Universal Vaccine: అన్ని కరోనా వైరస్‌లకు.. ఒకే ఆయుధం కావాల్సిందే!

తాజా వార్తలు

Published : 30/08/2021 16:00 IST

Universal Vaccine: అన్ని కరోనా వైరస్‌లకు.. ఒకే ఆయుధం కావాల్సిందే!

ఇదే సరైన సమయమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

వాషింగ్టన్‌: గడిచిన శతాబ్ది కాలంలో ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడిన కరోనా వైరస్‌ మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినా దీని ముప్పు ఇంకా తొలగిపోలేదు. భవిష్యత్తులోనూ ఇలాంటి మహమ్మారుల ముప్పు ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో అన్ని రకాల కరోనా వైరస్‌లను ఎదుర్కొనే టీకా అభివృద్ధి చేసేందుకు ఇదే సరైన సమయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. మరో మహమ్మారిని నిరోధించడంతోపాటు ఎన్నో రకాల కరోనా వైరస్‌ల నుంచి ఈ తరహా వ్యాక్సిన్‌ పూర్తి రక్షణ కల్పిస్తాయని అభిప్రాయపడింది.

‘కరోనా వైరస్‌లన్నింటినీ ఎదుర్కొనే వ్యాక్సిన్‌ రూపొందించే సమయం ఆసన్నమైంది. కానీ, ఇందుకు ప్రపంచ దేశాలు సహకరించాలి. అంతేకాకుండా వీటిని అభివృద్ధి చేయడంతో పాటు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధకులు, సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీలు కీలక పాత్ర పోషించాల్సి ఉంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఇతర మహమ్మారుల నుంచి రక్షించుకోవచ్చని అన్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఓ వ్యాసాన్ని సౌమ్య స్వామినాథన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 21కోట్ల దాటగా.. మరణాల సంఖ్య 45లక్షలకు చేరింది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ కూడా వేగంగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 180కిపైగా దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా.. ఇప్పటి వరకు 520 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక భారత్‌లోనూ వ్యాక్సిన్‌ పంపిణీ వేగం మరింత పుంజుకుంది. ఆగస్టు 28న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కోటి డోసులను పంపిణీ చేశారు. అంతేకాకుండా దేశంలో 50శాతం మందికి (18 ఏళ్లు పైబడిన వారిలో) కనీసం ఒక డోసు అందించడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ భారత్‌ను అభినందించారు.

ఇదిలాఉంటే, భవిష్యత్తులో వివిధ రకాల కరోనావైరస్‌ల వల్ల సంభవించే మహమ్మారుల నుంచి రక్షణ కల్పించేందుకు అమెరికాలోని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ (UNC) శాస్త్రవేత్తల బృందం ఇప్పటికే ఓ యూనివర్సల్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో నిమిగ్నమైంది. ముఖ్యంగా జంతువుల నుంచి మానవులకు సోకే కరోనావైరస్‌ కుటుంబానికి చెందిన ఇతర వైరస్‌లను ఎదుర్కొనేలా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఎలుకల్లో జరిపిన ప్రయోగాల్లో ఇది కొవిడ్‌-19తో పాటు ఇతర కరోనా వైరస్‌ల ప్రమాదకర వేరియంట్లను ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సెకండ్‌ జనరేషన్‌ వ్యాక్సిన్‌ల పేరుతో ఈ పరిశోధన ముమ్మరంగా కొనసాగుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని