ఈ విధంగా Olympics సాధ్యమే

ప్రధానాంశాలు

Updated : 09/05/2021 06:58 IST

ఈ విధంగా Olympics సాధ్యమే

‘ఈనాడు’తో భారత రోయింగ్‌ కోచ్‌ ఇస్మాయిల్‌ బేగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌అడుగు బయట పెట్టడానికి వీల్లేదు.. టోర్నీ కోసం తప్పితే గది దాటడానికి అవకాశమే లేదు.. భోజన సమయంలో మినహా మాస్కు తీయడానికి అనుమతి లేదు.. తరుచుగా కరోనా నిర్ధారణ పరీక్షలు.. హద్దు దాటితే అనర్హత వేటు.. ఇవీ ఈ ఏడాది ఒలింపిక్స్‌ జరిగే టోక్యోలోనే నిర్వహించిన ఆసియా/ఓషియానియా కాంటినెంటల్‌ క్వాలిఫయింగ్‌ రెగట్టా టోర్నీ కోసం నిర్వాహకులు చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు. క్వాలిఫయింగ్‌ టోర్నీలో రెండో స్థానంలో నిలిచి అర్జున్‌- అర్వింద్‌ జోడీ ఒలింపిక్స్‌ బెర్తు సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత రోయింగ్‌ కోచ్‌, ద్రోణాచార్య గ్రహీత ఇస్మాయిల్‌ టోక్యోలో పరిస్థితులను ‘ఈనాడు’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..!
రెండు దశాబ్దాల ముందు నుంచి కొనసాగుతున్న నా కోచింగ్‌ కెరీర్‌లో ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ టోర్నీలో పాల్గొంటామని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా కారణంగా అడుగడుగునా ఆంక్షలు తప్పలేదు. ఈ మహమ్మారి కాలంలోనూ ఒలింపిక్స్‌ నిర్వహించి తీరాలనే పట్టుదలతో ఉన్న టోక్యో నిర్వాహకులు.. ఈ రోయింగ్‌ టోర్నీ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సమస్య లేకుండా ఈ టోర్నీ విజయవంతమైతేనే ఒలింపిక్స్‌ నిర్వహణ దిశగా వాళ్లకు మరింత ఆత్మవిశ్వాసం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీ కోసం దిల్లీ నుంచి బయల్దేరేటప్పటి నుంచే అన్ని నిబంధనలు పాటించాల్సి వచ్చింది. ఇక్కడ విమానాశ్రయంలో దిగాక అన్ని రకాల దరఖాస్తులు నింపి బయట పడడానికే అయిదు గంటలు పట్టింది. ట్రాకింగ్‌, ట్రేసింగ్‌కు అనుగుణంగా వీళ్లు రూపొందించిన యాప్‌ను మా ఫోన్లలో వేయించి, అది పనిచేస్తుందా? లేదా? అని పరీక్షించిన తర్వాతే మమ్మల్ని అనుమతించారు.

 

ఒక్కరే ఉండాలి..

రెండు రోజుల క్వారంటైన్‌ తర్వాత పోటీల్లో పాల్గొన్నాం. ఇక్కడ హోటల్లో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. వాటిని ఉల్లంఘిస్తే జట్టును టోర్నీ నుంచి తొలగిస్తారు. శ్రీలంక బృందంలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో దాన్ని పోటీలకు అనుమతించలేదు. కాబట్టి ఎంత కష్టమైనా ఆ నిబంధనలను పక్కాగా అనుసరించాం. ఒక్కో గదిలో ఒక్కరు మాత్రమే ఉండాలి. పోటీలకు మినహాయించి మిగతా సమయంలో గది దాటి బయటకు వెళ్లకూడదు. తినేటప్పుడు మాత్రమే మాస్కు తీయాలి. మిగతా వేళల్లో కచ్చితంగా మాస్కుతోనే ఉండాలి. గదిలో ఉన్నా దాన్ని ధరించాల్సిందే. రోజు తప్పించి రోజు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆరోగ్యానికి సంబంధించి ప్రతి రోజు వాళ్లు మెయిల్‌ ద్వారా పంపించే ప్రశ్నలకు సమాధానమివ్వాలి. అలాగే వాళ్లు రూపొందించిన యాప్‌లో మనం ఎప్పుడు ఎక్కడ ఉంటున్నామో నమోదు చేయాలి. లేదంటే మనమీద అనుమానం కలిగే వీలుంది. హోటల్‌ నుంచి పోటీలు జరిగే వేదికకు తప్ప మరెక్కడికి వెళ్లడానికి అవకాశం లేదు. ఆ ప్రయాణంలో 25 నిమిషాల సమయం దొరకడంతో బస్సులో ఆటగాళ్లతో మాట్లాడేవాణ్ని. పోటీల సమయంలో సూచనలు ఇచ్చేవాణ్ని. ఇక్కడ ఎవరికీ స్వేచ్ఛ లేదు. కానీ ఈ పరిస్థితుల్లో అది తప్పదు. అత్యయిక స్థితి కారణంగా టోక్యో నిర్మానుష్యంగా ఉంది. ఇదే విధానం కొనసాగిస్తే ఈ ఏడాది జులై 23న ఆరంభం కానున్న ఒలింపిక్స్‌ను కూడా సమర్థంగా నిర్వహించగలరని అనిపిస్తోంది.
 

ఇక్కడ బబుల్‌లో..

ఈ మహమ్మారి పరిస్థితుల్లో టోర్నీల్లో పాల్గొనడం ఓ విభిన్నమైన అనుభూతి. అయితే గత ఆరు నెలలుగా ప్రత్యేక బబుల్‌ ఏర్పాటు చేసుకుని పుణేలో శిక్షణ శిబిరం కొనసాగించాం. కాబట్టి ఆ వాతావరణం మాకు అలవాటైంది. ఒలింపిక్స్‌ అర్హత టోర్నీకి ముందు ఎంతో జాగ్రత్తగా ఉన్నాం. క్రమం తప్పకుండా రోయర్లతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. బయటి వ్యక్తులను లోపలికి అనుమతించలేదు. రోయర్ల పట్ల కూడా కఠినంగానే వ్యవహరించారు. ఇప్పుడు దానికి ప్రతిఫలం దక్కింది. కోచ్‌గా నేనెంతో గర్వపడుతున్నా. నా శిక్షణలోని భారత బృందంలోని రోయర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం వరుసగా ఇది ఆరోసారి. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌ నుంచి మొదలు ఇప్పటివరకూ ప్రతిసారి విశ్వక్రీడల్లో రోయర్లు పాల్గొన్నారు. ఒక కోచ్‌గా నాకు ఇంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది. ఆరు నెలలుగా రోయర్లకు విశ్రాంతి లేదు కాబట్టి ఇప్పుడు ఓ చిన్న విరామం తీసుకుంటాం. ఆ తర్వాత ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతాం. ఆ క్రీడల్లో పతకమే లక్ష్యంగా శ్రమిస్తాం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన