
తాజా వార్తలు
భారత్: 23వేలు దాటిన కొవిడ్ మరణాలు!
24గంటల్లో 28,701 కేసులు, 500మరణాలు
దిల్లీ: భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. గత ఐదురోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో ఇదే గరిష్ఠం. దీంతో సోమవారం ఉదయానికి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,78,254కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక నిన్న ఒక్కరోజే 500మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 23,174గా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ బారినపడి కోలుకుంటున్న వారిసంఖ్య పెరడగం ఊరట కలిగించే విషయం. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 18,850 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకోగా మరో 3,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 62.5శాతంగా ఉంది.
మహారాష్ట్రలో కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 7,827 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,427 కు చేరింది. తమిళనాడులో 4244కేసులు నమోదయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే 12వేల కేసులు నమోదుకావడం ఆందోళన కలిగించే విషయం.
ఇక ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో కొనసాగుతుండగా, కొవిడ్ మరణాల్లో మాత్రం ఎనిమిదో స్థానంలో ఉంది.
ఇవీ చదవండి..
'పల్స్ ఆక్సీమీటర్ల'తోనే మరణాల కట్టడి..!
కట్టడిలేని వేళ..కరోనా ఆగేదెలా?