ఏఎంయూ అంటే..భవనాలు మాత్రమే కాదు

తాజా వార్తలు

Published : 22/12/2020 14:00 IST

ఏఎంయూ అంటే..భవనాలు మాత్రమే కాదు

శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగం

అలీగఢ్: అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం(ఏఎంయూ) శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ.. విశ్వవిద్యాలయ ఘన చరిత్రను కొనియాడారు. ఏఎంయూ పూర్వ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రశంసించారు. అలాగే కరోనా మహమ్మారిపై పోరులో విశ్వవిద్యాలయం అపూర్వమైన సహకారాన్ని అందించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. శతాబ్ది ఉత్సవాల్లో తనను భాగంగా చేసినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్‌ కూడా పాల్గొన్నారు. 

అలీగఢ్ విశ్వవిద్యాలయం అంటే కేవలం భవనాలు, విద్యార్థులు మాత్రమే కాదని, గత వందేళ్లుగా ప్రతి అధ్యాపకుడు అందించిన  సహకారమని మోదీ పేర్కొన్నారు. విద్యాపరంగానే కాకుండా విశ్వవిద్యాలయం కొవిడ్ సమయంలో కూడా తనవంతు బాధ్యతలు నిర్వహించిందని ప్రశంసించారు.  ‘వేలాది మందిని ఉచితంగా పరీక్షించడం, ఐసోలేషన్ వార్డులు, ప్లాస్మా బ్యాంకుల ఏర్పాటు, ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళం ఇవ్వడం ద్వారా సమాజం పట్ల మీ బాధ్యతను నెరవేర్చారు’ అని విద్యా సంస్థ, పూర్వ విద్యార్థుల సేవలను కొనియాడారు. అలాగే గత 100 ఏళ్ల కాలంలో ప్రపంచంలోని అనేక దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఏఎంయూ కృషి చేసిందని ప్రధాని అన్నారు. ఉర్దు, అరబిక్, పర్షియన్ భాషలపై, ఇస్లామిక్ సాహిత్యంపై విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనలు మొత్తం ఇస్లామిక్ ప్రపంచంతో భారతదేశ సాంస్కృతిక సంబంధాలకు కొత్త శక్తిని ఇచ్చిందని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ వైవిధ్యాన్ని మనం మర్చిపోకూడదని, బలహీనం కానివ్వకూదని అన్నారు. సంస్థ ప్రాంగణంలో ‘ఏక్‌ భారత్, శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తి రోజురోజుకు బలంగా ఉండేలా మనం కలిసి పనిచేయాలన్నారు. 

అలాగే ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి పౌరుడు దేశంలో జరుగుతోన్న అభివృద్ధి నుంచి ప్రతిఫలం పొందుతారని, ఆ మార్గంలోనే దేశం పయనిస్తోందని మోదీ స్పష్టం చేశారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్’ దీని వెనక ఉన్న మంత్రమని వెల్లడించారు. అంతేకాకుండా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. 1920లో శాసన చట్టం ద్వారా మొహమ్మదాన్ ఆంగ్లో ఓరియెంటల్(ఎంఏఓ) కళాశాలకు విశ్వవిద్యాలయ హోదాను కల్పించడంతో ఏఎంయూగా రూపాంతరం చెందింది. ఎంఏఓను 1877లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు. 

ఇవీ చదవండి:

మోదీకి అమెరికా ప్రసిద్ధ పురస్కారం

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని