ఆ ద్వీపాలు విమానాలకు శాపమా..!

తాజా వార్తలు

Updated : 11/01/2021 11:35 IST

ఆ ద్వీపాలు విమానాలకు శాపమా..!

ఇండోనేషియాలోనే అత్యధిక ప్రమాదాలు ఎందుకు ?

ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం: అది 1990 అక్టోబర్‌ 10.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఫ్లైట్‌నంబర్‌ 5390 .. గాల్లో 17,300 అడుగుల ఎత్తులో ఉండగానే కాక్‌పీట్‌ విండ్‌స్క్రీన్‌ ఒక్కసారిగా ఊడిపోయింది. గాలి ఒత్తిడి పైలట్‌ టిమోతీ లాంక్‌స్టర్‌ను బయటకు లాగేసింది. ఆయన కాళ్లు మాత్రం క్యాబిన్‌లో చిక్కుకుపోవడంతో శరీరం విమానానికి అతుక్కుపోయినట్లు ఉంది. కోపైలట్‌, క్రూ సభ్యులు చాకచక్యంగా వ్యహరించి టిమోతి కాళ్లను పట్టుకోవడంతో ఆయన కిందపడిపోలేదు. ఆ తర్వాత సహ పైలట్‌ విమానాన్ని సురక్షితంగా కిందకు దించాడు. ఈ విమానంలో 87మంది సురక్షితంగా బయటపడ్డారు. టిమోతి కూడా బతికారు.  ఈ ప్రమాదానికి కారణం.. ఆ విమానం విండ్‌షీల్డ్‌కు రాత్రిపూట మరమ్మతులు చేసి ఒరిజనల్‌ బోల్టుల స్థానంలో పొరబాటున అత్యంత స్వల్పతేడా ఉన్న వేరే బోల్టులు అమర్చారు.  ఈ ఘటన విమానయానంలో చిన్న పొరబాట్లు, నిర్లక్ష్యాలకు చెల్లించాల్సిన మూల్యాన్ని చెబుతోంది. పొరబాట్లు.. నిర్లక్ష్యాలకు.. ప్రకృతి, భౌగోళిక పరిస్థితులు కూడా తోడైతే ప్రమాదాల పరంపరను ఆపలేము. ఇప్పుడు ఇండోనేషియాది అదే పరిస్థితి. 

తాజాగా ఇండోనేషియాలో మరో విమానం నేల కూలింది.. ఆసియాలోనే అత్యంత చెత్త విమానయాన రికార్డును ఆ దేశం మూటగట్టుకొంది. అక్కడి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రకృతి తోడు కావడంతో ప్రతి ఏటా ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకోవడం.. పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు  కోల్పోవడం సర్వసాధారణంగా మారిపోయింది.  ఇక్కడ 1945 నుంచి  104 ప్రమాదాలు జరగ్గా.. 1300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏవియేషన్‌ సేఫ్టీ నెట్‌వర్క్‌ డేటా చెబుతోంది. ఆసియాలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన విమానయాన రికార్డు. 

వెంటాడుతున్న గతం..

ఆ దేశం గతంలో విమానయాన పరిశ్రమను నిర్లక్ష్యం చేసిన ఫలితం అనుభవిస్తోంది. చాలాకాలం నియంతృత్వం తర్వాత 1990లలో ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం తెరిచింది. దీంతో వైమానిక పరిశ్రమలో బాగానే పెట్టుబడులు వచ్చాయి. ఆ సమయంలో నియమనిబంధనల విషయంలో అప్రమత్తంగా లేదు. దీనికితోడు విమానయానాన్ని నిర్లక్ష్యం చేసింది.  దేశం మొత్తం దీవులు ఉండటంతో చౌక విమానయానానికి ఇది అనుకూలించింది. ఫలితంగా చాలా చోట్ల భద్రతా ఏర్పాట్లు కూడా కరవయ్యాయి. దీంతో అమెరికా.. ఇండోనేషియా విమానయాన సంస్థలను 2007-16 వరకు నిషేధించింది. శిక్షణ లోపం, రికార్డుల నిర్వహణ లేమి, సాంకేతిక నైపుణ్యాల కొరత, తనిఖీల వ్యవస్థలో లోపాలే దీనికి ప్రధాన కారణం. ఐరోపా సంఘం కూడా 2007-18 వరకు నిషేధించింది. దీంతో ఇండోనేషియా చాలా లోపాలను సరిదిద్దుకొంది. ఆ తర్వాత 2016లో అమెరికా నిషేధం తొలగించింది. 

27ఏళ్ల నాటి విమానం..

తాజాగా శ్రీవిజయ సంస్థ బోయింగ్‌ 737-500 మోడల్‌ విమానం ప్రమాదానికి గురైంది.  వాస్తవానికి బోయింగ్‌లో 737 మోడల్‌ చాలా విజయవంతమైంది. 1967లో తొలిసారి గాల్లోకి ఎగిరిన 737 మోడల్‌లో 300,400,మ్యాక్స్‌ వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో మ్యాక్స్‌ వేరియంట్‌ ప్రమాదాలు(లయన్‌ ఎయిర్‌, ఇథోపియా ఎయిర్‌) బోయింగ్‌ను ఆర్థికంగా కుదిపేశాయి. తాజాగా ప్రమాదానికి గురైన 500 వేరియంట్‌ విమానం దాదాపు  27ఏళ్ల నుంచి సర్వీసులో ఉంది.  ఇది శ్రీవిజయ సంస్థ చేతికి వచ్చే సమయానికే అమెరికాలోని కాంటినెంటల్‌ ఎయిర్‌కు సేవలు అందించింది. విమానయాన రంగంలో 25ఏళ్లు దాటిన విమానాలను మార్చేస్తారు. కానీ, ఇక్కడ అలా జరగలేదు. కాకపోతే శ్రీవిజయ సంస్థకు విమాన ప్రమాద రికార్డు తక్కువగా ఉంది. గత 17ఏళ్లలో ప్రాణనష్టంలేని నాలుగు స్వల్ప ప్రమాదాలు జరిగాయి. బోయింగ్‌కు చెందిన 500 మోడల్‌ విమానాలు మాత్రం 8 భారీ ప్రమాదాలకు గురయ్యాయి. 

భౌగోళిక కారణాలు కూడా..
 భూమిపై ఉన్న అతిపెద్ద దీవుల సమూహం ఇండోనేషియానే. ఇక అత్యధిక పిడుగుపాటులు, ఉరుములు ఇక్కడే పడ్డాయి. 1988లో బొగోర్‌ పట్టణంలో  322 రోజులు ఇవి నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఆ బూడిద గాల్లో కొన్ని కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తుంది. వీటిని జెట్‌ ఇంజిన్లు పీల్చుకొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 2019లో కూడా ఈ కారణంతో జకార్తా ఎయిర్‌పోర్టును కొంతకాలం మూసేశారు. ఇక వర్షాలు కూడా ఎక్కువగానే కురుస్తాయి. తాజాగా ప్రమాదానికి గురైన శ్రీవిజయ ఫ్లైట్‌ 182  కూడా ప్రతికూల వాతావరణంతో గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది. ఇలాంటి పరిస్థితుల్లో కాక్‌పీట్‌లో వారికి బయట ఏం జరుగుతోందో స్పష్టంగా కనిపించదు. ఇక తాజా ప్రమాదానికి కారణం ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుంది. నిన్న దొరికిన బ్లాక్‌బాక్స్‌ వాయిస్‌ రికార్డలను విశ్లేషించాక నిపుణులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. భారీగా వర్షం పడుతుండటంతో గాల్లో ఏం జరిగిందో మత్స్యకారులు కూడా సరిగా చూడలేదు. 

ఇవీ చదవండి

జావా సముద్రంలో విమాన శకలాలు

బ్రెజిల్‌ ప్రయాణికుల్లో మరో కొత్త స్ట్రెయిన్‌?

 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని