహాలు, ఆఫ్రికా ఏనుగులు, జిరాఫీలు వంటివి కనువిందు చేయనున్నాయి. ఈ ప్రదర్శనశాలలో సంరక్షణ కేంద్రం కూడా ఉంటుందని, 2023లో సందర్శకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఆర్‌ఐఎల్‌ కార్పొరేట్‌ వ్యవహారాల డైరెక్టర్‌ పరిమళ్‌ నత్వాని చెప్పారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ముఖ్య కార్యదర్శి ఎంకే దాస్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన ఐక్యతా శిల్పం గుజరాత్‌లోని కెవడియాలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శన శాల (జంతువుల సంఖ్య రీత్యా) త్వరలోనే జామ్‌నగర్‌లో ఏర్పాటుకానుంది’’ అని ఆయన అసోచాం వ్యవస్థాపక వారోత్సవంలో మాట్లాడుతూ వెల్లడించారు.‘‘గీన్స్‌ జులాజికల్‌ రెస్క్యూ అండ్‌ రిహాబిలిటేషన్‌ కింగ్‌డమ్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటుచేసేందుకు సమర్పించిన డీపీఆర్‌, మాస్టర్‌ ప్లాన్‌ (లే అవుట్‌)ను ఫిబ్రవరి 12, 2019న జరిగిన కేంద్ర జంతు ప్రదర్శనశాలల ప్రాధికార సంస్థ 33వ సమావేశంలో ఆమోదించాం’’ అని సీజెడ్‌ఏ వెబ్‌సైట్‌ పేర్కొంది. దీనికి ఎంత మొత్తం వెచ్చించనున్నారనే విషయమై అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరికొందరు సంపన్నులదీ ఇదే బాట
ఇండోనేసియా సంపన్నుడు, బొగ్గు గనుల వ్యాపారవేత్త ‘లో టక్‌ క్వాంగ్‌’ తన బొగ్గు గనుల సమీపంలో జంతుప్రదర్శన శాల నిర్మించారు. ఇందుకు తాను వెచ్చించిన రూ.29 కోట్లు (నాలుగు మిలియన్‌ డాలర్లు) లాభాల కోసం కాదని, జంతువులపై ప్రేమతోనేనని ఆయన చెబుతుంటారు. జార్జియా కుబేరుడు, మాజీ ప్రధాని బిడ్జినా ఇవానిష్విలీ వృక్షశాస్త్ర సంబంధ పార్కు కోసం రూ.21 కోట్లు వెచ్చించారు. ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే.. ప్రపంచవ్యాప్తంగా క్రీడలు, వాణిజ్య రంగాలకు చెందిన సంపన్నులు ప్రదర్శనశాలలు ఏర్పాటుచేస్తున్నారు. మరికొందరు క్రీడల జట్లను (సాకర్‌ క్లబ్‌ వంటివి) కొనుగోలు చేస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని