మా తప్పులు తెలుసు

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 07:38 IST

మా తప్పులు తెలుసు

విరాట్‌ కోహ్లి

దుబాయ్‌: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తమ జట్టు చేసిన తప్పులు తెలుసని, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌.. పాక్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తయిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ల్లో దాయాది చేతిలో భారత్‌కిదే తొలి ఓటమి. ‘‘మ్యాచ్‌ ఎలా సాగిందో.. మేం ఎక్కడ తప్పులు చేశామో మాకు తెలుసు. దానిపై మాకు స్పష్టత ఉంది. జట్టుగా మేం ఎక్కడ విఫలమయ్యామో తెలుసుకోవడం మంచి విషయం. ఇప్పుడా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం. టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లాడాల్సి ఉంది. రాత్రి పూట మ్యాచ్‌ల్లో మంచు ప్రభావం కారణంగా ఈ టోర్నీల్లో టాస్‌ కీలకంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు వల్ల మొదట బ్యాటింగ్‌ చేసినప్పుడే అదనంగా పరుగులు చేయాలి. ఛేదనలో పిచ్‌ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారినప్పుడు మంచి ఆరంభం దొరికితే ఆత్మవిశ్వాసం వస్తుంది. పాక్‌ ఓపెనర్లకు అదే కలిసొచ్చింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ల తర్వాత మంచు ప్రభావం కనిపించింది. బంతి చక్కగా బ్యాట్‌ మీదకు వస్తుండడంతో డాట్‌ బాల్స్‌ కూడా వేసే అవకాశం దొరకలేదు. మేం అదనంగా మరో 25 పరుగులు చేయాల్సింది. కానీ తొలి ఆరు ఓవర్లలో పాక్‌ అద్భుత బౌలింగ్‌ కారణంగా అది సాధ్యం కాలేదు’’ అని కోహ్లి చెప్పాడు. తమ రెండో మ్యాచ్‌లో ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది. ఆ మ్యాచ్‌కు ముందు ఆరు రోజుల విరామం జట్టుకు ఉపయోగపడుతుందని కోహ్లి అన్నాడు. ‘‘అన్ని విధాలుగా ఈ ఆరు రోజుల విరామం మాకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే మేం పూర్తి సీజన్‌ క్రికెట్‌ ఆడేశాం. యూఏఈలోని కఠిన పరిస్థితుల్లో ఐపీఎల్‌ పూర్తి చేశాం. ఇప్పుడు అత్యంత తీవ్రమైన ప్రపంచకప్‌ ఆడుతున్నాం. ఇలాంటి టోర్నీ ఆడేందుకు జట్టుకు అవసరమైన ప్రధాన శారీరక స్థితి అందుకునేందుకు ఈ విరామం సాయపడుతుంది. జట్టుగా తిరిగి కలిసేందుకు, వ్యూహాలు సిద్ధం చేసుకునేందుకు ఇది మేలు చేస్తుంది’’ అని విరాట్‌ పేర్కొన్నాడు. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మద్దతుగా మ్యాచ్‌కు ముందు మోకాళ్లపై కూర్చోవాలన్నది జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయమని కోహ్లి వెల్లడించాడు. పాక్‌ కూడా మద్దతు తెలిపేందుకు ఒప్పుకుందని చెప్పాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన