అగ్రరాజ్యంపై కరోనా పంజా.. 31మంది మృతి

తాజా వార్తలు

Updated : 11/03/2020 13:44 IST

అగ్రరాజ్యంపై కరోనా పంజా.. 31మంది మృతి

అమెరికా: చైనాలో విజృంభించిన కరోనా ప్రపంచ దేశాలకూ శరవేగంగా విస్తరిస్తోంది. అగ్ర రాజ్యం అమెరికా పైనా పంజా విసిరింది. ఈ మహమ్మారి ప్రభావంతో అమెరికాలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. మరో వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. ఒక్క వాషింగ్టన్‌లోనే మృతుల సంఖ్య 24కి చేరడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు అమెరికా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు అధ్యక్ష బరిలో ఉన్న జో బిడెన్‌, బెర్నీ శాండర్స్‌ తమ ఎన్నికల ర్యాలీలను సైతం వాయిదా వేసుకున్నారు. అమెరికాలోని 38 రాష్ట్రాల్లో ఈ వైరస్‌ ప్రభావం ఉంది. మొత్తం 1015 కేసులకు పైగా నమోదు కాగా.. ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు వదిలినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. అత్యధికంగా వాషింగ్టన్‌లో 279 కేసులు నమోదు అయ్యాయి. అలాగే, కాలిఫోర్నియాలో 178 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. ఫ్లోరిడాలో ఇద్దరు, న్యూజెర్సీ,  సౌత్‌ డకోటాలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. 

అమెరికాలో తొలి కరోనా కేసు జనవరి 21న వాషింగ్టన్‌లోనే నమోదైంది. ఇటీవల కాలంలో ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నెల ప్రారంభం సమయానికి 70 కేసులు మాత్రమే ఉండగా.. తాజాగా ఆ సంఖ్య వెయ్యికి చేరడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.  వాషింగ్టన్‌, కాలిఫోర్నియా, న్యూయార్క్‌, మాసాచుసెట్స్‌లలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్‌ కలకలంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజల దైనందిన జీవనంపై ప్రభావం పడింది. వాణిజ్య సముదాయాలు మూతపడటంతో పాటు కళాశాలల్లో తరగతులు రద్దు చేశారు. సమూహాలకు దూరంగా ఉండాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని