గాయని హరిణి తండ్రి అనుమానాస్పద మృతి

ప్రధానాంశాలు

గాయని హరిణి తండ్రి అనుమానాస్పద మృతి

గతంలో హైదరాబాద్‌ ఐఎస్‌బీ డైరెక్టర్‌గా ఏకే రావు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు, కన్నడ చిత్రాల్లో గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న హరిణి తండ్రి, హైదరాబాద్‌ ఐఎస్‌బీ విశ్రాంత డైరెక్టర్‌ ఏకే రావు అనుమానస్పద రీతిలో మరణించారు. బెంగళూరు సమీపంలో రైలుపట్టాలపై పడి ఉన్న ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేతిపై, గొంతు వద్ద ఉన్న కత్తిగాట్ల ఆధారంగా ఆత్మహత్య అని అనుమానించగా.. శవపరీక్షలోనూ ఇదే విషయం గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా మృతుని గుర్తించామని యలహంక రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. అయితే, తన తండ్రిది హత్యేనన్న అనుమానంతో ఆయన రెండోకుమార్తె శాలినీరావు ఫిర్యాదుచేశారు. సోమవారం రాత్రి ఏకే రావు మరణించగా, మంగళవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు ఆయనేనని గురువారం వెల్లడించారు. సుద్ధగుంటపాళ్య ఠాణాలో ఆయనపై ఒక వంచన కేసు ఉంది. కొద్దిరోజుల కిందటే బెంగళూరు వచ్చిన ఆయన ఒక హోటల్‌లో దిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

బహుముఖ ప్రజ్ఞాశాలి
ఏకే రావుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హరిణి గాయని. రెండో కుమార్తె శాలినీరావు బెంగళూరులో ఉంటారు. ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఆయన.. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌పై ఆసక్తితో థాయ్‌లాండ్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ‘ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌’లో పట్టా అందుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కొద్దినెలలు సత్యం కంప్యూటర్స్‌లో, తర్వాత అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తించారు. తర్వాత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని