కోటిన్నర మందికి టీకా పూర్తి!

తాజా వార్తలు

Published : 06/01/2021 21:24 IST

కోటిన్నర మందికి టీకా పూర్తి!

లండన్‌: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తున్న సమయంలోనూ పలు ప్రాంతాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.‌ కరోనా ధాటికి ఐరోపా, అమెరికా దేశాలు వణికిపోతున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 35దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది వ్యాక్సిన్‌ పొందినట్లు సమాచారం. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో 50లక్షల మందికి టీకాను అందించారు. అటు చైనాలోనూ 45లక్షల మందికి టీకా ఇచ్చినట్లు సమాచారం. బ్రిటన్, ఇజ్రాయెల్‌లలో వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ పదిలక్షల చొప్పున ప్రజలకు టీకా పంపిణీ చేశారు. రష్యా, యూఏఈ దేశాల్లోనూ వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇక భారీ జనాభా కలిగిన భారత్‌లోనూ త్వరలోనే వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం మొదలుకానుంది. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద ఆక్స్‌ఫర్డ్‌(కొవిషీల్డ్‌), భారత్‌ బయోటెక్‌(కొవాగ్జిన్‌)టీకాలకు అనుమతి పొందిన విషయం తెలిసిందే.

మోడెర్నాకు అనుమతిచ్చిన ఈయూ..

కరోనా వైరస్‌ విజృంభణకు వణికిపోతోన్న యూరోపియన్‌ యూనియన్‌లో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్లు యూరోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థ(EMA) వెల్లడించింది. ఇప్పటికే ఫైజర్‌ టీకా అందుబాటులోకి రాగా, తాజా నిర్ణయంతో ఈయూలో అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్‌గా నిలిచింది.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికా, బ్రిటన్‌లలో ఇప్పటికే భారీ ఎత్తున వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతోంది. అయినప్పటికీ, 27దేశాల ఈయూ మాత్రం వ్యాక్సిన్‌ అందించడంలో అలసత్వం వహిస్తోందనే విమర్శలు వచ్చాయి. దీంతో అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ  మరో వ్యాక్సిన్‌ తీసుకురావడంపై దృష్టి సారించింది. డిసెంబర్‌ నెలలో ఫైజర్‌కు అనుమతి ఇవ్వగా, తాజాగా మోడెర్నాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఈ వ్యాక్సిన్‌ దోహదం చేస్తుందనే విశ్వాసం ఉందని ఈఎంఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎమెర్‌ కూక్‌ అభిప్రాయడ్డారు. అయితే, 45కోట్ల జనాభా కలిగిన ఈయూలో వ్యాక్సిన్‌ పంపిణీ ఒక సవాల్‌గానే భావిస్తున్నామని యూరోపియన్‌ కౌన్సిల్‌ చీఫ్‌ చార్లెస్‌ మైఖేల్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి..
41 దేశాలకు పాకిన కొత్తరకం కరోనా!
ఆ దేశాలన్నీ మళ్లీ ‘లాక్‌’డౌన్‌లోకే..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని