close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
2,00,739

కరోనా కేసుల కొత్త గరిష్ఠం.. మహమ్మారి విలయ తాండవం
దేశవ్యాప్తంగా 1,038 మంది మృతి
సరికొత్త హాట్‌స్పాట్‌లుగా దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌
అమెరికా 34 రోజుల రికార్డును పది రోజుల్లోనే దాటేసిన భారత్‌
మోదీతో విదేశీ ఉన్నతాధికారుల భేటీల నిలిపివేత

ఈనాడు, దిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ దేశంలో స్వైర విహారం చేస్తోంది. రోజువారీ బాధితుల సంఖ్య మరో గరిష్ఠాన్ని దాటింది. ఇదివరకు ఎన్నడూలేని విధంగా 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 1,038 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇదే గరిష్ఠం. ఈ నెల 5న తొలిసారి రోజువారీ కేసులు లక్షగా నమోదు కాగా, పది రోజుల్లోనే ఆ సంఖ్య 2 లక్షలను దాటిపోయింది. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లు ‘కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాలు’ (హాట్‌స్పాట్స్‌)గా అవతరిస్తున్నాయి. ఇప్పటివరకు వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో క్రితం రోజు కంటే 2.09% కేసులు తగ్గాయి. యూపీలో 14%, దిల్లీలో 28% కేసులు పెరిగాయి. కుంభమేళా జరిగిన ప్రాంతాల్లో 1,701 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

హరిద్వార్‌ నుంచి దేవ్‌ప్రయాగ్‌ వరకు గత 5 రోజులుగా ఆరోగ్య కార్యకర్తలు 2,36,751 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇక్కడ కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని హరిద్వార్‌ ప్రధాన వైద్యాధికారి శంభుకుమార్‌ ఝా గురువారం తెలిపారు. కొవిడ్‌-19ను ప్రకృతి విపత్తుగా ప్రకటించి, కరోనా బారిన పడిన వారికి రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి డబ్బు అందజేసేందుకు అనుమతించాలని కేంద్రానికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే లేఖ రాశారు. దేశంలో కరోనా విజృంభణ కారణంగా ప్రధాని మోదీతో విదేశీ ఉన్నతాధికారుల భేటీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
*దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 14,71,877 (10.46%)కి చేరింది. ఒక్కరోజులోనే ఈ కేసులు 1,06,173మేర పెరిగాయి. ఇందులో మహారాష్ట్ర వాటా తగ్గి, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళల వాటా పెరుగుతూ పోతోంది. రికవరీ రేటు 88.31శాతానికి తగ్గిపోయింది. పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహానగరాలవారీగా చూస్తే ఇప్పుడు ముంబయిని మించి దిల్లీలో కేసులు నమోదవుతున్నాయి.
* మన దేశంలో కరోనా కేసుల వేగం అమెరికా కంటే అధికంగా ఉంది. అగ్రరాజ్యంలో లక్ష నుంచి 2లక్షలకు కేసులు పెరగడానికి 34 రోజుల సమయం పడితే భారత్‌లో పది రోజులే పట్టింది.
* దేశంలో కరోనా విజృంభణ కారణంగా ప్రధాని మోదీతో విదేశీ ఉన్నతాధికారుల భేటీలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పర్యటనను కుదించే అవకాశం ఉంది.

టీకా ఉత్సవ్‌లో 1.28 కోట్ల డోసులు
దేశవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌ నిర్వహించింది. నాలుగు రోజుల్లో 1,28,98,314 డోసులను ప్రజలకు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కేంద్రం వంచన: రాహుల్‌ గాంధీ
ఆసుపత్రుల్లో టీకా డోసులు అందుబాటులో లేకపోయినా.. ‘టీకా ఉత్సవ్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ‘ఆసుపత్రుల్లో పరీక్షలు జరపట్లేదు, సదుపాయాలు లేవు. వ్యాక్సిన్లు కూడా లేవు. కానీ, టీకా ఉత్సవ్‌ మాత్రం ఉంది. పీఎం కేర్స్‌ నిధులన్నీ ఏమయ్యాయి?’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌లో ప్రశ్నించారు.

10 రాష్ట్రాల్లో ఆందోళనకరం..

గురువారం ఉదయం 8 గంటల వరకు గడచిన 24 గంటల్లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లలో గతంలో ఎన్నడూ లేనంత అధిక సంఖ్యలో కేసులొచ్చాయి. దేశవ్యాప్తంగా 13,84,549 పరీక్షలు నిర్వహించగా 14.49% మందికి పాజిటివ్‌గా తేలింది. మలిదశలో కేసుల రెట్టింపు చాలా వేగంగా పెరుగుతోంది. అయినప్పటికీ రోజువారీ పరీక్షలు 16% మాత్రమే పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. రోజుకు 25 లక్షల పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు.

పాత్రికేయులనూ కరోనా యోధులుగా గుర్తించండి: ఎడిటర్స్‌ గిల్డ్‌
వైరస్‌వ్యాప్తి సమయంలోనూ నిరాటంకంగా విధులు నిర్వర్తిస్తున్న పాత్రికేయులనూ కరోనా యోధులుగా గుర్తించి అందరికీ టీకా అందించాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీమాముస్తఫా, సంజయ్‌కపూర్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సుప్రీంకోర్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన సిబ్బందిలో 40 మందికిపైగా కరోనా సోకగా..తాజాగా జస్టిస్‌ ఎం.ఆర్‌.షా అధికారిక నివాసంలోని సిబ్బంది అందరికీ వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు