‘దిల్లీ మోడల్‌’తో కరోనా వ్యాప్తికి బ్రేక్‌ వేయండి..

తాజా వార్తలు

Published : 01/08/2020 16:30 IST

‘దిల్లీ మోడల్‌’తో కరోనా వ్యాప్తికి బ్రేక్‌ వేయండి..

టెస్టులు భారీగా పెంచాలని రాష్ట్రాలకు కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి
టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన కేంద్రమంత్రి 

హైదరాబాద్‌: దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్నిరాష్ట్రాలూ దిల్లీ మోడల్‌ను అనుసరించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని టిమ్స్‌, గాంధీ ఆస్పత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్‌ ఆస్పత్రులను సందర్శించి కరోనా బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. టెస్టింగ్‌, ట్రేసింగ్‌; ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. టెస్టులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ పరీక్షలతోనే త్వరగా ఈ వైరస్‌ను కట్టడిచేయగలమని చెప్పారు.కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీలో పరిస్థితిని తాను స్వయంగా సమీక్షిస్తున్నాననీ..  ప్రస్తుతం అక్కడ రికవరీ రేటు 84శాతంగా ఉందని చెప్పారు. అన్ని రాష్ట్రాలూ దిల్లీ మోడల్‌ను అనుసరించాలని సూచించారు. 

ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెంచండి
తెలంగాణలో పాజిటివ్‌కేసులు పెరుగుతున్నాయని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు మెరుగుపరిచి వాటిపై ప్రజలకు నమ్మకం పెంచాలన్నారు. కరోనా రోగులకు అవసరమైన బెడ్‌లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టులో భారీగా కేసులు వచ్చే అవకాశం ఉన్నందున మరిన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. అలాగే, గ్రామాల సర్పంచ్‌ల నుంచి ప్రజలందరినీ చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు.  కొవిడ్‌ వారియిర్లు, సిబ్బంది జీతాలు పెంచాలని సూచించారు. 

ప్లాస్మా దానానికి ముందుకు రండి

దిల్లీ, పుణె, ముంబయి లాంటి నగరాలతో పోలిస్తే టెస్ట్‌ల సంఖ్యను మరింతగా పెంచాలన్నారు.  రాష్ట్రానికి వెంటిలేటర్లతో పాటు 10లక్షల N95 మస్కులు,  2.3లక్షల పీపీఏ కిట్‌లు కేంద్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఆస్తమా, డయాలసిస్‌, గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లోనుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారికి ఇంతవరకు వ్యాక్సిన్‌ రాలేదన్న కిషన్‌ రెడ్డి.. పాజిటివ్‌వచ్చినవారు బయట తిరగడం సరికాదన్నారు. అలాగే, కరోనాను జయించిన వారు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని