నేనే నెం.1 పర్యావరణవేత్తను..! ట్రంప్‌

తాజా వార్తలు

Published : 09/09/2020 15:42 IST

నేనే నెం.1 పర్యావరణవేత్తను..! ట్రంప్‌

ఎన్నికల వేళ..గళం మార్చిన ట్రంప్‌
పర్యావరణ పరిక్షణలో అమెరికా గొప్పగా పనిచేస్తోందంటూ కితాబు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తానో ‘గొప్ప పర్యావరణవేత్త’గా ప్రకటించుకున్నారు. ‘కొందరు సెనేటర్లు నా ఆఫీస్‌కు వచ్చి.. అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడోర్‌ రూజ్‌‌వెల్ట్ తర్వాత అత్యంత శక్తిమంతమైన పర్యావరణ పరిరక్షణ అధ్యక్షుడిని నేనే అని చెప్పారు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా ప్రాంతాల్లోని ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్(సముద్రగర్భ తవ్వకం)పై నిషేధం విధించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, పారిస్‌ పర్యావరణ ఒప్పందం-2015 నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌, తాజాగా గొప్ప పర్యావరణవేత్తగా ప్రకటించుకోవడం మరోసారి చర్చనీయాంశమైంది. దీన్ని కూడా ట్రంప్‌ ఎన్నికల స్టంట్‌గానే విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికల వేళ..మారిన గళం..

అయితే, అమెరికాలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ట్రంప్‌ మాటమార్చినట్లు ప్రత్యర్థులు భావిస్తున్నారు. తుఫానులు, వరదల ముప్పు ఎక్కువగా ఉండే జార్జియా, దక్షిణ కరోలినా తీరప్రాంతాల్లో చమురు, గ్యాస్‌ తవ్వకాలపై తాత్కాలిక నిషేధం ప్రకటించడం ద్వారా తానో పర్యావరణ ప్రేమికుడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే వాదన మొదలైంది. అంతేకాకుండా తన ప్రత్యర్థి బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకొంటే  అమెరికా పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని ఆరోపించారు. పర్యావరణాన్ని పరిరక్షించడం వామపక్షాల ఎజెండా కాదని, ఇది అమెరికాను శిక్షించడమే అని ప్రత్యర్థి బైడెన్‌పై విరుచుకుపడ్డారు. వనరులను సంరక్షించుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో తమ తీరును సమర్థించుకున్న ఆయన, తమ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ కితాబిచ్చుకున్నారు.

పారిస్‌ ఒప్పందం నుంచి బయటకు..

ప్రపంచంలో అత్యధిక కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా తరువాతి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. వీటిని తగ్గించే లక్ష్యంలో భాగంగా ప్రపంచంలోని అన్ని దేశాలు  పారిస్‌ ఒప్పందంపై సంతకం చేశాయి. దీనిలో అప్పటి ఒబామా అధ్యక్షతన ఉన్న అమెరికా కూడా సంతకం చేసింది. అయితే, ట్రంప్‌ అధికారంలోకి రాగానే పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా నిష్ర్కమిస్తున్నట్లు ప్రకటించారు.  వీటితోపాటు అమెరికాలోని తీరప్రాంతంలో డ్రిల్లింగ్‌పై పర్యవేక్షణను బలహీనపరిచే చర్యలు చేపట్టారు. తద్వారా గ్యాస్‌, చమురు కంపెనీలకు వత్తాసు పలికారనే విమర్శలూ ఉన్నాయి. వీటితోపాటు పర్యావరణ పరిరక్షణ నిబంధనలను భారీగా సడలించడంతో కాలుష్యం పెరుగుదలకు కారణమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని