జీవితంపై తరుగుతున్న సంతృప్తి

ప్రధానాంశాలు

జీవితంపై తరుగుతున్న సంతృప్తి

కొవిడ్‌ ఆంక్షలతో పెరిగిన ఒంటరితనం

బ్రిటన్‌ సర్వేలో వెల్లడి

బకింగ్‌హామ్‌షైర్‌: ‘గోటిచుట్టుపై రోకటిపోటు’ చందంగా... మధ్యతరగతి బతుకులను కరోనా మహమ్మారి అసంతృప్తిమయం చేసింది. భవిష్యత్తుపై భయాందోళనలు మిగిల్చింది. లాక్‌డౌన్లు, ఇళ్లకే పరిమితం కావడం, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం వంటివి తెలియకుండానే వారిలో జీవితంపై అసంతృప్తి భావన కలిగిస్తున్నట్టు బ్రిటన్‌కు చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ నేషనల్‌ స్టాటస్టిక్స్‌ (ఓఎన్‌ఎస్‌) తాజా సర్వే తేల్చింది. కరోనా తలెత్తిన తర్వాత ప్రజల్లో ‘జీవితంపై సంతృప్తి’ స్థాయి సగటున 4% తగ్గిపోగా, భవిష్యత్తుపై ఆందోళన 9% పెరిగినట్టు పరిశోధకులు లెక్కగట్టారు. బతకడం కోసం తాము చేస్తున్న పనులేమీ అంత గొప్పవి కావన్న అసంతృప్తి ప్రజల్లో అంతకంతకూ పెరుగుతున్నట్టు గుర్తించారు. సర్వేలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 3.20 లక్షల మంది నుంచి పరిశోధకులు అభిప్రాయాలు సేకరించారు.

ఆంక్షలతో ఒంటరి భావన...

కొవిడ్‌ ఆంక్షలు, లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా- అప్పటివరకూ ఒక పద్ధతిలో సాగిపోతున్న దైనందిన జీవితం ఒక్కసారిగా ఛిద్రమైపోయింది. చాలామంది కొవిడ్‌కు గురయ్యారు. ఆప్తులను కోల్పోయారు. దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ మూతపడ్డాయి. స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి లేకపోయింది. ఇతరులకు దూరం పాటించక తప్పలేదు. నెలల తరబడి ఇంటి నుంచే పని చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ప్రజల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి, ఒంటరిగా ఉన్నామన్న భావనను కలిగించాయి. వీటికి తోడు కరోనా సమయంలో ఆదాయం తగ్గడం, నిత్యావసరాల ధరలు పెరగడంతో అప్పులు చేయక తప్పలేదు. ఇలా ఆర్థికంగా దిగజారాల్సి రావడమూ చాలామందిని కుంగదీసి... జీవితంలో సంతృప్తి లేకుండా చేసినట్టు నిపుణులు విశ్లేషించారు. 2018-19లో తాము ఎంతో తృప్తిగా, ఆనందంగా ఉండేవారమని సర్వేలో పాల్గొన్న చాలామంది చెప్పినట్టు ఓఎన్‌ఎస్‌ నివేదిక పేర్కొంది.

మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేయాలి

‘ది ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ)’ కూడా... కొవిడ్‌ కారణంగా ప్రజల మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్టు తాజా విశ్లేషణలో పేర్కొంది. ఆర్థిక అస్థిరత, నిరుద్యోగం, భవిష్యత్తుపై భరోసా లేకపోవడం, సామాజిక సంబంధాలు దెబ్బతినడం, వ్యాయామం లేకపోవడం, దైనందిన జీవితంలో ప్రతికూల మార్పులు రావడమే ఇందుకు కారణాలని ఆ సంస్థ పేర్కొంది. ‘‘ప్రజల మానసిక ఆరోగ్యానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలి. ఉద్యోగాలకు, ఆదాయానికి భద్రత కల్పించాలి. మునుపటి జీవన పరిస్థితులను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని ఓఈసీడీ సూచించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని