మాస్క్‌.. స్మార్ట్‌ కార్డ్‌.. పరిమిత లగేజీ!

తాజా వార్తలు

Published : 02/09/2020 20:14 IST

మాస్క్‌.. స్మార్ట్‌ కార్డ్‌.. పరిమిత లగేజీ!

మెట్రో రైలు ప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు

దిల్లీ: అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఈ నెల 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి 12వ తేదీలోపు అన్ని మార్గాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మెట్రో రైలు కార్పొరేషన్లు అనుసరించాల్సిన విధి విధానాలను పేర్కొంది. మెట్రో రైలు ఎక్కే ప్రతి ప్రయాణికుడూ ముఖానికి మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని కేంద్రం స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వద్ద ఉన్న మెట్రో స్టేషన్లను మూసి ఉంచాలని ఆదేశించింది. స్టేషన్లలో, ప్లాట్‌ఫాంలపైనా, మెట్రో రైళ్లలో భౌతిక దూరం పాటించాలని, అందుకు తగిన విధంగా భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలని సూచించింది.

మాస్కులు లేకుండా ఏ ఒక్కరినీ మెట్రో స్టేషన్లలోకి గానీ, రైళ్లలోకి గానీ అనుమతివ్వకూడదని తన మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టంగా పేర్కొంది. డబ్బులు చెల్లించి తీసుకునేందుకు అన్ని మెట్రో స్టేషన్లలో మాస్కులు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఎటువంటి లక్షణాలూ లేని వారిని, శరీర ఉష్ణోగ్రత పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించాలంది. అన్ని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, లిఫ్టులు, ఎస్క్‌లేటర్లు సహా అన్ని ప్రదేశాల్లో శానిటైజర్‌ తప్పనిసరిగా అందుబాటులోకి ఉంచాలని తెలిపింది. నేరుగా డబ్బు చెల్లించే పద్ధతులు నిలిపివేయాలని.. స్మార్ట్‌కార్డులు, ఆన్‌లైన్‌ బుకింగ్‌కు మాత్రమే అనుమతించాలని స్పష్టంచేసింది. తక్కువ లగేజీతో రావాలని ప్రయాణికులకు సూచించింది. రైళ్లలో ఏసీ సరఫరా, గాలి మారేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ప్రయాణికుల అవగాహన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంది. మెట్రో రైలు కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వం సహా స్థానిక పాలనా సిబ్బంది, పోలీసులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని