Hamas: గాజా టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఇదీ!
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hamas: గాజా టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఇదీ!

స్మగ్లింగ్‌, అక్రమ ఆయుధాలు.. ఉగ్రదాడులకు కేంద్రం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

నమ్మకంగా ఊరించే ఉచ్చులు.. భారీ ఆయుధ నిల్వలు.. నిత్యం స్మగ్లింగ్‌ కార్యకలాపాలు.. కీలక వ్యక్తులు సురక్షితంగా తప్పించుకొనేలా మార్గాలు.. ఇవి గాజాలోని హమాస్‌ సంస్థ భూగర్భ సొరంగ నెట్‌వర్క్‌లు. తాజాగా హమాస్‌ వెన్నువిరవాలని నిశ్చయించుకొన్న ఇజ్రాయెల్‌ ఇప్పుడు ఈ టన్నెల్‌ నెట్‌వర్క్‌పై దృష్టిపెట్టింది. దీంతో దాదాపు 160 విమానాల బృందాన్ని రంగంలోకి దింపి ఉత్తరగాజాలో దాదాపు 150 భూగర్భ సొరంగాలను ధ్వంసం చేసింది.  దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) ట్విటర్‌లో విడుదల చేసింది.

ఊహకందని దాడులకు మార్గాలుగా..

2001లో పాలస్తీనా వాసులు ఇజ్రాయెల్‌ పోస్టులను ధ్వంసం చేయడానికి సొరంగాలను ఉపయోగించేవారు. కానీ, ఇవి అంతగా ప్రభావం చూపలేదు. దీంతో 2006లో గాజా-ఇజ్రాయెల్‌ సరిహద్దులో  ఓ సొరంగం తవ్వి.. ఆ మార్గంలో ఓ హంతక ముఠా వెళ్లి ఇజ్రాయెల్‌లో ఇద్దరు సైనికులను హత్య చేసి ఒకరిని కిడ్నాప్‌ చేసింది. అతడిని 2011 ఖైదీల మార్పిడి ఒప్పందం సందర్భగా విడుదల చేసింది. ఈ ఘటనతో ఐడీఎఫ్‌  బిత్తరపోయింది.   ఆ తర్వాత గాజా అత్యంత వేగంగా హమాస్‌ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి హమాస్‌ ఈ భూగర్భ టన్నెల్‌ ప్రాజెక్టుపై దృష్టిపెట్టింది. కాంక్రీట్‌ వినియోగించి భారీ ఎత్తున అండర్‌గ్రౌండ్‌ బంకర్లను నిర్మించి వాటిని సొరంగాల సాయంతో అనుసంధానించింది. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికన్లను ఎదుర్కోవడానికి వియత్‌ కాంగ్‌ అడవుల్లో నిర్మించిన టన్నెల్స్‌ను ఇవి పోలి ఉంటాయి. గాజా ప్రాంతంలో మట్టి బలహీనంగా ఉండటంతో ఇవి పూడిపోకుండా కాంక్రీట్‌ కాపాడుతుంది. ఈ టన్నెల్స్‌ నిర్మాణం, నిర్వహణలో బాలకార్మికులను వాడుతున్నట్లు యూనిసెఫ్‌ 2010లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. నికోల్స్‌ పెల్హమ్‌ అనే పరిశోధకుడు ఈ టన్నెల్స్‌లో 160 మంది పిల్లలు చనిపోయినట్లు పేర్కొన్నాడు.

అత్యంత ప్రమాదకరం..

ఈ టన్నెల్స్‌లో విద్యత్తు సరఫరా, ఇతర సదుపాయాలు మొత్తం ఏర్పాటు చేశారు. వీటికి నిర్వహణకు ఖర్చు ఏమీ ఉండదు. నీరు చేరితే మాత్రం బయటకు పంప్‌ చేస్తారు. ఈజిప్టు నుంచి స్మగ్లింగ్‌ చేయడానికి వినియోగించే టన్నెల్స్‌ భారీ  సైజులోఉంటాయి. ఇక ఇజ్రాయెల్‌ వైపు సాయుధులు వెళ్లేందుకు నిర్మించినవి చాలా ఇరుగ్గా ఉంటాయి. కేవలం ఒకమనిషి ఆయుధాలతో ప్రయాణించేలా ఉంటాయి. ఈ టన్నెల్స్‌ నుంచి బయటకు వచ్చి హఠాత్తుగా దాడులు చేయడానికి పలు ప్రవేశమార్గాలు ఉన్నాయి. వీటిని యుద్ధవిమానాలు, ఉపగ్రహాలకు దొరక్కుండా కేమోఫ్లాజ్‌ టెక్నిక్‌తో కప్పిపెడతారు.  అంతేకాదు కొత్తవాళ్లు ఇందులో అడుగుపెట్టడం అంటే చావును కొనితెచ్చుకోవడమే. వీటిల్లో గుర్తించడానికి వీల్లేకుండా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. 

ఇజ్రాయెల్‌ గ్రామల్లోకి చొరబడేలా..

2008-09 సమయంలో ఇజ్రాయెల్‌ దళాల దాడుల నుంచి తట్టుకోవడానికి బాగా ఉపయోగపడటంతో  వీటిని విస్తరించారు.  2012లో  హమాస్‌ రాకెట్‌ ఫోర్స్‌ ఇజ్రాయెల్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో హమాస్‌ బృందాలు ఇజ్రాయెల్‌ గ్రామాల్లోకి చొరబడి దాడులు చేసి నిర్మించడం మొదలు పెట్టారు. కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్‌ గ్రామాల కింది వరకు వీటిని నిర్మించి భారీగా పేలుడు పదార్థాలతో పేల్చేసేవారు.  ఇజ్రాయెల్‌ ప్రజలను, సైనికులను కిడ్నాప్‌ చేయడానికి వీటిని వినియోగిస్తున్నారు.  వీటి నిర్మాణానికి మోటార్‌ డిగ్గర్లు వాడుతున్నారు. ఇక్కడ వచ్చిన మట్టిని వేర్వేరు రహస్య పద్దతుల్లో అనుమానం రాకుండా బయటకు తరలిస్తారు. 

గుర్తించడం కష్టం..

ఐడీఎఫ్‌కు ఈ ప్రణాళికలు తెలిసినా సొరంగాలను గుర్తించడం కష్టంగా మారింది. సొరంగ ప్రవేశద్వారాల మూతలు చాలా చిన్నవిగా ఉండటంతో కనుక్కోవడం అంత సులభం కాదు. ఒక వేళ సెస్మిక్‌, రాడార్లను వాడి కనుగొన్నా.. లోపల ఉన్న మార్గం ఎక్కడికి వెళుతుందో కచ్చితంగా తెలియదు. వీటి ప్రవేశద్వారాలు ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లలోని కింది పోర్షన్లలో.. ప్రార్థనామందిరాల్లో.. పాఠశాలల్లో, పబ్లిక్‌ బిల్డింగ్‌ల్లో ఏర్పాటు చేశారు.  భూ ఉపరితలానికి 65 అడుగుల కింద ఉండటం గుర్తించలేకపోవడానికి మరో కారణంగా ఉంటోంది.

వందల సంఖ్యలో..

ఇజ్రాయెల్‌ లెక్కల ప్రాకం 2007 నుంచి హమాస్‌  1.25 బిలియన్‌ డాలర్లు వెచ్చించి దాదాపు 1,300 సొరంగాలు నిర్మించినట్లు అంచనా. ప్రజల మౌలిక సదుపాయాల కల్పన నిధులు మళ్లించి వీటి నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలున్నాయి.  2014 ఇజ్రాయెల్‌ దాడుల్లో 30 సొరంగాలు ధ్వంసం అయ్యాయి. వియత్నాం యుద్ధంలో కమ్యూనిస్టు దళాలు వినియోగించిన సొరంగాల కంటే రెట్టింపు సంఖ్యలో తమ వద్ద ఉన్నాయని హమాస్‌ నాయకుడు ఇస్మాయిలీ హన్యహ్‌ 2016లో ప్రకటించాడు. గతంలో పశ్చిమ దేశాల జర్నలిస్టులకు వీటిల్లో కొన్నింటిని గర్వంగా హమాస్‌ చూపించుకొంది కూడా. తమ సృజనాత్మకతకు నిదర్శనంగా వీటిని హమస్‌ చెప్పుకొంది. 

విరుగుడు అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్‌..

ఇజ్రాయెల్‌ కూడా కాలక్రమంలో ఈ భూగర్భ నెట్‌వర్క్‌లను గుర్తించి ధ్వంసం చేయడానికి విరుగుడు ఆయుధాలను అభివృద్ధి చేసింది. 2018లో ఇజ్రాయెల్‌ అండర్‌గ్రౌండ్‌ వార్‌ఫేర్‌ అధిపతి వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. కాకపోతే ఆ వివరాలు అత్యంత రహస్యమైనవని బయటకు చెప్పేందుకు నిరాకరించారు. ఇరాన్‌లో‌ బంకర్లను ధ్వంసం చేయడానికి పలు రకాల ఆయుధాలను ఇజ్రాయెల్‌ అభివృద్ధి చేసింది.. వీటిని హమాస్‌ టన్నెల్స్‌పై కూడా ఉపయోగించే అవకాశం ఉంది.  ఇటీవల ఇజ్రాయెల్‌ పీఎం బెంజిమెన్‌ నెతన్యాహు  టన్నెల్‌ నెట్‌వర్క్‌పై మాట్లాడుతూ ‘‘అక్కడ దాక్కోవచ్చని హమాస్‌ అనుకుంటోంది. వారు అక్కడ దాక్కోలేరు. మా ఊహకందని విధంగా తప్పించుకోవచ్చని హమాస్‌ సీనియర్‌ నాయకత్వం భావిస్తోంది. వారు తప్పించుకోలేరు’’ అని వ్యాఖ్యానించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని